Sakshi News home page

ఈ మేక ధర.. కేకో కేక

Published Tue, Nov 21 2023 2:52 AM

- - Sakshi

అంబాజీపేట: ఒళ్లంతా విపరీతంగా పెరిగిపోయిన ఊలుతో కనిపిస్తున్న దీనిని పొట్టేలు అనుకునేరు! ఇదో మేక.. అలాగని ఇది ఆషామాషీ మేక కాదు.. దీని రేటు వింటే కళ్లు తేలవేయడం ఖాయం. మామూలుగా మన దేశవాళీ మేక ఖరీదు మహా అయితే ఓ ఇరవై వేల రూపాయలుంటుంది. కానీ ఈ మేక రేటు ఏకంగా ఒకటిన్నర లక్షలు. ‘చిగు’ జాతికి చెందిన ఈ మేకలు హిమాలయ పర్వత ప్రదేశాల్లో ఉత్తర ప్రదేశ్‌కు ఉత్తరంగా, హిమాచల్‌ ప్రదేశ్‌కు ఈశాన్యంగా లభిస్తూంటాయి.

ఎక్కువగా తెలుపు రంగులో, వంపులు తిరిగిన పెద్ద పెద్ద కొమ్ములు కలిగి, సుమారు 50 కేజీల బరువు ఉంటాయి. హిమాలయాల్లో చలి ఎక్కువగా ఉండటంతో వీటి శరీరంపై ఊలు చాలా పొడవుగా పెరుగుతుంది. దీనిని శాలువాల తయారీకి వినియోగిస్తారు. అంబాజీపేట మండలం మాచవరానికి చెందిన అడబాల వెంకటేశ్వరరావుకు పశు పోషణ అంటే ఎంతో ఇష్టం. పుంగనూరు ఆవులు, గిత్తలు, విభిన్నంగా ఉండే మేకలు, చెవుల పిల్లుల వంటి వాటిని పెంచుతూ కొన్నాళ్ల తర్వాత లాభానికి విక్రయిస్తూంటారు.

ఆయన ఈ మేకను నేపాల్‌లో రూ.1.50 లక్షలకు కొనుగోలు చేశాడు. మాచవరంలో జరిగిన పార్వతీ రాజరాజేశ్వర స్వామి ఆలయ గాలి గోపురం, ఇతర ప్రారంభోత్సవ కార్యక్రమాలకు వెంకటేశ్వరరావు వద్ద ఉన్న పుంగనూరు ఆవు, దూడను తీసుకువచ్చారు. వీటితో పాటు ఆయన ఈ ‘చిగు’ జాతి మేకను కూడా అక్కడకు తీసుకువచ్చారు. వింతగా ఉన్న ఈ మేకను పలువురు ఆసక్తిగా తిలకించారు.

Advertisement

What’s your opinion

Advertisement