'సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి' | Sakshi
Sakshi News home page

'సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి'

Published Fri, Aug 22 2014 1:58 PM

హత్యారాజకీయాలకు గురైన బాధిత కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. రాజకీయ హత్యలపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై అసెంబ్లీలో జరిగిన చర్చలో వైఎస్ జగన్ మాట్లాడారు. తన ప్రసంగంలో ఆయన పలు విషయాలు ప్రస్తావించారు. 'నేను, కొడాలి నాని గొట్టిముక్కలకు వెళ్లాం. పోలీసులు ఏమాత్రం చర్యలు తీసుకోకపోవడానికి కారణం మంత్రిగారని అక్కడివాళ్లు ఆరోపించారు. అలాంటి ఆరోపణలు వచ్చాయనే నాని అన్నారు తప్ప అంతకన్నా నాని అన్నదేమీ లేదు. ఆమాత్రం దానికే మీరు అంతలా అంటున్నారు.. ఏ పాపం తెలియని నామీద మీరు, కాంగ్రెస్ పార్టీ వాళ్లు వెళ్లి కోర్టుల దాకా కూడా వెళ్తారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడేందుకు ఇదే చంద్రబాబు నాయుడుగారు సభలో అనుకూలంగా ఓట్లు వేయిస్తారు. చనిపోయిన 14 మంది కుటుంబాలకు భరోసా ఇవ్వాలని కోరుతున్నాం, పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరుతున్నాం. కనీసం మృతుల కుటుంబాలకు 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని అడుగుతున్నాం. కానీ ఇక్కడ మాత్రం కేవలం బురద చల్లడం మాత్రమే తప్ప.. కనీసం చనిపోయినవాళ్ల కుటుంబాలకు భరోసా ఇవ్వడానికి కూడా ప్రయత్నించడం లేదు.