Sakshi News home page

Rajasthan Assembly Elections: పైసా కూడా లేకుండా పోటీకి దిగిన అభ్యర్థులు వీరే!

Published Sat, Nov 25 2023 10:50 AM

Poorest Candidates of Rajasthan do not have a Single Rupee - Sakshi

రాజస్థాన్‌లోని 199 అసెంబ్లీ స్థానాలకు ఈరోజు (నవంబర్ 25) పోలింగ్ జరుగుతోంది. అన్ని పార్టీల నుంచి 1862 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రాజస్థాన్ సహా మరో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న వెలువడనున్నాయి. ఈసారి దేశంలోని అందరి దృష్టి రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైనే ఉంది. ఇక్కడ బీజేపీ-కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ నెలకొంది.

రాజస్థాన్ ఎన్నికల్లో వందల కోట్ల ఆస్తులు కలిగిన అభ్యర్థులు పోటీకి దిగారు. అదేసమయంలో ఒక్క రూపాయి కూడా ఆస్తి లేని అభ్యర్థులు కూడా ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పలువురు అభ్యర్థులు తమ అఫిడవిట్లలో తమ దగ్గర ఒక్క రూపాయి ఆస్తి కూడా లేదని పేర్కొన్నారు. 

1. బన్వారీ లాల్ శర్మ: అల్వార్ జిల్లాలోని తనగాజీ స్థానం నుండి బహుజన్ సమాజ్ పార్టీ నుంచి పోటీకి దిగిన అభ్యర్థి బన్వారీ లాల్ శర్మ. ఆయన తన ఆస్తులను జీరోగా ప్రకటించారు.

2. హేమంత్ శర్మ: అల్వార్ జిల్లాలోని బెహ్రోర్ స్థానం నుండి పోటీ చేస్తున్న ఇండియన్ పీపుల్స్ గ్రీన్ పార్టీ అభ్యర్థి, న్యాయవాది హేమంత్ శర్మకు కూడా తనకు ఆస్తులు లేవని తెలిపారు.

3. దీపక్ కుమార్ మీనా: సామ్రాట్ మిహిర్ భోజ్ సమాజ్ పార్టీకి చెందిన దీపక్ కుమార్ మీనా.. సవాయ్ మోథ్‌పూర్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈయన దగ్గర కూడా ఎలాంటి ఆస్తి లేదు.

4. బద్రీలాల్: ఆజాద్ సమాజ్ పార్టీకి చెందిన బద్రీలాల్ (కాన్షీరామ్) ఝలావర్ జిల్లాలోని ఎస్సీ రిజర్వ్‌డ్ దాగ్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన తన అఫిడవిట్‌లో తన ఆస్తులు సున్నా అని తెలియజేశారు.

5. నహర్ సింగ్: నహర్ సింగ్.. మజ్దూర్ కిసాన్ అకాలీ దళ్ టిక్కెట్‌పై గంగానగర్ జిల్లాలోని ఎస్‌సీ రిజర్వ్‌డ్ స్థానం రాయసింగ్‌నగర్ నుండి పోటీ చేస్తున్నారు. ఈయనకు కూడా ఎలాంటి ఆస్తి లేదు.

6. కన్హయ్యలాల్: కన్హయ్యలాల్ బికనీర్ జిల్లాలోని నోఖా స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తనకు ఒక్క రూపాయి కూడా ఆస్తి లేదని ఆయన తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

7. వేద్ ప్రకాష్ యాదవ్: తనకు ఒక్క రూపాయి కూడా ఆస్తులు లేవని ప్రకటించిన వేద్ ప్రకాష్ యాదవ్ అల్వార్ జిల్లాలోని ముండావర్ స్థానం నుంచి పోటీకి దిగారు

8. పురుషోత్తం భాటి: పురుషోత్తం భాటి అజ్మీర్ జిల్లాలోని బీవార్ ప్రాంతం నుంచి పోటీ చేస్తున్నారు. తనకు ఎలాంటి ఆస్తులు లేవని ఆయన అఫిడవిట్‌లో పేర్కొన్నాడు.

రూ.500 ఆస్తుల యజమానులు
మరోవైపు తమ వద్ద రూ.500 మేరకు ఆస్తులున్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్న అభ్యర్థులు కూడా ఉన్నారు. బహుజన్ శోషిత్ సమాజ్ సంఘర్ష్ సమతా పార్టీకి చెందిన కుసుమ్ లత హిందౌన్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. బహుజన్ ముక్తి పార్టీకి చెందిన చంద్ర కుమార్ చిత్తోర్‌గఢ్ జిల్లాలోని నింబహెరా నుండి పోటీ చేస్తున్నారు. వీరిద్దరూ తమ వద్ద రూ.500 మేరకు ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: ఈ వీఐపీ సీట్లపైనే అందరి దృష్టి!

Advertisement

What’s your opinion

Advertisement