భారత్లో 2.11 లక్షల కోట్ల పెట్టుబడులు | Sakshi
Sakshi News home page

భారత్లో 2.11 లక్షల కోట్ల పెట్టుబడులు

Published Mon, Sep 1 2014 4:35 PM

రాబోయే ఐదేళ్లలో భారతదేశంలో దాదాపు 2.11 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ ముందుకొచ్చింది. ప్రధానంగా మౌలిక సదుపాయాలు, స్మార్ట్ సిటీల నిర్మాణానికి ఈ మొత్తాన్ని అందిస్తామని తెలిపింది. అలాగే భారతదేశంలో బుల్లెట్ రైళ్లను ప్రవేశపెట్టడానికి కావల్సిన ఆర్థిక, సాంకేతిక సాయం మొత్తాన్ని అందించేందుకు తాము సిద్ధమని జపాన్ సంసిద్ధత వ్యక్తం చేసింది. అలాగే, ఇంతకుముందు జపాన్లో ఇంతకుముందు ఆరు భారతీయ అంతరిక్ష, రక్షణ సంస్థలపై ఉన్న నిషేధాన్ని కూడా ఎత్తేయడానికి అంగీకరించింది. భారత్, జపాన్ దేశాల మధ్య సంబంధాలు కేవలం ఆర్థిక సంబంధాలు మాత్రమే కాదని, రాజకీయ బంధాలను తాను సరికొత్త ఎత్తులకు తీసుకెళ్తానని ప్రధానమంత్రి నరేంద్రమోడీ చెప్పారు. జపాన్ పర్యటనలో భాగంగా ఆయన అక్కడి ప్రధాని షింజో అబెతో కలిసి సంయుక్తంగా విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. ఆయనేమన్నారంటే.. ''గంగానది ప్రక్షాళన గురించి నేను మాట్లాడగానే ఏం సాయం కావాలో అడగాలని కోరారు. మా దేశ అభివృద్ధిలో పాలుపంచుకున్నందువల్ల జపాన్కు కూడా లాభమే జరుగుతుంది. అక్కడి ప్రజలు అభివృద్ధి చెందడంతో పాటు జపాన్ కూడా ముందంజ వేస్తుంది. మన బంధాలు కేవలం ఆర్థిక సంబంధాలు కావు. ఇందులో ఇంకా చాలా కోణాలు ఇమిడి ఉన్నాయి. రాజకీయ సంబంధాలను సరికొత్త ఎత్తులకు తీసుకెళ్లాలనే యోచనలో మేమున్నాం'' అని జపాన్ ప్రధానమంత్రితో కలిసి సంయుక్తంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో నరేంద్రమోడీ చెప్పారు. కొసమెరుపు: జపాన్ పర్యటనలో కూడా నరేంద్రమోడీ హిందీలోనే మాట్లాడారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన అనువాదకుడు ఆయన ప్రసంగాన్ని జపనీస్ భాషలోకి అనువదించారు.