బీబీసీ యజమాని ఎవరు? సంస్థకు సొమ్ము ఎలా వస్తుంది? | Sakshi
Sakshi News home page

బీబీసీ యజమాని ఎవరు? సంస్థకు సొమ్ము ఎలా వస్తుంది?

Published Sun, Aug 20 2023 9:35 AM

Who Owns The BBC and how does it Operate - Sakshi

గత ఫిబ్రవరిలో ఆదాయపు పన్ను శాఖ బృందం ‘సర్వే’ కోసం బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) కార్యాలయాలను పరిశీలించింది. ఢిల్లీ, ముంబైలలోని బీబీసీ కార్యాలయాల్లో పరిశీలనలు మాత్రమే జరుగుతున్నాయని, సోదాలు చేయడం లేదని (సీబీడీటీ )సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ సీనియర్ అధికారి ఒకరు నాడు స్పష్టం చేశారు. అయితే ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అవకతవకలను తనిఖీ చేసేందుకు పన్ను అధికారులు పలు పత్రాలను పరిశీలిస్తున్నట్లు అప్పట్లో మరో అధికారి తెలిపారు. ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్' అనే డాక్యుమెంటరీని బీబీసీ ప్రసారం చేసిన కొన్ని వారాల తర్వాత ఐటీ అధికారులు ఈ చర్యలు చేపట్టడం విశేషం. అలాగే భారత ప్రభుత్వం బీబీసీ వలసవాద మనస్తత్వం కలిగి ఉందని ఆరోపించింది. 

యజమాని ఎవరు?
బీబీసీ 1922, అక్టోబరు 18 న ఒక ప్రైవేట్ కంపెనీగా ఆవిర్భవించింది. అప్పట్లో దీనిని బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీగా పిలిచేవారు. ప్రారంభంలో ఈ వ్యాపారంలో తనను తాను నిరూపించుకోవడానికి బీబీసీ ఎన్నో కష్టాలు పడింది. 1926 సార్వత్రిక సమ్మె సమయంలో విస్తృతమైన కవరేజ్ అందించి, బీబీసీ బ్రిటిష్ ప్రజల ఆదరణను చూరగొంది. అదే సంవత్సరంలో, పార్లమెంటరీ కమిటీ సిఫార్సు ద్వారా బీబీసీ ప్రైవేట్ కంపెనీ నుండి పబ్లిక్ కార్పొరేషన్‌గా మార్పుచెందింది. దీనితో కంపెనీ.. పార్లమెంటుకు జవాబుదారీతనం కలిగివుండాలని నిర్ణయించారు. కానీ బీబీసీ దాని పని తీరు విషయంలో స్వతంత్రంగా వ్యవహరిస్తుంది. బీబీసీని జాన్ రీత్ (1889–1971) స్థాపించారు. 1922లో బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీగా సంస్థను స్థాపించినప్పుడు దాని మొదటి జనరల్ మేనేజర్‌గా, 1927లో పబ్లిక్ కార్పొరేషన్‌గా మారినప్పుడు దాని మొదటి డైరెక్టర్ జనరల్‌గా వ్యవహరించారు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో నాజీ ప్రచార సాధనాలను ఎదుర్కొనేందుకు బ్రిటిష్ ప్రభుత్వం మరో సమాచార మంత్రిత్వ శాఖను సృష్టించింది. దీనికి జాన్ రీత్‌ను సమాచార మంత్రిగా నియమించింది. ఐరోపాలో హిట్లర్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయడం, బ్రిటిష్ ప్రజలను మానసికంగా యుద్ధానికి సిద్ధం చేయడం అతని పనిగా ఉండేది.

డబ్బు ఎక్కడ నుండి వస్తుంది?
బీబీసికి వచ్చే నిధులలో ఎక్కువ భాగం వార్షిక టెలివిజన్ ఫీజు ద్వారా వస్తుంది. ఇదే కాకుండా, బ్రిటన్ పార్లమెంట్ కూడా బీబీసీకి గ్రాంట్ల ద్వారా నిధులు సమకూరుస్తుంది. బీబీసీకి ఇతర ఆదాయ వనరులు బీబీసీ స్టూడియోస్, బీబీసీ స్టూడియోవర్క్స్.

భారతదేశంలో ఎప్పుడు ప్రారంభమైంది?
బీబీసీ భారతదేశంలో రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో 1940 మే 11న ప్రారంభమైంది. విశేషమేమిటంటే, ఈ తేదీన విన్‌స్టన్ చర్చిల్ బ్రిటన్ ప్రధానమంత్రి అయ్యారు. భారతదేశంలో బీబీసీని ప్రారంభించడం వెనక ఉద్దేశ్యం భారత ఉపఖండంలోని సైనికులకు వార్తలను అందించడమే. బీబీసీ హిందీ డాట్‌ కామ్‌ 2001లో ప్రారంభమమైంది.
ఇది కూడా చదవండి: అమేథీతో గాంధీ- నెహ్రూ కుటుంబానికున్న సంబంధం ఏమిటి?

Advertisement
Advertisement