Sakshi News home page

ODI World Cup 2023: వరల్డ్‌ కప్‌కు ముందు గాయాల బెడద.. ఏ జట్టు నుంచి ఎవరెవరంటే?

Published Tue, Sep 19 2023 2:10 PM

Full list of injured players ahead of ODI World Cup 2023 - Sakshi

క్రికెట్‌ ప్రేమికులు ఎంతో అతృతగా ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్‌-2023కు మరో 15 రోజుల్లో తెరలేవనుంది. దాదాపు పుష్కరకాలం తర్వాత ఈ మెగా ఈవెంట్‌కు భారత్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. ఆక్టోబర్‌ 5న అహ్మదాబాద్‌ వేదికగా ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ షురూ కానుంది. ఇప్పటికే ఈ టోర్నీ కోసం ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, భారత్ వంటి ప్రధాన దేశాలు తమ జట్లను కూడా ప్రకటించాయి.

ఈ మార్క్యూ ఈవెంట్‌ కోసం ఆయా జట్లు తమ ఆస్త్రాలను సిద్దంచేసుకుంటున్నాయి. అయితే ఈ టోర్నీలో పాల్గోనే దాదాపు ప్రతీ జట్టును గాయాల బెడద వెంటాడుతోంది. వరల్డ్‌కప్‌కు ముందు గాయాల బారిన పడిన ఆటగాళ్లపై ఓ లూక్కేద్దం. ముఖ్యంగా ఈ జాబితాలో శ్రీలంక ప్రథమ స్ధానంలో ఉంటుంది. లంక జట్టు నుంచి నలుగురు ఆటగాళ్లు గాయాలతో పోరాడుతున్నారు. 

వనిందు హసరంగా
వనిందు హసరంగా.. గత కొంత కాలంగా శ్రీలంక జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. స్టార్‌ ఆల్‌రౌండర్‌గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే సరిగ్గా ఆసియాకప్‌ ప్రారంభానికి ముందు హసరంగా గాయపడ్డాడు. 

లంక ప్రీమియర్‌ లీగ్‌లో హసరంగా మోకాలికి గాయమైంది. దీంతో అతడు ఆసియాకప్‌కు దూరమయ్యాడు. ఈ టోర్నీలో హసరంగా లేని లోటు శ్రీలంక జట్టులో సృష్టంగా కన్పించింది. హసరంగా ప్రస్తుతం కోలుకుంటున్నాడు. అతడు తిరిగి వరల్డ్‌కప్‌తో రీ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్‌ ఉంది.

మహేశ్ తీక్షణ
మహేశ్ తీక్షణ.. ఇటీవలే ముగిసిన ఆసియాకప్‌లో లెగ్‌స్పిన్నర్‌ థీక్షణ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. దురదృష్టవశాత్తూ భారత్‌తో ఫైనల్‌కు ముందు తీక్షణ గాయపడ్డాడు. థీక్షణ కూడా మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. అయితే వరల్డ్‌కప్‌ సమయానికి అతడు కోలుకుంటాడని లంక అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

దుష్మంత చమీర
శ్రీలంక స్టార్‌ పేసర్లలో దుష్మంత చమీర ఒకడు. కానీ గాయాల కారణంగా అతడు జట్టులో కంటే బయటే ఎక్కువగా ఉంటున్నాడు. భుజం గాయం కారణంగా జింబాబ్వేలో జరిగిన వన్డే  ప్రపంచకప్‌ క్వాలిఫైయర్స్‌కు దూరమయ్యాడు. అతడు తిరిగి కోలుకుని లంక ప్రీమియర్ లీగ్‌తో మైదానంలో అడుగుపెట్టాడు. అయితే మళ్లీ అతడి గాయం తిరగ బెట్టడంతో టోర్నీ మధ్యలోనే నిష్కమ్రించాడు. ఈ క్రమంలో ఆసియా కప్‌కు కూడా దూరమయ్యాడు. అయితే వరల్డ్‌కప్‌ సమయానికి చమీర కోలుకోవడం అనుమానమే.

దిల్షాన్ మధుశంక
23 ఏళ్ల దిల్షాన్‌ మధుశంక తన అరంగేట్ర మ్యాచ్‌లోనే  పేస్‌ బౌలింగ్‌తో అందరని అకట్టుకున్నాడు. ఇప్పటివరకు 6 వన్డేలు ఆడిన మధుశంక 10 వికెట్లు పడగొట్టాడు. మధుశంక ప్రస్తుతం కండరాల గాయంతో బాధపడుతున్నాడు. అతడు వరల్డ్‌కప్‌కు దూరమయ్యే ఛాన్స్‌ ఉంది.

శ్రేయస్‌ అయ్యర్‌, అక్షర్‌ పటేల్‌

శ్రేయస్‌ అయ్యర్‌ గాయం నుంచి కోలుకుని ఆసియాకప్‌తో రీఎంట్రీ ఇచ్చాడు. అయితే గాయం తిరగబెట్టడంతో ఈ టోర్నీలో ఒకే ఒక మ్యాచ్‌ ఆడాడు ఈ ముంబైకర్‌. ఇప్పుడు వరల్డ్‌కప్‌ అతడి అందుబాటుపై సందేహలు నెలకొన్నాయి. మరోవైపు ప్రపంచకప్‌కు ముందు ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ కూడా గాయపడ్డాడు. అక్షర్‌ ప్రస్తుతం మోచేతి గాయం బాధపడుతున్నాడు. అతడు ప్రస్తుతం ఏన్సీఏలో పునరవాసం పొందుతున్నాడు. అక్షర్‌ తిరిగి మళ్లీ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.

నసీం షా..
ఫాస్ట్‌ బౌలర్లకు పుట్టినిల్లు పాకిస్తాన్‌. అందులో ఒకడు యువ సంచలనం నసీం షా. తన పేస్‌ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. అయితే ఆసియాకప్‌లో టీమిండియాతో మ్యాచ్‌ సందర్భంగా నసీం షా భుజానికి గాయమైంది. దీంతో అతడు టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అయితే నసీం షా కోలుకోవడానికి దాదాపు నెల రోజుల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతడు వరల్డ్‌కప్‌కు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి.

హ్యారిస్‌ రవూఫ్‌..
హ్యారిస్‌ రవూఫ్‌ ప్రస్తుతం  పొట్ట కండరాల నొప్పితో బాధపడుతున్నాడు. అయితే అతడిని ముందు జాగ్రత్తగా ఆసియాకప్‌ టోర్నీ నుంచి పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు తప్పించింది. కాగా రవూఫ్‌ వరల్డ్‌కప్‌ నాటికి పూర్తి ఫిట్‌నెస్‌ సాధించే అవకాశం ఉంది.

కేన్‌ విలియమ్సన్‌
న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ గత కొంత కాలంగా ఆటకు దూరంగా ఉంటున్నాడు. ఐపీఎల్‌-2023 సందర్భంగా గాయపడిన విలియమ్సన్.. ఆ తర్వాత శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అప్పటనుంచి ఫిట్‌నెస్‌ సాధించే పనిలో కేన్‌మామ పడ్డాడు. ఈ క్రమంలో ప్రపంచకప్‌ జట్టులో విలియమ్సన్‌కు న్యూజిలాండ్‌ క్రికెట్‌ చోటు కల్పించింది. విలియమ్సన్‌ ప్రపంచకప్‌ నాటికి ఫిట్‌నెస్‌ సాధిస్తాడని న్యూజిలాండ్‌ ఆశలు పెట్టుకుంది. 

టిమ్‌ సౌథీ
విలియమ్సన్‌ గైర్హజరీలో కివీస్‌ జట్టును నడిపించిన స్టార్‌పేసర్‌ టిమ్‌ సౌథీ కూడా గాయపడ్డాడు. ఇంగ్లాండ్‌తో నాలుగో వన్డేలో క్యాచ్‌ పట్టే క్రమంలో కివీస్‌ సీనియర్‌ పేసర్‌ సౌథీ కుడిచేతి బొటన వేలికి గాయమైంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో.. అతడు వరల్డ్‌కప్‌లో ఆడేది అనుమానంగానే ఉంది.

మిచెల్‌ స్టార్క్‌
ఆస్ట్రేలియా స్టార్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ ప్రస్తుతం భుజం గాయం, గజ్జ నొప్పితో బాధపడుతున్నాడు. అయితే అతడు ఇంకా పూర్తి ఫిట్‌నెస్‌ సాధించికపోయనప్పటికీ వరల్డ్‌కప్‌కు సెలక్టర్లు ఎంపిక చేశారు. ప్రపంచకప్‌కు ముందు  స్టార్క్‌ కోలుకుంటాడని క్రికెట్‌ ఆస్ట్రేలియా భావిస్తోంది.



ట్రావిస్‌ హెడ్‌
ఆస్ట్రేలియా స్టార్‌ ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌ గాయం కారణంగా టోర్నీ ఫస్ట్‌ హాఫ్‌కు దూరమయ్యాడు. సౌతాఫ్రికాతో నాలుగో వన్డే సందర్భంగా అతడి ఎడమ చెయ్యి ఫ్రాక్చర్‌ అయింది. 

►ఇక పైన పేర్కొన్నవారు మాత్రమే కాకుండా మిగితా కొంతమంది ఆటగాళ్లు కూడా ఈ జాబితాలో ఉన్నారు.

అన్రిచ్ నార్ట్జే(దక్షిణాఫ్రికా- వెన్ను గాయం)
సిసంద మగల: (దక్షిణాఫ్రికా- మోకాలి గాయం)
నజ్ముల్ హొస్సేన్ శాంటో: (బంగ్లాదేశ్-మోకాలి గాయం)
స్టీవ్ స్మిత్: (ఆస్ట్రేలియా-మణికట్టు గాయం)
మార్క్ వుడ్:  (ఇంగ్లండ్- మడమ గాయం)
ఇమామ్ ఉల్ హక్ - (వెన్ను నొప్పి-పాకిస్తాన్)

Advertisement

What’s your opinion

Advertisement