Sakshi News home page

‘గాంధీ’లో ర్యాగింగ్‌కు పాల్పడిన 10 మందిఎంబీబీఎస్‌ విద్యార్థులపై వేటు

Published Tue, Sep 12 2023 1:21 AM

Hyderabad: 10 senior MBBS students at Gandhi Medical College suspended for a year for ragging - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/గాంధీ ఆస్పత్రి: ర్యాగింగ్‌కు పాల్పడిన వైద్య విద్యార్థులపై వేటు పడింది. హైదరాబాద్‌ గాంధీ మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ ఫస్టియర్‌ చదువుతున్న విద్యార్థులను ర్యాగింగ్‌ చేశారని తేలడంతో 10 మంది సీనియర్‌ విద్యార్థులను ఏడాదిపాటు కాలేజీ నుంచి సస్పెండ్‌ చేశారు. వారిని హాస్టల్‌ నుంచి కూడా తొలగించారు. ఈ మేరకు వైద్య విద్యా సంచాలకుడు (డీఎంఈ) డాక్టర్‌ రమేశ్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో ఆ వివరాలు వెల్లడించారు.

ఇటీవల కొత్తగా ఎంబీబీఎస్‌లో చేరిన విద్యార్థులను రెండు, మూడో ఏడాది చదివే కొందరు ఎంబీబీఎస్‌ విద్యార్థులు ర్యాగింగ్‌ చేసినట్టు నిర్ధారణ అయ్యింది. యూజీసీ ఆధ్వర్యంలోని యాంటీ ర్యాగింగ్‌ సెల్‌కు కూడా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో యూజీసీ నుంచి కూడా ర్యాగింగ్‌కు పాల్పడుతున్న విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రానికి ఆదేశాలు వచ్చాయి. మరోవైపు స్థానిక పోలీసులూ సమాచారం అందించారు. దీంతో తక్షణమే ర్యాగింగ్‌కు పాల్పడిన 10 మంది విద్యార్థులను సస్పెండ్‌ చేశారు. దీంతో వారు ఏడాదిపాటు కోర్సుకు దూరం కావాల్సి ఉంటుంది.

ర్యాగింగ్‌కు పాల్పడొద్దని అన్ని తరగతుల విద్యార్థులను పిలిపించి కౌన్సెలింగ్‌ చేశారు. చర్యలు తీసుకుంటే భవిష్యత్‌ పోతుందని కూడా హెచ్చరించారు. అయినా కొందరు సీనియర్లు కొత్తగా చేరిన ఎంబీబీఎస్‌ విద్యార్థులను అర్ధరాత్రి రెండు గంటలకు తమ గదులకు పిలిపించి మానసికంగా వేధించడం, బూతులు తిట్టడంతోపాటు డ్యాన్స్‌లు చేయించారు. భౌతికంగా దాడులు జరిగాయా లేదా అన్నదానిపై స్పష్టత లేదని సమాచారం. దీంతో యాంటీ ర్యాగింగ్‌ కమిటీ ఈ సంఘటనపై విచారణ జరిపి 10 మంది సీనియర్‌ విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడినట్టు గుర్తించింది.

వారి సస్పెండ్‌ కాలం పూర్తయిన తర్వాత వచ్చే ఏడాది మళ్లీ కాలేజీలో చేరినా, హాస్టల్‌ వసతి మాత్రం కల్పించబోమని డీఎంఈ స్పష్టం చేశారు. ర్యాగింగ్‌కు పాల్పడితే కాలేజీ నుంచి తీసేయాలన్న నిబంధనలు ఉన్నాయని, కానీ తాము వారి భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని ఏడాదిపాటు సస్పెండ్‌ వరకే పరిమితమయ్యామని వెల్లడించారు. ఇంకా ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడితే ర్యాగింగ్‌ నిరోధక నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని వివిధ మెడికల్‌ కాలేజీల్లోని విద్యార్థులందరినీ ఆయన హెచ్చరించారు.

Advertisement

What’s your opinion

Advertisement