గణేష్‌ నిమజ్జనంపై హైకోర్టు కీలక ఆదేశాలు | Telangana HC Strictly Says Ban Immersion Of POP Ganesh Idols - Sakshi
Sakshi News home page

గణేష్‌ నిమజ్జనంపై హైకోర్టు కీలక ఆదేశాలు

Published Mon, Sep 25 2023 1:16 PM

Telangana HC Strictly Says ban immersion of POP Ganesh idols - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో గణేష్‌ నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (పీవోపీ) విగ్రహాలను హుస్సేన్‌ సాగర్‌, చెరువుల్లో నిమజ్జనం చేయవద్దని స్పష్టం చేసింది.

పీవోపీ విగ్రహాలన్నింటిని జీహెచ్ఎంసి ఏర్పాటు చేసిన కృత్రిమ తాత్కాలిక నీటి కుంటలలో నిమజ్జనం చెయ్యాలని హైకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది.  ఈ మేరకు హైకోర్టు ఉత్తర్వులను యధాతథంగా అమలు చేయాలని నగర సీపీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌లకు ఆదేశాలు జారీ చేసింది. 

గత వాదనల సమయంలోనే(సెప్టెంబర్‌ 8).. ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ (పీవోపీ)తో తయారు చేసిన గణేశ్‌ విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయరాదని .. ఈ విషయమై గత ఏడాది ఇచ్చిన ఉత్తర్వులు ఇప్పటికీ కొనసాగుతున్నాయని పేర్కొంది హైకోర్టు.

ఎవరెవరి వాదనలు ఎలాగంటే..
ఇదిలా ఉంటే.. పీవోపీ విగ్రహాల తయారీపై నిషేధం ఎత్తేయాలని.. సీపీసీబీ నిబంధనలను కొట్టేయాలని పేర్కొంటూ గణేశ్‌మూర్తి కళాకారుల సంక్షేమ సంఘం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ శ్రవణ్‌కుమార్‌ ధర్మాసనం విచారణ కొనసాగించింది. పిటిషనర్‌ల తరఫు న్యాయవాది..  ధూల్‌పేట్‌ వాసులకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపకుండా ప్రస్తుత ఉపాధిపై దెబ్బకొట్టడం సరికాదని పేర్కొన్నారు.

మరో న్యాయవాది వేణుమాధవ్‌ వాదనలు వినిపిస్తూ గత ఏడాది హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరిస్తూ పీవోపీ విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేశారని గుర్తు చేశారు. అయితే ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. హుస్సేన్‌సాగర్‌లో పీవోపీ విగ్రహాలను నిమజ్జనం చేయలేదని.. తాత్కాలిక కొలనుల్లో నిమజ్జనం చేశామని పేర్కొన్నారు.

Advertisement
Advertisement