Sakshi News home page

కాంగ్రెస్‌ కార్యకర్తలే నాకు సెక్యూరిటీ.. అలాంటి ఆఫీసర్లనే టార్గెట్‌ చేస్తున్నాం: రేవంత్‌రెడ్డి

Published Fri, Aug 18 2023 3:10 PM

Telangana PCC Chief Revanth Reddy Reacts on Police Protection Remove - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  ప్రజల కోసం పనిచేసే అధికారులపై తనకెప్పుడూ గౌరవం ఉంటుందని, అయితే ప్రభుత్వ అధికారులుగా ఉంటూ వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ గెలుస్తారని అంటున్న వాళ్ల విషయంలో సైలెంట్ గా ఎలా ఉంటామని కాంగ్రెస్‌ ఎంపీ, పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ప్రశ్నిస్తున్నారు. అసలు అధికారులకు రాజకీయాలతో ఏం సంబంధమని నిలదీస్తున్నారాయన. 

శుక్రవారం మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించిన ఆయన.. కోర్టు చెప్పినా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తనకు సెక్యూరిటీ ఇవ్వడం లేదన్నారు.  ఎంపీగా ఉన్నాను, జాతీయపార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న నాకు సెక్యూరిటీ తొలగిస్తారా?. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కి కావాల్సినంత సెక్యూరిటీ ఇచ్చాం. అయినా నేను ప్రజల మనిషిని నాకు సెక్యూరిటితో పనిలేదు. నేను సెక్యూరిటీ లేకుండ ఎక్కడికైనా వస్తాను. సెక్యూరిటీ లేకుండా ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలకు కేసీఆర్ రాగలరా? అని ప్రశ్నించారు. తనని ఓడించడానికే కేసీఆర్‌ పోలీసులను వాడుకుంటున్నారని ఆరోపించిన రేవంత్‌రెడ్డి.. సెక్యూరిటీ విషయంలో భయపెట్టాలని చూస్తే భయపడేవాడ్ని కాదన్నారు. లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు తన సైన్యమని, వాళ్లే తన సెక్యూరిటీ అని రేవంత్‌ అన్నారు. 

బీఆర్‌ఎస్‌ అలా చెప్పగలదా?
కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ మైనార్టీ అనే తేడా ఉండదు. కాంగ్రెస్ పార్టీలో మైనార్టీలు చాలా పెద్ద పొజిషన్లో ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ మైనార్టీల కోసం ఏం చేయలేదు. డబుల్ బెడ్ రూం ఇండ్లలో ఒక్క పర్సెంట్ మైనార్టీలకు కూడా దక్కలేదు. ఇక్కడ కారు బయల్దేరి ఢిల్లీకి చేరే వరకు అది కమలంగా మారిపోతోంది. బీఆర్ఎస్ కి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టే.  కేసీఆర్ మైనార్టీ ఓట్లను బీజేపీకి అమ్ముకుంటున్నారు. మైనార్టీలందరూ కాంగ్రెస్ వైపే చూస్తున్నారు. బీజేపీ తెచ్చిన ప్రతి ప్రజా వ్యతిరేక బిల్లుకి కేసీఆర్ మద్దతు ఇచ్చారు. బీజేపీ బీఆర్ఎస్ వేర్వేరు కాదు. బీజేపీ వ్యతిరేకంగా పోరాడుతున్నామని చెప్పడానికి ఎక్కడికైనా వస్తాం. బీజేపీ కి వ్యతిరేకంగా పోరాడుతున్నామని గుడి, మసీదు, చర్చి ఎక్కడికైనా వచ్చి చెప్తాం. బీఆర్ఎస్ వాళ్ళు అలా చెప్పగలరా?

అలాంటి వాళ్లనే అనేది..
అన్ని డిపార్ట్మెంట్లలో కొందరు అధికారులు ప్రభుత్వ తాబేదార్లుగా ఉంటారు. ప్రభుత్వానికి తొత్తులుగా పని చేసే అధికారుల పేర్లను తప్పకుండా రెడ్ బుక్ లో రాస్తాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అలాంటి అధికారులపై చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం కోసం కాంగ్రెస్ నాయకులపై తప్పుడు కేసులు పెట్టే వాళ్ళని వదిలిపెట్టం. ప్రభాకర్ రావు, రాధ కిషన్ రావు, భుజంగ రావు, నర్సింగ్ రావు లాంటి అధికారులనే నేను అనేది. 

రియల్‌ బూమ్‌ నాటకం
పది సంవత్సరాల్లో చేయనిది రెండు నెలల్లో ఎలా చేస్తారు? అని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై రేవంత్‌ మండిపడ్డారు. ఒక్క ఎకరానికి వంద కోట్లు పెట్టగలిగేలా బీఆర్ఎస్ నేతలు ఎదిగారు. పేద ప్రజలు మాత్రం పేదలుగానే ఉంటున్నారు. కోకాపేట, బుద్వేల్ లో భూములు కొన్న సంస్థల పేర్లు ఎందుకు చెప్పడం లేదు. కోకాపేట, బుద్వెల్ లో భూములు కొన్నది బీఆర్ఎస్ నాయకులు, కేసీఆర్ బీనామీలే. ఆర్టిఫీషియల్ బూమ్ క్రియేట్ చేసెందుకు బీఆర్ఎస్ నాయకులు అద్భుతమైన నాటకం ఆడారు అని విమర్శలు గుప్పించారు రేవంత్‌. 

నేనైనా అప్లై చేసుకోవాల్సిందే!
ఎన్నికల సమయం వచ్చినప్పుడు పొత్తుల గూర్చి ఏఐసీసీ చూసుకుంటుందని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునేవారు దరఖాస్తు చేసుకోవాల్సిందే. అది నేనైనా సరే అప్లై చేసుకోవాల్సిందే. ఒకరు ఒకటి కన్నా ఎక్కువ అఫ్లికేషన్లు పెట్టుకోవచ్చు అని రేవంత్‌ పేర్కొన్నారు. 

ఇదీ చదవండి: రాయదుర్గం మెట్రో భూమి తాకట్టు

Advertisement

What’s your opinion

Advertisement