వరస్ట్ లైఫ్.. బొమ్మలా బతుకుతున్నాను | Sakshi
Sakshi News home page

వరస్ట్ లైఫ్.. బొమ్మలా బతుకుతున్నాను

Published Mon, Aug 17 2015 4:03 AM

వరస్ట్ లైఫ్.. బొమ్మలా బతుకుతున్నాను

* మంచి మిత్రుడిగా భావించిన వాడే ప్రపోజ్ చేశాడు
* ప్రతి వ్యక్తి ఆడపిల్లను అదే భావనతో చూస్తున్నారు
* అందరిపై నాకు అసహ్యం కలుగుతోంది
* సాక్షి’ చేతికి రిషితేశ్వరి రెండో డైరీలోని మరికొన్ని పేజీలు

సాక్షి, గుంటూరు:  ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి కళాశాలలో చేరినప్పటి నుంచీ ఎదుర్కొన్న బాధలు, పడ్డ కష్టం మొత్తం డైరీల్లో రాసుకుంది. తాజాగా బయటపడిన రిషితేశ్వరి రెండో డైరీలోని కొన్ని పేజీలు ‘సాక్షి’ చేతికి చిక్కాయి. అందులోని కొన్ని ముఖ్యమైన విషయాలు ఇలా ఉన్నాయి...
 
ఇంటర్లో 88% మార్కులు తెచ్చుకున్నా. ఆర్కిటెక్చర్ కోర్సు తీసుకుని కెరీర్‌ను తీర్చిదిద్దుకోవాలని ఆశిస్తున్నా.. నిరుపేదలకు తక్కువ ఖర్చుతో ఇల్లు నిర్మించుకొనేలా చేయాలనేది నా లక్ష్యం. ఆర్కిటెక్చర్‌లో సీటు సాధించడానికి నాటా(నేషనల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఫర్ ఆర్కిటెక్చర్) ఎంట్రన్స్ రాసేందుకు విజయవాడ, మొగల్రాజపురంలోని ఓ కోచింగ్ సెంటర్‌లోచేరి నెలరోజులపాటు కష్టపడి చదివా. 112 ర్యాంక్ రావడంతో  జేఎన్‌ఎఫ్‌ఏయూలో సీటు వస్తుందని ఆశించా. ఒక్క ర్యాంకు తేడాతో జేఎన్‌ఎఫ్‌ఏయూలో సీటు కోల్పోయి ఏఎన్‌యూలో సీటు సాధించా. ఎంతో నమ్మకం... కోరిక... ఆశలు... ఆశయాలతో మొదటిరోజు కళాశాలలో అడుగుపెట్టాను.
 
కొత్త కాలేజీ కావడంతో ర్యాగింగ్ ఉంటుందని టెన్షన్‌తో ఉన్న నాకు ఇక్కడ ర్యాగింగ్ ఉండదంటూ వార్డెన్ ధైర్యం చెప్పింది. కానీ మొదటిరోజు రాత్రి సీనియర్స్ నన్ను పిలిచి సీనియర్స్‌తో ఎలా వ్యవహరించాలో షరతులు విధించారు. మా రూమ్‌లో 8 మంది ఉన్నాం. వారిలో పావని, హనీష, ఉన్నతి, మౌనికలు సీనియర్లు. ముగ్గురు నా క్లాస్‌మేట్స్.
 
హనీష నాతో మొదట్లో బాగుండేది. తరువాత నాలుగో సంవత్సరం విద్యార్థి శ్రీనివాస్‌తో మాట్లాడాలని చెప్పింది. నేను  మాట్లాడలేదు. ఓ రోజు శ్రీనివాస్‌తో ఫోన్‌చేసి మాట్లాడాలంటూ నన్ను ర్యాగింగ్ చేసింది. చేసేదిలేక నేను అతనితో మాట్లాడాను. లైబ్రరీలో కలవాని చెప్పాడు. శ్రీనివాస్ లైబ్రరీలో నాపక్కనే కూర్చుని ఫోన్ లాక్కొని నా ఫొటోలు చూశాడు. నువ్వు చిన్న హీరోయిన్‌లా ఉన్నావంటూ కామెంట్ చేశాడు. చాటింగ్ చేయడం ప్రారంభించాడు. కానీ నాకు అలా చేయడం ఇష్టం ఉండేది కాదు.
 
నా ఫోన్లో శ్రీనివాస్ కాంటాక్ట్ నేమ్ మార్చమని హనీష చెప్పింది. నేను అన్నయ్య అని అతని నంబర్ సేవ్ చేశాను. కొద్దిసేపటికి శ్రీనివాస్ ఫోన్‌చేసి నా నంబర్ ఏమని సేవ్ చేశావని అడిగాడు. అన్నయ్య అని  చెప్పాను. అలా ఎందుకు చేశావు, నన్ను శ్రీ అని పిలవమని అనడంతో షాక్‌కు గురయ్యాను.
 
దసరా సెలవుల్లో నా ఫ్రెండ్ ఆదిత్య నన్ను ప్రేమించమంటూ ప్రపోజ్ చేశాడు.  నో చెప్పాను.  చాలా కోపం వచ్చింది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి.  మరో సీనియర్ చరణ్ నావెంటపడటం మొదలు పెట్టాడు. నేను మంచి మిత్రుడుగా భావించిన మనిషి కూడా నన్ను ప్రేమించమంటూ ప్రపోజ్ చేశాడు. నేను అతన్ని మంచి ఫ్రెండ్‌గా చూశాను. కానీ ఆ వెధవ నన్ను మరో దృష్టితో చూశాడు.
 
శ్రీనివాస్ నా క్లాస్ అబ్బాయిలతో నా గురించి ఎంక్వయిరీ చేస్తున్నాడు. ప్రతి వ్యక్తి ఆడపిల్లను అదేభావనతో చూస్తున్నారు. దీంతో అందరిపై నాకు అసహ్యం కలుగుతోంది. ఆర్కిటెక్చర్ విద్యార్థులు ఎక్కువమంది వెధవలు ఉన్నారు. ఛీ... వరస్ట్ లైఫ్... నేను బొమ్మలా బతుకుతున్నాను.
 
హాయ్‌ల్యాండ్‌లో శ్రీనివాస్, చరణ్‌లు నాపట్ల అసభ్యంగా ప్రవర్తించారు. మద్యం సేవించి నన్ను దగ్గరకు లాక్కుని వేధించారు. ఆ స్థితిలో చనిపోవాలనిపించింది. మిస్‌పర్‌ఫెక్ట్ అవార్డును శ్రీనివాస్ చేతులు మీదుగా ఇప్పించారు. చాలా అసహ్యంగా అనిపించింది. ఈ విషయాలన్నీ ఎవరితోనూ చెప్పుకోలేక పోయా.. చివరకు మానాన్నతో కూడా.

Advertisement
Advertisement