అన్న చేతిలో తమ్ముడు హతం | Sakshi
Sakshi News home page

అన్న చేతిలో తమ్ముడు హతం

Published Sat, May 4 2024 9:20 AM

-

గుంతకల్లు రూరల్‌: చిన్నపాటి విషయానికి చోటు చేసుకున్న గొడవలో చివరకు అన్న చేతిలో తమ్ముడు హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... గుంతకల్లు మండలం నాగసముద్రం గ్రామానికి చెందిన నాగిరెడ్డి, నారాయణమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. పుట్టుకతోనే చెవుడు, మూగ కావడంతో పెద్ద కుమారుడు నారాయణరెడ్డికి తల్లిదండ్రులు వివాహం చేయలేకపోయారు. మరో కుమారుడు రామకృష్ణారెడ్డికి గుంతకల్లు మండలం సంగాల గ్రామానికి చెందిన శ్రీవాణితో వివాహమైంది. కుమార్తె బాలమ్మకు సొంతూరిలోనే పెద్దిరెడ్డి అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. కొన్ని రోజులుగా అన్నదమ్ములిద్దరూ మద్యానికి బానిసలయ్యారు. భర్త రామకృష్ణారెడ్డి ప్రవర్తనతో విసుగు చెందిన శ్రీవాణి ఇటీవల అతడిని వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది. గురువారం నారాయణరెడ్డి, తన బావ పెద్దిరెడ్డితో కలసి ఇంట్లోనే మందు పార్టీ ఏర్పాటు చేసుకున్నాడు. కాసేపటి తర్వాత మద్యం మత్తులో ఇద్దరూ గొడవపడ్డారు. ఆ సమయంలో వండిన ఆహారాన్ని నారాయణరెడ్డి బయట పడేసి వెళ్లిపోయాడు. ఈ విసయాన్ని బామ్మర్ది రామకృష్ణారెడ్డితో చెప్పి పెద్దిరెడ్డి బాధపడ్డాడు. దీంతో రామకృష్ణారెడ్డి తన అన్నను మందలిస్తూ చేయి చేసుకున్నాడు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత మద్యం మత్తులో ఇంటికి చేరుకున్న నారాయణరెడ్డి మంచంపై నిద్రిస్తున్న రామకృష్ణారెడ్డిపై కర్రతో విచక్షణారహితంగా దాడి చేయడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న గుంతకల్లు రూరల్‌ ఎస్‌ఐ సురేష్‌ శుక్రవారం ఉదయం అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు.

రోడ్డు ప్రమాదంలో మెడికో దుర్మరణం

మల్కాపురం (విశాఖ జిల్లా): శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మెడికో మృతి చెందగా.. మరో ఇద్దరు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. వివరాలు ఇలా.. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల ప్రాంతానికి చెందిన షేక్‌జానీ(19), అనంతపురం ప్రాంతానికి చెందిన సత్యకుమార్‌, శ్రీకాకుళానికి చెందిన ప్రమోద్‌లు కొమ్మదిలోని గాయత్రి మెడికల్‌ కళాశాలలో మెడిసిన్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. ఈ ముగ్గురు ఒకే ద్విచక్రవాహనంపై యారాడ, గంగవరం బీచ్‌కు శుక్రవారం తెల్లవారుజామున బయలుదేరారు. మల్కాపురం పోలీసు స్టేషన్‌ రోడ్డు నుంచి సింథియా వైపు వెళుతుండగా షిప్‌యార్డ్‌ కమర్షియల్‌ కాంప్లెక్స్‌ సమీపంలో ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో షేక్‌జానీ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సత్యకుమార్‌, ప్రమోద్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రాంతంలో డివైడర్‌ పనులు జరుగుతున్నాయి. తవ్విన వ్యర్థాలను తరలించేందుకు అక్కడ ట్రాక్టర్‌ వచ్చింది. ఇది గుర్తించలేని యువకులు ట్రాక్టర్‌ను ఢీకొట్టారు. తీవ్రంగా గాయపడిన వారిని కేజీహెచ్‌లో చేర్పించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది. విచారణ జరుపుతున్నామని మల్కాపురం ఇన్‌చార్జ్‌ సీఐ దాశరథి చెప్పారు.

రెచ్చిపోయిన టీడీపీ అల్లరిమూక

యల్లనూరు: శింగనమల నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణి ఎన్నికల ప్రచారంలో టీడీపీ అల్లరిమూక రెచ్చిపోయింది. దీంతో ప్రశాంతంగా ఉన్న యల్లనూరు మండలం గొడ్డుమర్రి గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వివరాలు... శుక్రవారం ఉదయం గొడ్డుమర్రిలో శ్రావణి ఎన్నికల ప్రచార సమయంలో టీడీపీకి చెందిన అల్లరి మూకలు ట్రాక్టర్లు, ద్విచక్రవాహనాలకు సైలెన్సర్లు తీసేసి హల్‌చల్‌ చేశారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ గిరిబాబు, సిబ్బంది అక్కడకు చేరుకుని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

ఎన్నికల కమిటీ సభ్యుల నియామకం

అనంతపురం కార్పొరేషన్‌: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అనంతపురం జిల్లాకు చెందిన నాయకులను ఎన్నికల కమిటీ సభ్యులుగా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. నియమితులైన వారిలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మిద్దె కుళ్లాయప్ప(శింగనమల), రాష్ట్ర కార్యదర్శిగా గౌస్‌ బేగ్‌(అనంతపురం), విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తిరువీధుల లోకేష్‌కుమార్‌ (అనంతపురం), విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శిగా ఎద్దుల నవీన్‌కుమార్‌ రెడ్డి (ఉరవకొండ), అనంతపురం జిల్లా ఎస్టీ సెల్‌ అధ్యక్షుడిగా గుజ్జల పోతులయ్య (అనంతపురం), జిల్లా ఎస్సీ సెల్‌ ఉపాధ్యక్షుడిగా లబ్బే రాఘవ (అనంతపురం), జిల్లా విద్యార్థి విభాగం ఉపాధ్యక్షుడిగా పల్లె వినోద్‌కుమార్‌రెడ్డి (తాడిపత్రి), అనంతపురం నగర కార్యదర్శిగా యు.లోక్‌నాథరెడ్డి, నగర కార్యదర్శిగా బి. రామమోహన్‌ రెడ్డి ఉన్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement