టీపీసీసీపై నేడు ఉత్తర్వులు? | Sakshi
Sakshi News home page

టీపీసీసీపై నేడు ఉత్తర్వులు?

Published Mon, Mar 2 2015 1:48 AM

టీపీసీసీపై నేడు ఉత్తర్వులు? - Sakshi

ఢిల్లీలోనే జానారెడ్డి, పొన్నాల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌కు నాయకత్వ మార్పు ఖాయమైనా ఆదివారం రాత్రిదాకా ఏఐసీసీ నుంచి ఉత్తర్వులు వెలువడలేదు. తెలంగాణ కాంగ్రెస్ కమిటీతో పాటు ఢిల్లీ, పంజాబ్ వంటి మరో ఆరు రాష్ట్రాలకు కలిపి మార్పులు చేస్తూ ఒకేసారి అధికారిక ప్రకటన వెలువడవచ్చునని సీనియర్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, సీఎల్పీ నేత కె.జానారెడ్డి వంటి నేతలు ఢిల్లీలోనే మకాం వేశారు. పొన్నాలను అందుబాటులో ఉండాలంటూ అధిష్టానం సూచించింది.  సీఎల్పీ నాయకుడిగా ఉన్న కె.జానారెడ్డి కూడా అధిష్టానం సూచనల మేరకు ఢిల్లీలోనే ఉన్నారు. టీపీసీసీ అధ్యక్షునిగా ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షునిగా మల్లు భట్టి విక్రమార్క పేర్లలో మార్పులేమీ ఉండవని పార్టీ ఉన్నతవర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ ముఖ్యనేతలను ఏఐసీసీలోకి తీసుకోవడం, త్వరలో ఖాళీ కాబోతున్న ఎమ్మెల్సీ పదవులివ్వనున్నట్టుగా తెలుస్తోంది.
 
 మార్పును వ్యతిరేకిస్తున్న సీనియర్లు
 టీపీసీసీ అధ్యక్షునిగా ఉన్న పొన్నాల లక్ష్మయ్యను తొలగించి, ఆ స్థానంలో ఉత్తమ్‌కుమార్ రెడ్డి నియామకాన్ని పార్టీలోని కొందరు సీనియర్లు వ్యతిరేకిస్తున్నారు. బీసీలకు పార్టీలో స్థానం లేకుండా చేయడాన్ని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు, శాసనమండలిలో ప్రతిపక్షనేత డి.శ్రీనివాస్ వంటివారు వ్యతిరేకిస్తున్నట్టుగా తెలుస్తోంది. వి.హనుమంతరావు దీనిపై ఇప్పటికే పలువురు పార్టీ అధిష్టాన పెద్దలను కలిసి వ్యతిరేకతను తెలిపారు. నల్లగొండ జిల్లాలో ఉత్తమ్‌కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ మార్పును, ఉత్తమ్ నియామకాన్ని వ్యతిరేకిస్తున్నారు.

Advertisement
Advertisement