Sakshi News home page

సింగరేణి ఎన్నికలు.. హైకోర్టును ఆశ్రయించిన కేంద్రం..

Published Sat, Oct 7 2023 7:13 PM

Central Labor Department Petition In High Court On Singareni Election - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో సింగరేణి ఎన్నికలపై మరో ట్విస్ట్‌ చోటుచేసుకుంది. సింగరేణి ఎన్నికలపై కేంద్ర కార్మిక శాఖ తాజాగా రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించింది. కార్మిక సంఘం ఎన్నికలకు సింగరేణి యాజమాన్యం సహకరించడంలేదని కేంద్ర కార్మిక శాఖ పిటిషన్‌ దాఖలు చేసింది. 

వివరాల ప్రకారం.. సింగరేణి ఎన్నికలపై కేంద్ర కార్మిక శాఖ హైకోర్టును ఆశ్రయించింది. సింగరేణిలో కార్మిక సంఘం ఎన్నికలకు సంస్థ యాజమాన్యం సహకరించడంలేదని హైకోర్టులో పిటిషన్‌ వేసింది. గత నెల 27న మీటింగ్‌కు సింగరేణి యాజమాన్యం హాజరుకాలేదని కేంద్రం పిటిషన్‌లో పేర్కొంది. సింగరేణి తుది ఓటర్ల జాబితాను ప్రకటించలేదని తెలిపింది. 

కోర్టు ఆదేశాలతో ఈనెల 28న ఎన్నికలు నిర్వహించేలా షెడ్యూల్‌  చేశామని కేంద్రం వెల్లడించింది. సింగరేణి సహాయ నిరాకరణ వల్ల ఎన్నికలకు వెళ్లలేకపోతున్నామని కేంద్రం పేర్కొంది. ఎన్నికల నిర్వహణకు సహకరించాలని సింగరేణి, ప్రభుత్వాన్ని ఆదేశించాలని కేంద్రం పిటిషన్‌లో కోరింది. ఇక, సింగరేణి అప్పీల్‌తో కలిపి కేంద్ర కార్మికశాఖ పిటిషన్‌పై ఈనెల 11న విచారణ చేపట్టనున్నట్టు హైకోర్టు తెలిపింది. 

అంతకుముందు.. కార్మిక సంఘాల ఎన్నికలు వాయిదా వేయాలని సింగరేణి యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో అక్టోబర్‌ 5న విచారణ జరిగిన విషయం తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అయ్యే వరకు కార్మిక సంఘాల ఎన్నికలు వాయిదా వేయాలని సింగరేణి యాజమాన్యం కోరింది. అయితే, ఈ నెలాఖరులోగా కార్మిక సంఘాల ఎన్నికలు పూర్తి చేయాలని ఇప్పటికే సింగిల్‌ జడ్జి తీర్పు ఇచ్చారు. సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును నిలిపివేయాలని సింగరేణి డివిజన్‌ బెంచ్‌ను సింగరేణి సంస్థ కోరింది. సింగరేణి యాజమాన్యం అభ్యర్థనపై స్పందన తెలపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేస్తూ సింగరేణి అప్పీలుపై తదుపరి విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర కార్మిక శాఖ హైకోర్టును ఆశ్రయించింది.

ఇది కూడా చదవండి: దసరా హాలీడే ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. ఏరోజున అంటే?

Advertisement

What’s your opinion

Advertisement