‘ప్రజావాణి'లో ఇబ్బందులు | Sakshi
Sakshi News home page

‘ప్రజావాణి'లో ఇబ్బందులు

Published Tue, Nov 25 2014 3:52 AM

‘ప్రజావాణి'లో ఇబ్బందులు - Sakshi

ముకరంపుర: కరీంనగర్ కలెక్టరేట్‌లో నిర్వహించే ‘ప్రజావాణి' అధికారుల చిత్తశుద్ధిని ప్రశ్నిస్తోంది. బాధితుల సమస్యల పరిష్కారం దేవుడెరుగు.. అసలు కార్యక్రమ నిర్వహణలోనే సమస్యలు తాండవిస్తుండడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక జనం సతమతమవుతున్నారు. సోమవారం జిల్లా నలుమూలల నుంచి బాధితులు కలెక్టరేట్‌కు తరలివచ్చారు. ఉదయం 10 గంటల నుంచి బాధితుల తాకిడి మొదలైంది. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఎప్పటిలాగే ఉదయం 10.30 నుంచి 11 గంటల వరకు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం సాగింది.  

ప్రజావాణి నిర్వహించే ఆడిటోరియంలో మధ్యాహ్నం 12 గంటలు దాటినా ఒక్క అధికారి రాకపోవడంతో జనం అధికారుల తీరుపై మండిపడ్డారు. జిల్లా ఉన్నతాధికారులకు కలుసుకోవాలనుకున్న వారు రెండు గంటలపాటు ఎదురు చూశారు. చివరికి జిల్లా రెవెన్యూ అధికారి వీరబ్రహ్మయ్య వచ్చి బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు.

అలా 12 గంటలకు మొదలైన దరఖాస్తుల స్వీకరణ మధ్యాహ్నం 2 గంటలతో ముగిసింది. ఆడిటోరియంలో శాఖల వారీగా ఉన్న కౌంటర్లూ వెలవెలబోయాయి. తెలంగాణ రాష్ట్రం పేరుతో కొత్తగా రూపొందించిన ప్రజవాణి వెబ్‌సైట్ తెరుచుకోకపోవడంతో దరఖాస్తులు నమోదు చేసి రశీదులిచ్చే తొమ్మిది కంప్యూటర్లు అలంకారప్రాయంగా మారాయి. బాధితులకు చేతిరాతతో రశీదులు అందజేయడంతో అంతులేని ఆలస్యం జరిగింది.

Advertisement
Advertisement