దేవుళ్లపై ఒట్లు పెట్టుడు..కేసీఆర్‌ను తిట్టుడు.. ఏపీలో జగన్‌ మళ్లీ అధికారంలోకి | Sakshi
Sakshi News home page

దేవుళ్లపై ఒట్లు పెట్టుడు..కేసీఆర్‌ను తిట్టుడు

Published Wed, Apr 24 2024 5:02 AM

BRS Leader KCR comments on Congress government - Sakshi

కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనపై కేసీఆర్‌ వ్యాఖ్యలు 

నన్ను బదనాం చేసేందుకే రేవంత్‌ అసంబద్ధ ఆరోపణలు 

కాళేశ్వరాన్ని ఎలా వాడుకోవాలో తెలియని అసమర్థ ప్రభుత్వమిది 

లిక్కర్‌ కేసు నుంచి కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తుంది 

లోక్‌సభ ఎన్నికల్లో 8 నుంచి 12 స్థానాల్లో గెలుస్తాం 

కాంగ్రెస్‌కు చెందిన కొందరు నాయకులు టచ్‌లో ఉన్నారు 

సందర్భాన్ని బట్టి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటును కొట్టి పారేయలేం 

ఏపీలో జగన్‌ మళ్లీ అధికారంలోకి... 

సాక్షి, హైదరాబాద్‌: ‘దేవుళ్ల మీద ఒట్లు.. కేసీఆర్‌ మీద తిట్లు’ అనే రీతిలో తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలన సాగుతోందని భారత్‌ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు విమర్శించారు. కేసీఆర్‌ను బదనాం చేయడం ద్వారా పబ్బం గడుపుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌ అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. మంగళవారం ఓ టీవీ చానల్‌కు సుదీర్ఘంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై  కేసీఆర్‌ మాట్లాడారు.

పదేళ్ల పాలనలో విద్యుత్, తాగునీటి రంగాల్లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన కృషిని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద కేవలం మేడిగడ్డ బ్యారేజీ మూడు పిల్లర్లలో ఏర్పడిన సమస్యను పరిష్కరించకుండా తనను అప్రతిష్ట పాలు చేసేందుకు ప్రస్తుత ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. ఇది కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకోవడం తెలియని అసమర్థ ప్రభుత్వమని విమర్శించారు. తన కళ్ల ముందే తెలంగాణను నాశనం చేస్తానంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు.  

మోదీ పాప కృత్యానికి పాల్పడ్డారు 
ఢిల్లీ లిక్కర్‌ కేసు ప్రధాని మోదీ పొలిటికల్‌ స్కామ్‌లో భాగమని కేసీఆర్‌ పేర్కొన్నారు. తన కూతురు కవిత అరెస్టు ద్వారా మోదీ పాప కృత్యానికి పాల్పడ్డారని విమర్శించారు. లిక్కర్‌ కేసు నుంచి కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ నుంచి పిడికెడు మంది నేతలు మాత్రమే బయటకు వెళ్లారని, కడియం శ్రీహరి రాజకీయంగా తనను తానే భూస్థాపితం చేసుకున్నాడని వ్యాఖ్యానించారు. రేవంత్‌ ఏక్‌నాథ్‌ షిండే అవుతాడని బీజేపీ నేతలు అంటున్నా ఆయన ఖండించడం లేదన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారతాయని చెప్పారు. బీఆర్‌ఎస్‌ పార్టీని తిరిగి టీఆర్‌ఎస్‌గా మార్చే అవకాశం లేదని స్పష్టం చేశారు.  

ఫోన్‌ ట్యాపింగ్‌పై చిల్లర ఆరోపణలు 
ఫోన్‌ ట్యాపింగ్‌ సీఎంకు సంబంధించిన వ్యవహారం కాదని, తనపై చిల్లర ఆరోపణలు చేస్తున్నారంటూ కేసీఆర్‌ కొట్టి పారేశారు. కేసీఆర్‌ ఇమేజీని డ్యామేజ్‌ చేయాలనే ప్రయత్నం నెరవేరదని, ప్రజలు అన్నీ గమనించి బుద్ధి చెప్తారని అన్నారు. కాంగ్రెస్‌కు చెందిన కొందరు నాయకులు తమ పార్టీ నేతలతో టచ్‌లో ఉన్నారని, సందర్భాన్ని బట్టి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటును కొట్టి పారేయలేమని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.  

నేనే సీఎం అవుతా.. 
కేసీఆర్‌ ప్రజ్వలంగా, ఉజ్వలంగా రాష్ట్ర రాజకీయాల్లోకి తిరిగి వస్తాడని, మళ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ 98 స్థానాల్లో  గెలుస్తుందని, తానే సీఎంను అవుతానని మాజీ ముఖ్యమంత్రి చెప్పారు. సమయం సందర్భాన్ని బట్టే నాయకులు తయారవుతారని, కేటీఆర్, హరీశ్‌రావు సహా ఎవరినీ తాను ఉద్దేశపూర్వకంగా ప్రోత్సహించలేదని అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ 8 నుంచి 12 స్థానాల్లో విజయం సాధిస్తుందని, బీజేపీకి ఒక సీటుకు మించి వచ్చే పరిస్థితి లేదని చెప్పారు. ఆంధ్రాలో ఎవరు గెలిచినా తమకు సంబంధం లేదని, ఎవరు అధికారంలోకి వచ్చినా తమకు బాధలేదని పేర్కొన్నారు. అయితే వైఎస్‌ జగన్‌ మళ్లీ అధికారంలోకి వస్తారనే సమాచారం తమకు ఉందని కేసీఆర్‌ తెలిపారు.    

Advertisement
Advertisement