శశికళ భర్త సంచలన వ్యాఖ్యలు | Sakshi
Sakshi News home page

శశికళ భర్త సంచలన వ్యాఖ్యలు

Published Tue, Jan 17 2017 3:21 PM

శశికళ భర్త సంచలన వ్యాఖ్యలు - Sakshi

  • జయలలితను సీఎం చేసింది మేమే
  • మేం రాజకీయాల్లో ఉంటే తప్పేంటి
  • అన్నాడీఎంకే సర్కారును కూల్చేందుకు బీజేపీ కుట్ర

  • తిరుచ్చి: దివంగత నేత జయలలిత వారసులుగా తమ కుటుంబం రాజకీయాల్లోకి ప్రవేశించడంపై వస్తున్న అభ్యంతరాలను అన్నాడీఎంకే అధినేత్రి వీకే శశికళ భర్త ఎం నటరాజన్‌ తోసిపుచ్చారు. తమ కుటుంబం రాజకీయాల్లోకి వస్తే తప్పేంటి అని ఆయన ప్రశ్నించారు.

    తంజావూరులో పొంగల్‌ వేడుకల ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎంజీఆర్‌ మృతి తర్వాత జయలలితను కాపాడటంలో తమ కుటుంబం కీలక పాత్ర పోషించిందని ఆయన పేర్కొన్నారు. ’ నా భార్య శశికళ 30 ఏళ్లపాట జయలలితను కాపాడింది. ఎంజీఆర్‌ భౌతికకాయాన్ని చూసేందుకు జయలలితను అనుమతించకపోతే.. మేం ఆమెను అంత్యక్రియలకు తీసుకెళ్లాం​. ఎంజీఆర్‌ ను తరలిస్తున్న వాహనం నుంచి ఆమెను తోసివేస్తే.. మేం ఆమెకు అండగా నిలబడ్డాం. ఆమె జీవితాంతం మద్దతుగా నిలిచాం. జయలలిత సీఎం కాకూడదని బ్రాహ్మణులు అడ్డుపడ్డా.. మేం ఆమెను సీఎం చేశాం. కాబట్టి మా కుటుంబసభ్యులు రాజకీయాల్లో కొనసాగితే అది అనైతికమేమీ కాదు’ అని ఆయన అన్నారు.

    ఇప్పటికిప్పుడు పన్నీర్‌ సెల్వాన్ని సీఎం పదవి నుంచి తప్పించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అలాంటి పరిస్థితి తలెత్తితే ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర పన్నుతుందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ’ద్రవిడులకు వ్యతిరేకంగా బ్రాహ్మణులు చేస్తున్న కుట్రకు ఆడిటర్‌ గురుమూర్తి నేతృత్వం వహిస్తున్నారు. అందరు బ్రాహ్మణులను నేను విమర్శించడం లేదు. కానీ 10శాతం మంది రాష్ట్రాన్ని కాషాయమయం చేసేందుకు కుట్రపన్నుతున్నారు’ అని ఆరోపించారు. అదే సమయంలో ప్రధాని మోదీ మంచి వ్యక్తి అంటూ ప్రశంసలు గుప్పించారు.

Advertisement
Advertisement