డామిట్.. కథ అడ్డం తిరిగింది! | Sakshi
Sakshi News home page

డామిట్.. కథ అడ్డం తిరిగింది!

Published Thu, Apr 25 2024 6:15 PM

TDP Bhupesh Reddy Vs BJP Adinarayana reddy - Sakshi

నాడు బాబాయ్‌ కోసం అబ్బాయ్‌ ఎదురుచూపులు  

నేడు అబ్బాయ్‌ లేనిదే నియోజకవర్గంలో కదల్లేని బాబాయ్‌ 

జమ్మలమడుగు బీజేపీ అభ్యర్థి ఆది పరిస్థితి అగమ్యగోచరం 

సాక్షి ప్రతినిధి, కడప: ఎంతటి సమావేశమైనా సరే, ఆయన వచ్చేంతవరకూ వేచి ఉండాల్సిందే. కుటుంబ సభ్యులకైనా, అనుచరులకైనా, సన్నిహితులైనా ఎవరికైనా సరే, ఆయన చెప్పిందే వేదం, సూచించిందే ఫైనల్‌. మరీ ముఖ్యంగా బాబాయ్‌ మాట కోసం అబ్బాయ్‌కి ఎదురుచూపులు ఉండేవి. ఇదంతా గతం. ప్రస్తుతం కథ అడ్డం తిరిగింది. అబ్బాయ్‌ లేనిదే బాబాయ్‌ బయటికెళ్లలేని దుస్థితి ఎదురవు తోంది. ‘అహం బ్రహ్మస్మీ’ అన్నట్లుగా వ్యవహారం తల్లకిందులయ్యింది. నా అనుకున్న వారంతా ఛీదరించుకునే పరిస్థితి ఉత్పన్నమైంది. అబ్బాయ్‌ కోసం బాబాయ్‌ వెయిట్‌ చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. 

ఈమొత్తం వ్యవహారం జమ్మలమడుగు బీజేపీ అభ్యర్థి చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డికి వర్తించనుంది. ‘ఆది మాట తప్పడు, మడమ తిప్పడు’ అనే  నినాదంతో ఆదినారాయణరెడ్డి రాజకీయ ఆరంగ్రేటం చేశారు. అనతికాలంలోనే అవకాశవాదికి నిదర్శనం ‘ఆది’ అని ఆయన చర్యలు రుజువు చేశాయి. 2004లో డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి చలువ నీడలో ఎదిగిన ఆది తక్కువ కాలంలోనే సహజ సిద్ధమైన ప్రవర్తన బహిర్గతమవుతూ వచ్చింది. అప్పట్లో జిల్లాలోని నాయకులంతా వైఎస్‌ కుటుంబానికి అండగా పదవులు త్యజించేందుకు సిద్ధం అయ్యారు. అప్పటి అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా నిలిచారు. ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులుపై అనర్హత వేటు పడింది. కానీ అప్పట్లో ‘అసెంబ్లీలో కిరణ్‌...బయట జగన్‌’ అంటూ ఆదినారాయణరెడ్డి కొత్త పల్లవి అందుకున్నారు. 

అధికారాన్ని కోల్పోయేందుకు ఇష్టపడని ఆయన వైఎస్‌ కుటుంబానికి అండగా నిలువలేకపోయారు. కానీ   వైఎస్‌ కుటుంబం అండ లేకపోతే, గెలిచే పరిస్థితి లేదని 2014లో మళ్లీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిత్వం స్వీకరించి  జమ్మలమడుగు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కానీ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో ఆ పారీ్టలో చేరి ..మంత్రి పదవి దక్కించుకున్నారు. అంతటితో ఆగకుండా వైఎస్‌ కుటుంబంపై ఇష్టమొచ్చినట్లు దుర్భాషలాడారు. తొమ్మిదిన్నర్ర చెప్పుతో కొట్టాలన్నారు. ఫలితంగా  తర్వాత జరిగిన ప్రజాతీర్పులో ఆదినారాయణరెడ్డి కొట్టుకుపోయారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.  

కుటుంబంలోనూ ఏకాకిగా... 
కుటుంబంలో ఎప్పుడూ పైచేయిగా నిలిచే ఆదినారాయణరెడ్డి తాజా రాజకీయ పరిణామాల నేపధ్యంలో ఏకాకిగా మిగిలారు. విభజించు, పాలించు అన్న ధోరణిని వంటబట్టించుకున్న ఆయన దేవగుడి కుటుంబంలో అన్న కుమారుడు భూపేష్‌రెడ్డి రాజకీయ వారసత్వానికి బ్రేకులు వేశారు. మరో సోదరుల తనయులు గోవర్ధన్‌రెడ్డి, రాజే‹Ùరెడ్డిలను చేరదీశారు. ఒక్కమాటలో చెప్పాలంటే భూపేష్‌ రెడ్డికు ప్రత్యామ్నాయంగా తయారు చేశారు. ‘టీడీపీ ఇన్‌ఛార్జిగా తీసుకోవడం కాదు, టికెట్‌ తెచ్చుకోవడం గొప్ప. బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంటుంది, బీజేపీ టికెట్‌ తనకే ఇస్తుందని’ ఏడాదికి ముందు నుంచే ఆదినారాయణరెడ్డి సన్నిహితులతో చెప్పుకుంటూ వచ్చారు. అచ్చం అదే తీరులో పొత్తు పొడవడం, ఆదికి బీజేపీ టికెట్‌ దక్కడం క్రమంగా తెరపైకి వచ్చాయి. అప్పటి వరకూ రాజకీయంగా బలోపేత చర్యలు చేపట్టిన భూపేష్‌ నిర్ఘాంతపోయారు. 

జమ్మలమడుగులో సీన్‌ రివర్స్‌
ఆదికి బీజేపీ టికెట్‌ ప్రకటించిన తర్వాత నాలుగు రోజులైనా స్వగ్రామంలో అడుగు పెట్టని పరిస్థితి తలెత్తింది. కుటుంబం యావత్తు భూపేష్‌కు అండగా నిలిచింది. స్వతంత్ర అభ్యరి్థగా రంగప్రవేశం చేయాలనే ఆలోచనకు వచ్చినట్లు సమాచారం. ఈ పరిస్థితిని పసిగట్టిన ఆది కొంత ఓపిక పట్టారు. భూపే‹Ùకు టీడీపీ పార్లమెంటు టికెట్‌ అప్పగించేంత వరకూ వేచి ఉండి తర్వాత అడుగుపెట్టారు. ఇక తామంతా ఒక్కటేనంటూ చెప్పుకోవాల్సిన దుస్థితి ఆదినారాయణరెడ్డి వచ్చి చేరింది.

జమ్మలమడుగు పర్యటనల్లో భూపేష్‌ కోసం ఆదినారాయణరెడ్డి ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంతకు మనకు అండగా ఉంటున్నాడా? లేదా? అని సన్నిహితులతో క్రాస్‌ చెక్‌ చేసుకోవాల్సిన దౌర్భాగ్యం నెలకొంది. మరోవైపు గ్రామస్థాయి నాయకులు బీజేపీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డిని విశ్వసించే పరిస్థితి లేదు. సన్నిహితులే కాదు, సమీప బంధువులు సైతం దూరమవుతున్నారు. ఈక్రమంలోనే జమ్మలమడుగుకు మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి సైతం వైఎస్సార్‌సీపీలో చేరిపోయారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆది పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారయ్యిందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. అడుగడుగునా అవకాశవాదం తెరపైకి వస్తుండడమే ఇలాంటి దుస్థితికి కారణమని పలువురు చెప్పుకుంటున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement