సిటీ ఓటేస్తదా.. టూరేస్తదా.. | Sakshi
Sakshi News home page

సిటీ ఓటేస్తదా.. టూరేస్తదా..

Published Thu, Oct 26 2023 2:49 AM

Effect of weekend holiday on voting day - Sakshi

అసలే అర్బన్‌ ఓటర్ల నిరాసక్తత...  దానికి తోడు వారాంతపు సెలవులు.. వెరసి అర్బన్‌ ఓటింగ్‌ శాతంపై ప్రభావం చూపుతుందా? అనే ఆందోళన రాజకీయ పార్టీల నేతల్లో వ్యక్తమవుతోంది. చాలా నియోజకవర్గాల్లో అర్బన్‌ ఓటింగ్‌ బాగా పుంజుకున్న నేపథ్యంలో లాంగ్‌ వీకెండ్‌ ఎఫెక్ట్‌ ఏ మేరకు ఉంటుందన్న చర్చ  జరుగుతోంది.

సాక్షి, హైదరాబాద్‌: సాధారణంగా కార్పొరేట్‌ ఐటీ ఉద్యోగులు వారాంతపు సెలవుల్ని రకరకాలుగా ప్లాన్‌ చేస్తుంటారు. ఏ మాత్రం అవకాశం దొరికినా సొంతూర్లకు , హాలిడే టూర్స్‌కి చెక్కేస్తుంటారు. ఈ నేపధ్యంలో పోలింగ్‌ తేదీ నవంబరు 30 గురువారం   కావడంతో శుక్రవారం ఒక్కరోజు సెలవు పెడితే...4రోజుల పాటు లాంగ్‌ వీకెండ్‌ ట్రిప్‌ ప్లాన్‌ చేయవచ్చు కదా అనే ఆలోచన వారిలో వచ్చే అవకాశం లేకపోలేదు.

ఇప్పుడు ఇదే విషయం రాజకీయ పార్టీల్లో టెన్షన్‌ పుట్టిస్తోంది. మరోవైపు రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్‌ పశ్చిమ ప్రాంతంలో పట్టణీకరణ జోరు కొనసాగుతోన్న నేపధ్యంలో కొన్ని ప్రాంతాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య భారీగా పెరిగిందని ఎన్నికల సంఘం గణాంకాలు తెలియజేస్తున్నాయి.

పటాన్‌ చెరు...ఓటర్ల జోరు... 
గత 2018తో తాజా 2023 మధ్య చూస్తే.. పటాన్‌ చెరులో ఓటర్ల సంఖ్యలో అత్యధికంగా 35శాతం వృద్ధి నమోదైంది. అదే సమయంలో ఓటర్ల సంఖ్యాపరంగా చూస్తే అతిపెద్ద అసెంబ్లీ నియోజకవర్గంగా శేరిలింగంపల్లి తన స్థానాన్ని నిలుపుకుంది.  ఐటీ పరిశ్రమకు చిరునామాకు తోడుగా.. ఇటీవల వేగవంతమైన హౌసింగ్‌ బూమ్‌ కారణంగా హైదరాబాద్‌ పశ్చిమ ప్రాంతంలోని శేరిలింగంపల్లిలో గతంలో 5,75,542 లక్షల మంది ఓటర్లు ఉండగా అది 21.2శాతం పెరిగి  6,98,079 లక్షలకి చేరింది. ఇది రాష్ట్ర వ్యాప్త సగటు అయిన 13.15శాతంపెరుగుదలతో చాలా ఎక్కువ.  

రాష్ట్రవ్యాప్తంగానూ... 
పట్టణ ఓటర్ల పెరుగుదల హైదరా బాద్‌ పశ్చిమ ప్రాంతాలకే పరిమితం కాలేదు. నకిరేకల్‌ (ఎస్సీ) 28శాతం, ఆసిఫాబాద్‌ (ఎస్టీ) 20, కామారెడ్డి 19, కరీంనగర్‌ 19, నిజామాబాద్‌ (అర్బన్‌) 18శాతంతో  ఓటర్లు  భారీగా పెరిగారు. తెలంగాణ లోని పాత పట్టణ కేంద్రాలైన ఖమ్మం 15, వరంగల్‌ పశి్చమ 15, వరంగల్‌ తూర్పు 16శాతం  ఓటర్ల సంఖ్య పెరిగింది. 

గ్రేటర్‌ పరిధిలో స్వల్పమే... 
ఇందుకు భిన్నంగా హైదరాబాద్‌లోని  పలు నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య స్వల్పంగా మాత్రమే పెరిగింది. నాంపల్లి, మలక్‌పేట్, ముషీరాబాద్, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా, సనత్‌నగర్‌లో ఓటరు సంఖ్య పెరుగుదల శాతం సింగిల్‌ డిజిట్‌కే పరిమితమైంది.

రిజర్వుడ్‌ నియోజకవర్గాలుగా ఉన్న అశ్వారావుపేట, భద్రాచలం, వైరా, మధిర, స్టేషన్ ఘనపూర్‌ కూడా  సింగిల్‌ డిజిట్‌ వృద్ధిని మాత్రమే నమోదు చేశాయి. ఇక అత్యల్పంగా ఓటర్ల వృద్ధి నమోదైన ప్రాంతం మెదక్‌లోని దుబ్బాక. ఈ నియోజకవర్గంలో కేవలం 2% ఓటర్లు మాత్రమే పెరిగారు. 
పట్టణ ఓటర్లు ఏం చేస్తారో 

ఓటింగ్‌ ఉదాసీనత’కు పేరొందిన పట్టణ ఓటర్ల సంఖ్య పెరగడంతో  నేతల్లో ఒకింత ఆందోళన పెరి గింది. శని, ఆదివారాలు సెలవు ఉన్న ప్రైవేట్‌ కంపెనీల్లోని సిబ్బంది ఓటింగ్‌ రోజైన గురువారం కూడా కలిపి  లాంగ్‌ వీకెండ్‌లో భాగం చేసుకుంటే మాత్రం అది కచ్చితంగా ఓటింగ్‌ శాతాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Advertisement
Advertisement