క్లాసెన్‌ మహోగ్రరూపం.. క్రికెట్‌ చరిత్రలో కనీవినీ ఎరుగని విధ్వంసం | Sakshi
Sakshi News home page

SA VS AUS 4th ODI: క్లాసెన్‌ మహోగ్రరూపం.. 13 ఫోర్లు, 13 సిక్సర్లతో విధ్వంసం

Published Fri, Sep 15 2023 8:55 PM

SA VS AUS 4th ODI: Klaasen Blasts With Huge Hundred, South Africa Scores Huge Score - Sakshi

వన్డే క్రికెట్‌ చరిత్రలో కనీవినీ ఎరుగని విధ్వంసం జరిగింది. సెంచూరియన్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న కీలకమైన నాలుగో వన్డేలో సౌతాఫ్రికా ఆటగాడు హెన్రిచ్‌ క్లాసెన్‌ మహోగ్రరూపం దాల్చాడు. 83 బంతుల్లో 13 ఫోర్లు, 13 సిక్సర్ల సాయంతో 174 పరుగులు చేశాడు. క్లాసెన్‌కు తొలుత రస్సీ వాన్‌ డర్‌ డస్సెన్‌ (65 బంతుల్లో 62; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), ఆఖర్లో డేవిడ్‌ మిల్లర్‌ (45 బంతుల్లో 82 నాటౌట్‌; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) తోడవ్వడంతో సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టాని​కి 416 పరుగుల అతి భారీ స్కోర్‌ చేసింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ మార్క్రమ్‌ (8) మినహా అందరూ పరుగులు చేశారు. క్వింటన్‌ డికాక్‌ (45), రీజా హెండ్రిక్స్‌ (28) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. 

క్లాసెన్‌ మహోగ్రరూపం.. క్రికెట్‌ చరిత్రలో కనీవినీ ఎరుగని విధ్వంసం
సిరీస్‌లో నిలబడాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఆటగాడు హెన్రిచ్‌ క్లాసెన్‌ మహోగ్రరూపం దాల్చాడు. కేవలం 57 బంతుల్లో శతక్కొట్టాడు. వన్డే క్రికెట్‌ చరిత్రలో ఇది ఐదో వేగవంతమైన శతకం. గతంలో క్లాసెన్‌ ఓసారి 54 బంతుల్లోనే సెంచరీ చేశాడు. వన్డేల్లో ఫాస్టెస్ట్‌ హండ్రెడ్‌ రికార్డు ఏబీ డివిలియర్స్‌ (31 బంతుల్లో) పేరిట ఉంది. ఈ మ్యాచ్‌లో క్లాసెన్‌ ఆడిన ఇన్నింగ్స్‌ వన్డే క్రికెట్‌ ఉన్నన్ని రోజులు గుర్తుంటుంది.

క్లాసెన్‌కు మిల్లర్‌ కూడా జతకలవడంతో ఆసీస్‌ బౌలింగ్‌ లైనప్‌ తునాతునకలైంది. వీరిద్దరి ధాటికి ఆసీస్‌ స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా 10 ఓవర్లలో రికార్డు స్థాయిలో 113 పరుగులు సమర్పించుకున్నాడు. జంపాతో పాటు స్టొయినిస్‌ (10-1-81-1), హాజిల్‌వుడ్‌ (10-0-79-2), నాథన్‌ ఇల్లిస్‌ (10-0-79-1), మైఖేల్‌ నెసర్‌ (10-0-59-1) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. కాగా, 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ప్రస్తుతం ఆసీస్‌ 2-1 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే సౌతాఫ్రికా సిరీస్‌ ఆవకాశాలు సజీవంగా ఉంటాయి. 

క్లాసెన్‌ పరుగులు ఇలా సాధించాడు..

  • తొలి హాఫ్‌ సెంచరీ: 38 బంతులు
  • రెండో హాఫ్‌ సెంచరీ: 19 బంతులు
  • మూడో హాఫ్‌ సెంచరీ: 20 బంతులు
  • ఆఖరి 24 పరుగులు: 6 బంతులు

ఈ ఇన్నింగ్స్‌లో క్లాసెన్‌ ఆఖరి 150 పరుగులను 58 బంతుల్లో చేయడం విశేషం.

క్లాసెన్‌-మిల్లర్‌ జోడీ కేవలం 94 బంతుల్లో 222 పరుగులు జోడించింది. క్రికెట్‌ చరిత్రలో ఇదే ఫాస్టెస్ట్‌ డబుల్‌ సెంచరీ భాగస్వామ్యం.

ఆస్ట్రేలియాపై రెండో ఫాస్టెస్ట్‌ హండ్రెడ్‌.. కోహ్లి 52 బంతుల్లో ఆసీస్‌పై శతక్కొట్టాడు.

వన్డేల్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా జంపా.. ఆసీస్‌కే చెందిన మిక్‌ లెవిస్‌ (113) రికార్డును సమం చేశాడు.

వన్డేల్లో అత్యధిక సార్లు (7) 400 స్కోర్‌ దాటిన సౌతాఫ్రికా

Advertisement

తప్పక చదవండి

Advertisement