తప్పించుకు తిరగలేరు! | Sakshi
Sakshi News home page

తప్పించుకు తిరగలేరు!

Published Tue, Sep 2 2014 3:48 AM

Tiragaleru escape!

  •      కొత్త విధానంలో ట్రాఫిక్ సిబ్బంది తనిఖీలు
  •      పాత పద్ధతికి స్వస్తి
  •      నగరంలో 200 తనిఖీ పాయింట్లు
  •      ప్రత్యేక బారికేడ్లు సిద్ధం
  • సాక్షి, సిటీబ్యూరో: ఇకపై ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనులు పోలీసు తనిఖీల నుంచి తప్పించుకు తిరగలేరు. దీనికోసం పోలీసులు కొత్త పద్ధతులు పాటించబోతున్నారు. ప్రస్తుతం అవలంబిస్తున్న ట్రాఫిక్ పోలీసుల తనిఖీలలో సమూల మార్పులు చేయాలని ఎమ్.మహేందర్‌రెడ్డి నిర్ణయించారు. ఇందులో భాగంగా ఎక్కడ పడితే అక్కడ కాకుండా, వాహనదారులు, పాదచారులకు అసౌకర్యం కలుగకుండా క్రమపద్ధతిలో తనిఖీలు చేయాలని అదనపు పోలీసు కమిషనర్ జితేందర్ అన్ని ట్రాఫిక్ ఠాణా ఎస్‌హెచ్‌ఓలకు ఆదేశాలు జారీ చేశారు. త్వరలో కొత్త తనిఖీ విధానానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా తయారు చేసిన బారికేడ్లు వచ్చేశాయి.
     
    ఇదీ ప్రస్తుతపద్ధతి
     
    మలక్‌పేట్‌కు చెందిన రవి తన బైక్‌పై కోఠి వైపు దూసుకెళ్తున్నాడు. చాదర్‌ఘాట్ దాటిన తరువాత ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ చేయి చూపించి వాహనాన్ని ఆపమన్నాడు. రవి సడన్‌గా బ్రేక్ వేశాడు. అంతే.. వెనుక నుంచి వచ్చిన మరో వాహనం రవిని ఢీ కొట్టింది...నగరంలో తరచూ ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఒక్కోసారి ట్రాఫిక్ పోలీసులు వాహనాన్నిఆపమంటే చోదకులు ఆపకుండా, వేగంగా దూసుకెళ్లి ప్రమాదాల బారినపడిన దాఖలాలూ కోకొల్లలు. కొన్ని సందర్భాలలో మృతి చెందిన సంఘటనలు కూడా ఉన్నాయి. చెకింగ్ సమయంలో ఉన్నట్టుండి వాహనాన్ని నిలిపే క్రమంలో పోలీసులు, వాహనదారులకు ముష్టియుద్ధాలు జరిగిన సంఘటనలూ ఉన్నాయి. ఇక ముందు ఇలాంటి ఘటనలకు తావులేకుండా జాగ్రత్త వహించనున్నారు.
     
    కొత్త విధానమిదీ...
     
    ‘ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనులను తనిఖీ చేస్తున్నాం. వాహనదారులు సహకరించాలి’ అని తెలిపే బారికేడ్లు వంద మీటర్ల దూరం నుంచే వాహనదారుడికి కనబడేలా దర్శనమిస్తాయి. వీటి వద్ద ట్రాఫిక్ పోలీసులు మర్యాదగా, గౌరవంగా, చెయ్యి చూపించి వాహనాన్ని ఆపేస్తారు. ఆ సమయంలో ఆ వాహనం వెనుక నుంచి వచ్చే ఇతర వాహనదారులు వేగాన్ని తగ్గించుకుంటారు. దీని వల్ల ప్రమాదాలను నివారించవచ్చు.

    ట్రాఫిక్ పోలీసులు వాహనాన్ని ఆపమన్నా తప్పించుకునేందుకు అవకాశం ఉండదు. బారికేడ్లు పెట్టడం వల్ల వాహన వేగం పెంచలేక తనిఖీలకు తప్పనిసరి సహకరించాల్సిందే. దీనివల్ల నిబంధనలు ఉల్లంఘించే వారు తనిఖీలలో పట్టుబడడం ఖాయం. కొంతమంది ట్రాఫిక్ సిబ్బంది ఎటువంటి ఆదేశాలు లేకున్నా సందుగొందుల్లో తనిఖీలు చేసి జేబులు నింపుకుంటున్నారు. ఇలాంటి అక్రమాలకు కూడా కొత్త పద్ధతితో బ్రేక్‌పడుతుంది. ఈ బారికేడ్లు లేకుండా తనిఖీలు చేయరాదని కమిషనర్ మహేందర్‌రెడ్డి ఆదేశించారు.
     
    200 ప్రాంతాల్లో...
     
    నగర కమిషనరేట్ పరిధిలో 25 ట్రాఫిక్ పోలీసు స్టేషన్లు ఉన్నాయి. ఒక్కో స్టేషన్ పరిధిలో భౌగోళికతను దృష్టిలో పెట్టుకుని ఏడు నుంచి పది వరకు తనిఖీ పాయింట్లను గుర్తించారు. ట్రాఫిక్ తనిఖీల కోసం నగరంలో మొత్తం 200 ప్రాంతాలను గుర్తించారు. ప్రతి తనిఖీ పాయింట్ వద్ద బారికేడ్లు ఉంటాయి.
     

Advertisement
Advertisement