Sakshi News home page

పెట్టుబడికి సోషల్‌ రూట్‌..?

Published Mon, Oct 2 2023 4:41 AM

Social Media Impact on Your Investments - Sakshi

ఇటీవలి స్టాక్‌ మార్కెట్‌ రికార్డుల ర్యాలీ కొత్త ఇన్వెస్టర్లను పెద్ద ఎత్తున ఆకర్షిస్తోంది. కొత్త డీమ్యాట్‌ ఖాతాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. డీమ్యాట్‌ ఖాతాల సంఖ్య 2023 జూలై నాటికి 12.3 కోట్లు దాటిపోయింది. 2020 మార్చి నాటికి ఉన్న 4 కోట్లతో పోలిస్తే మూడేళ్లలోనే మూడు రెట్లు పెరిగాయి. అంటే మార్కెట్లోకి కొత్త ఇన్వెస్టర్ల రాక ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. (టేబుల్‌–గడిచిన 12 నెలల్లో డీమ్యాట్‌ ఖాతాల తీరు).

తమ పెట్టుబడులు అనతి కాలంలోనే భారీ రాబడులు ఇవ్వాలనే ఆకాంక్ష కొత్త ఇన్వెస్టర్లలో సహజంగానే కనిపిస్తుంటుంది. ఫలితంగా మలీ్టబ్యాగర్ల కోసం జల్లెడ పడుతుంటారు. గతంలో అయితే స్టాక్స్‌లో పెట్టుబడి కోసం కుటుంబ సభ్యులు, బంధు మిత్రులను విచారించే వారు. సోషల్‌ మీడియా వ్యాప్తితో నేటితరం ఇన్వెస్టర్ల ప్రపంచం మరింత విస్తృతం అయింది. ఎన్నో యూట్యూబ్, ఫేస్‌బుక్, టెలీగ్రామ్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌ ఖాతాలు తెరుచుకుంటున్నాయి.

ఎంతో మంది నిపుణుల అవతారం ఎత్తుతున్నారు. ఫలానా స్టాక్స్‌ కొనుగోలు చేయాలనే టిప్స్‌కు ఆదరణ ఎక్కువగా కనిపిస్తోంది. అయినప్పటికీ పెట్టుబడులకు సంబంధించి కనీస ప్రాథమిక సూత్రాలను విస్మరించకూడదు. నియంత్రణల పరిధిలో లేని సామాజిక మాధ్యమ వేదికలపై చెప్పే సమాచారానికి, ఇచ్చే సలహాలకు జవాబుదారీ ఏది? ఏది నిజం, ఏది తప్పుదారి? తెలుసుకోవడం ఎలా? ఇది అవగాహనపైనే తెలుస్తుంది. ఈ దిశలో సాయపడేదే సోషల్‌ ఇన్వెస్టింగ్‌.

ఆచరణ ముఖ్యం
ఒకరి నుంచి నేర్చుకోవడం, ఆచరణలో పెట్టడం ఈ రెండు వేర్వేరు. సోషల్‌ ఇన్వెస్టింగ్‌ ప్లాట్‌ఫామ్‌లు ట్రేడింగ్, పెట్టుబడి గురించి తెలుసుకునేందుకు సాయపడతాయి. ‘‘ఇన్వెస్టర్‌కు ఒక ప్రణాళిక ఉండాలి. దానికి కట్టుబడి ఉండాలి. రిటైల్‌ ఇన్వెస్టర్లలో ఎక్కువ మంది తాము పెట్టుబడులు పెట్టే మ్యూచువల్‌ ఫండ్స్‌ కంటే నేరుగా స్టాక్స్‌లో తక్కువ రాబడులు సంపాదిస్తున్నట్టు ఆ మధ్య నిర్వహించిన ఒక సర్వేలో తెలిసింది. దీనికి ఇన్వెస్టర్లు మార్కెట్లో అనుకూల సమయం కోసం వేచి చూసి, ఇన్వెస్ట్‌ చేయడం కారణం కావచ్చు.

లేదంటే మ్యూచువల్‌ ఫండ్స్‌ను అనుకూలం కాని సమయంలో విక్రయించి, కొనుగోళ్లు చేస్తుండొచ్చు. ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టిన తర్వాత వార్తలు, ప్రతికూల విశ్లేషణలు చూసి చలించిపోకుండా, ఫండ్స్‌ మాదిరిగా స్థిరమైన వైఖరి అనుసరించాలి. సోషల్‌ ఇన్వెస్టింగ్‌ ప్లాట్‌ఫామ్‌లో తోటి ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియో చూసి పెట్టుబడులు పెట్టినట్టయితే.. మార్కెట్ల పతనాల్లో ఎంత స్థిరంగా, దృఢంగా ఉండగలరన్నది కీలకం అవుతుంది. ఆ సమయంలో భయపడి విక్రయించారంటే రాబడులు గణనీయంగా తగ్గిపోతాయి. నష్టాలూ ఎదురు చూడొచ్చు’’అని సెబీ రిజిస్టర్డ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్‌ దీపేశ్‌ రాఘవ్‌ వివరించారు.

మార్గదర్శిగానే..
ఇన్వెస్టింగ్‌ వేదికలను మార్గదర్శిగానే చూడాలి. గుడ్డిగా అనుసరించడం సరికాదు. ఈ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా తగినంత అవగాహన, విషయ పరిజ్ఞానాన్ని పెంచుకున్న తర్వాత, విడిగా ప్రతీ ఇన్వెస్టర్‌ తన వైపు నుంచి లోతైన అధ్యయనం చేయాలి. ఆ తర్వాతే తనకు అనుకూలమైన పెట్టుబడుల వ్యూహాలను అనుసరించాలి. ఇతరులు కేవలం తమ అనుభవాన్ని పంచుతారే కానీ, జవాబుదారీగా ఉండరనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సోషల్‌ ఇన్వెస్టింగ్‌ ప్లాట్‌ఫామ్‌లు స్టాక్స్, ట్రేడింగ్‌ గురించి నేర్చుకునే వేదికలే. ఇన్వెస్టర్లు ఎవరికి వారే తమ వంతుగా పెట్టుబడుల లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఎవరో పోర్ట్‌ఫోలియో కాపీ చేసి ఇన్వెస్ట్‌ చేసిన తర్వాత, నష్టాలు వచ్చాయని పరిహారం డిమాండ్‌ చేయలేరు.

గుడ్డిగా అనుసరించడం సరికాదు..
కొత్త ఇన్వెస్టర్లు ఉచిత లేదా చెల్లింపుల వేదికల ద్వారా స్టాక్స్‌లో పెట్టుబడులు, ట్రేడింగ్‌కు మొగ్గు చూపించే ముందు.. ఆయా వేదికలు తమ లక్ష్యాలు, రిస్క్, రాబడుల ఆకాంక్షలకు సరిపోయే వేనా? అన్నది ఒక్కసారి తరిచి చూసుకోవాలి. ‘‘తాము అనుసరించే తోటి ఇన్వెస్టర్ల ప్రొఫైల్‌ను జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే వారు ఎక్కువ రిస్క్‌ తీసుకోవచ్చు. వారి పోర్ట్‌ఫోలియో తీవ్ర అస్థిరతలతో కూడుకుని ఉండొచ్చు. ‘‘ప్రతి వ్యక్తి లక్ష్యాలు, అవసరాలు వేర్వేరుగా ఉంటాయి.

మీ స్నేహితులు లేదా ఇతరులు వారి కోణం నుంచి సాధారణ సూచనలు ఇవ్వొచ్చు. అది విడిగా ప్రతి ఇన్వెస్టర్‌కు అనుకూలమైనదని చెప్పలేం. మీ ప్రస్తుత పోర్ట్‌ఫోలియో, భవిష్యత్‌ నగదు అవసరాలు, రిస్క్‌ సామర్థ్యం ఇలాంటివి ఏవీ ఎదుటి వారికి తెలియవు’’అని సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ ప్లానర్‌ పారుల్‌ మహేశ్వరి పేర్కొన్నారు. పెట్టుబడులు పెట్టే ముందు పోర్ట్‌ఫోలియోను ఒక్కసారి పరిశీలించుకోవాలని సూచించారు. తమకు సరిపోలని ఉత్పత్తులు, సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ట్రేడింగ్‌లో రిస్క్‌ ఎక్కువగా ఉంటుంది. ఇన్వెస్టింగ్‌లో రిస్క్‌ తక్కువ. ఈ రెండింటిలో తమకు ఏది అనుకూలమో ఇన్వెస్టర్లే తేల్చుకోవాలి.

సోషల్‌ ఇన్వెస్టింగ్‌ అంటే..?
ఎన్నో తరాల నుంచి ఇది ఉన్నదే సోషల్‌ ఇన్వెస్టింగ్‌ (ఇన్వెస్టర్ల సమూహం/సమాజం). గతంలో స్నేహితులు, కుటుంబ సభ్యుల వరకే ఇది పరిమితం. ఇప్పుడు టెక్నాలజీ ఫలితంగా మరింత పెద్దదిగా అవతరించింది. ట్రేడర్లు, ప్రపంచవ్యాప్త నిపుణులు, ఇన్వెస్టర్లు ఇందులో భాగమవుతున్నారు. సోషల్‌ ఇన్వెస్టింగ్‌ యాప్స్, ప్లాట్‌ఫామ్‌లు ఇప్పుడు ప్రత్యేకంగా అందుబాటులోకి వస్తున్నాయి. ఏవి అసలైనవో, ఏవి నకిలీవో గుర్తించేందుకు ఇవి దారి చూపిస్తున్నాయి.

సీనియర్‌ ట్రేడర్లు, తమ మాదిరే ఆకాంక్షలతో కూడిన ఇన్వెస్టర్లతో చాట్, సంప్రదింపులకు ఇవి వేదికలుగా నిలుస్తున్నాయి. ట్రేడింగ్, పెట్టుబడులకు సంబంధించిన విజ్ఞానం పంచుకునేందుకు వారధిగా పనిచేస్తున్నాయి. అనుభవజు్ఞలైన ట్రేడర్ల పోస్ట్‌లు, పోర్ట్‌ఫోలియోను వీటి ద్వారా తెలుసుకోవచ్చు. ఎప్పటికప్పుడు తాజా సమాచారానికితోడు, పెట్టుబడుల సలహాలు కూడా వీటిపై అందుకోవచ్చు. యూఎస్, యూరప్‌లో అయితే ఇన్వెస్టర్లు, నిపుణుల ట్రేడ్‌ పోర్ట్‌ఫోలియోను ఇతరులు కాపీ చేసుకోవచ్చు. అమెరికాకు చెందిన ఈటోరో కూడా ప్రముఖ సోషల్‌ ఇన్వెస్టింగ్‌ పోర్టల్‌. ధ్రువీకరించిన ట్రేడర్ల పోర్ట్‌ఫోలియోలను ఈ వేదికపై పరిశీలించొచ్చు.

కానీ, మన దేశంలో ఇంకా ఈ విధమైన అవకాశం అందుబాటులోకి రాలేదు. మన దగ్గర సోషల్‌ ఇన్వెస్టింగ్‌ అన్నది ఒక చిన్న ఇన్వెస్టర్ల సమూహంగానే ప్రస్తుతం ఉంది. ‘‘సోషల్‌ ఇన్వెస్టింగ్‌ అన్నది విస్తృతమైన పదం. ఒక ఉమ్మడి వేదికగా వ్యక్తుల మధ్య సంప్రదింపులకు వీలు కలి్పంచేది. స్టాక్‌ ఫండమెంటల్స్‌ (ఆర్థిక మూలాలు), కంపెనీ లాభ, నష్టాల నివేదిక విశ్లేషణ, కీలక రేషియోలు, సాంకేతిక సూచికలు, మార్కెట్‌ ధోరణులపై సంప్రదింపులకు అవకాశం కలి్పస్తుంది. ఇన్వెస్టర్లు తాము అనుసరించే ట్రేడింగ్‌ విధానాలు, పోర్ట్‌ఫోలియోను వీటిపై ఇతరులతో పంచుకుంటారు’’అని స్మాల్‌కేస్‌ సీఈవో వసంత్‌ కామత్‌ తెలిపారు.  

నేర్చుకునే మార్గం..
‘‘కరోనా సమయంలో మార్కెట్లు కనిష్ట స్థాయిలను చవిచూశాయి. దాంతో అవి ఆకర్షణీయంగా మారాయి. సెబీ కేవైసీ నిబంధనలను సరళతరం చేసింది. దీంతో ఆన్‌లైన్‌లోనే వేగంగా ట్రేడింగ్, డీమ్యాట్‌ ఖాతాలు ప్రారంభించేందుకు అవకాశం ఏర్పడింది. దీనికితోడు యువ జనాభా ఎక్కువ మంది ఇంటికి పరిమితం కావడం పెద్ద ఎత్తున డీమ్యాట్‌ ఖాతాల ప్రారంభానికి దారితీసింది’’అని ప్రభుదాస్‌ లీలాధర్‌ రిటైల్‌ బ్రోకింగ్‌ సీఈవో సందీప్‌ రాయ్‌చురా తెలిపారు. ముంబైకి చెందిన ఉత్కర్‌‡్ష (32) కూడా కరోనా సమయంలో మార్కెట్లోకి ప్రవేశించిన వారిలో ఒకరు.

సహజంగా వ్యాపారవేత్త అయిన ఆయన ఇప్పుడు స్టాక్స్‌లో చురుగ్గా ట్రేడింగ్‌ చేస్తున్నారు. తొలుత మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులకు డీమ్యాట్‌ ఖాతాను ఉపయోగించుకున్నారు. స్టాక్స్‌లో ట్రేడింగ్‌ చేయాలని 2021 మార్చిలో ఆయన నిర్ణయించుకున్నారు. కానీ ఇందుకు సంబంధించిన సమాచారం ఎలా తెలుసుకోవాలో ఆయనకు తోచలేదు. ఆ సమయంలో మలీ్టబ్యాగర్లు అంటూ పెన్నీ స్టాక్స్‌ గురించి యూట్యూబ్‌ చానళ్లు, ట్విట్టర్‌ పోస్ట్‌లలో టిప్స్‌ కనిపించేవి. అయినా సరే వాటి ట్రాప్‌లో ఆయన పడిపోలేదు. గడిచిన రెండేళ్ల కాలంలో ఈ తరహా అనధికారిక, రిజిస్ట్రేషన్‌ లేని అడ్వైజర్లు, సామాజిక మాధ్యమ వేదికల అణచివేతకు సెబీ కఠిన చర్యలు తీసుకోవడం గమనించొచ్చు.

ఉత్కర్‌‡్ష స్వతహాగా కొంత అవగాహన కలిగి ఉండడంతో విశ్వసనీయత లేని ఇలాంటి బూటకపు చానళ్ల బారిన పడకుండా, సోషల్‌ ఇన్వెస్టింగ్‌ ఫోరమ్‌లలో చేరాడు. అన్నీ కాదు కానీ, కొన్ని ఉపయోగకరమైనవి అని కొంత కాలానికి  ఆయనకు అర్థమైంది. కొందరు అనుభవం కలిగిన స్టాక్‌ ట్రేడర్లు స్టాక్స్, ఫండ్స్, పెట్టుబడి సూత్రాల గురించి చెప్పడం తనకు నిజంగా సాయపడినట్టు ఉత్కర్‌‡్ష వెల్లడించారు. వీటి సాయంతో ట్రేడింగ్‌పై అవగాహన మరింత పెరిగింది. ఇప్పటికీ ఈ సామాజిక మాధ్యమ ఫోరమ్‌ల సాయంతో స్టాక్స్‌ ట్రెండ్స్‌ గురించి ఆయన తెలుసుకుంటూనే ఉంటారు.

సోషల్‌ ఇన్వెస్టింగ్‌ అంటే ఇదే. ‘‘మార్కెట్‌లోని సీనియర్, అనుభవజ్ఞులైన ట్రేడర్ల నుంచి కొత్త ఇన్వెస్టర్లు, ట్రేడర్లు నేర్చుకునే వేదికగానే సోషల్‌ ఇన్వెస్టింగ్‌ను చూడాలి. మరొకరిని కాపీ కొట్టడం కాకుండా.. స్టాక్‌ పరిశోధన, వార్తలు, ట్రేడింగ్‌ విధానాలను రూపొందించుకోవడానికి మార్గంగా నిలుస్తుంది’’అని స్మాల్‌కేస్‌ వసంత్‌ కామత్‌ వివరించారు. ఒక్క ఉత్కర్‌‡్ష అనే కాదు లక్షలాది మందికి నేడు ఇలాంటి సామాజిక మాధ్యమ వేదికలు ఇన్వెస్టింగ్‌కు మెరుగైన దారి చూపిస్తున్నాయనడంలో సందేహం లేదు. కాకపోతే నిజమైన–మోసపూరిత వేదికల మధ్య వ్యత్యాసం తెలుసుకోవాలి. సామాజిక మాధ్యమ వేదికలు ఇప్పుడు పోస్ట్‌లకు వచ్చే వ్యూస్‌ ఆధారంగా, ప్రకటనల ఆదాయాన్ని యూజర్లతో పంచుకుంటున్నాయి. దీంతో సీనియర్‌ ట్రేడర్లు తమ అనుభవాన్ని, ట్రేడింగ్, పెట్టుబడి విధానాలను తోటి యూజర్లతో పంచుకోవడం వల్ల వారికి అదొక ఆదాయ వనరుగానూ మారుతోంది. దీంతో కొత్త ఇన్వెస్టర్లు నేర్చుకునే అవకాశాలు, వేదికలు పెరిగాయి.

Advertisement

What’s your opinion

Advertisement