లాంగ్‌ కోవిడ్‌తో అవయవాలకు ముప్పు | Sakshi
Sakshi News home page

లాంగ్‌ కోవిడ్‌తో అవయవాలకు ముప్పు

Published Sun, Sep 24 2023 5:38 AM

Multiorgan MRI findings after hospitalisation with COVID-19 in the UK  - Sakshi

లండన్‌: కోవిడ్‌–19 మహమ్మా రి బారినపడి, ఆసుపత్రిలో చికిత్స తర్వాత ఆరోగ్యం మెరుగైన వారిలో కూడా అవయవాలు దెబ్బతింటున్నట్లు యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే)లో వివిధ యూనివర్సిటీల సైంటిస్టులు సంయుక్తంగా నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. లాంగ్‌ కోవిడ్‌తో శరీరంలోని కొన్ని ప్రధాన అవయవాలు క్రమంగా పనిచేయడం ఆగిపోతున్నట్లు గుర్తించామని పరిశోధకులు చెప్పారు.

కరోనా బాధితుల మ్యాగ్నెటిక్‌ రెసోనెన్స్‌ ఇమేజింగ్‌(ఎంఆర్‌ఐ) స్కానింగ్‌లతో ఈ విషయం కనిపెట్టినట్లు వెల్లడించారు. ముఖ్యంగా ఊపిరితిత్తులు, మెదడు, మూత్రపిండాలకు లాంగ్‌ కోవిడ్‌ ముప్పు మూడు రెట్లు అధికంగా పొంచి ఉందని అన్నారు. మనిషిపై దాడి చేసిన కరోనా వైరస్‌ తీవ్రతను బట్టి ముప్పు తీవ్ర కూడా పెరుగుతున్నట్లు తెలియజేశారు. ఈ అధ్యయనం వివరాలను ‘లాన్సెట్‌ రెస్పిరేటరీ మెడిసిన్‌’ పత్రికలో ప్రచురించారు. 259 మంది కరోనా బాధితులపై అధ్యయనం నిర్వహించారు.

ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యాక 5 నెలల తర్వాత వారి ఎంఆర్‌ఐ స్కానింగ్‌ రిపోర్టులను క్షుణ్నంగా పరిశీలించారు. కరోనా సోకని వారితో పోలిస్తే వారి శరీరంలోని ప్రధాన అవయవాల్లో కొన్ని వ్యత్యాసాలను గుర్తించారు. అన్నింటికంటే ఊపరితిత్తులే అధికంగా ప్రభావితం అవుతున్నట్లు తేల్చారు. గుండె, కాలేయం ఏమాత్రం దెబ్బతినడం లేదని గమనించారు. లాంగ్‌ కోవిడ్‌కు మరింత ప్రభావవంతమైన చికిత్సలను అభివృద్ధి చేయడానికి ఈ అధ్యయనం తోడ్పడుతుందని సైంటిస్టులు చెబుతున్నారు.

Advertisement
Advertisement