పెరేడ్ గ్రౌండ్ సేఫ్..! | Sakshi
Sakshi News home page

పెరేడ్ గ్రౌండ్ సేఫ్..!

Published Wed, May 24 2017 6:47 PM

పెరేడ్ గ్రౌండ్ సేఫ్..! - Sakshi

పెరేడ్ గ్రౌండ్‌ను ప్రభుత్వం తీసుకుంటుందని, దాంతో అది అదృశ్యం అవుతుందంటూ వచ్చిన కథనాలను సీఎం కేసీఆర్ ఖండించారు. తాము తీసుకుంటున్నది బైసన్ పోలో గ్రౌండ్ తప్ప పెరేడ్ గ్రౌండ్ కాదని చెప్పారు. అందులో మొత్తం సుమారు 55-60 ఎకరాల స్థలం ఉందని, అక్కడ మంచి సెక్రటేరియట్, అసెంబ్లీ భవనంతో పాటు తెలంగాణ కళాభారతిని కూడా నిర్మిస్తామని, ఆ మూడింటి ఎదురుగానే పెద్ద ఖాళీ స్థలం ఉంటుందని, ప్రభుత్వ కార్యక్రమాలన్నింటినీ అక్కడే బ్రహ్మాండంగా జరుపుకోవచ్చని తెలిపారు.

అద్భుతమైన ఆంధ్రప్రదేశ్ అని చెబుతారని, కానీ ఇన్నాళ్లుగా ఒక్క పెరేడ్ గ్రౌండ్ కూడా లేకపోవడం దౌర్భాగ్యమని కేసీఆర్ అన్నారు. ఇప్పటివరకు ఉన్నదాని కోసం ప్రతిసారీ కేంద్ర ప్రభుత్వం వద్దకు వెళ్లి వాళ్ల గడ్డం పట్టుకుని బతిమాలి గానీ, పైరవీలు చేసి గానీ అనుమతులు తెచ్చుకోవాల్సి వచ్చేదన్నారు. ఒక్కోసారి వాళ్లు అనుమతులు కూడా నిరాకరించేవారని చెప్పారు. అందుకే తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా ఉండేలా హైదరాబాద్‌ నగరానికి ఐకానిక్‌గా ఉండే విధంగా అసెంబ్లీ, సెక్రటేరియట్, కళాభారతి మూడింటినీ ఒకేచోట నిర్మిస్తామని చెప్పారు. ఇందుకోసం పెరేడ్ గ్రౌండ్‌ను మాత్రం తీసుకోవడం లేదని, అది అలాగే ఉండాలని.. అక్కడ కుర్రాళ్లు ఆడుకోవాలని ఆయన అన్నారు.

Advertisement
Advertisement