టీడీపీకి దూరంగా కృష్ణయ్య | Sakshi
Sakshi News home page

టీడీపీకి దూరంగా కృష్ణయ్య

Published Mon, Aug 25 2014 1:19 AM

టీడీపీకి దూరంగా కృష్ణయ్య - Sakshi

తనను వాడుకొని వదిలేశారంటూ అసంతృప్తి
టీడీఎల్‌పీ ఫ్లోర్ లీడర్ పదవి దక్కకపోవడంపై నిరసన
పార్టీ కార్యాలయానికి, కార్యక్రమాలకు దూరం
ఎమ్మెల్యే పేరు వాడుకునేందుకు సైతం విముఖత
పార్టీతో నాకు అవసరం ఏమిటని వ్యాఖ్యలు

 
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ఓటుబ్యాంకు రాజకీయాలు ఎలా ఉంటాయో.. బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్. కృష్ణయ్యకు తెలిసొచ్చినట్టుంది. అధికారంలోకి వస్తే నువ్వే సీఎం అని చెప్పి పార్టీలోకి ఆహ్వానించి ఎల్.బీ.నగర్ సీటిచ్చిన చంద్రబాబు తీరా గెలిచి, పార్టీ ఓడిపోయాక కరివేపాకులా తీసేశారని ఆయన భావిస్తున్నారు. దీంతో పార్టీ కార్యాలయానికి, పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరమయ్యారు. అదే సమయంలో తనకు గుర్తింపు తెచ్చిన బీసీ ఉద్యమాలను జాతీయస్థాయికి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. కృష్ణయ్య పక్కన టీడీపీ ద్వారా తనకు సంక్రమించిన ఎమ్మెల్యే అనే హోదాను వాడుకునేందుకు కూడా ఇష్టపడడం లేదు. టీడీపీ నాయకత్వం కూడా కృష్ణయ్యను పార్టీ నేతగా చూడడం మానేసింది.

సీఎం అభ్యర్థి ఫ్లోర్ లీడర్ కాలేదు..!

గెలిస్తే కృష్ణయ్య ముఖ్యమంత్రి అంటూ చెప్పిన బాబు కనీసం అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్‌గా కూడా అవకాశం ఇవ్వలేదు. పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని పునర్వ్యవస్థీకరించి తెలంగాణ అధ్యక్ష పదవి అయినా ఇస్తారని భావించిన కృష్ణయ్యకు అక్కడా నిరాశే! దీంతో బాబు తీరేంటో... తనను ఎన్నికల కోసం ఎలా ఉపయోగించుకొని వదిలేశారో తెలుసుకున్న తానే  పక్కకు తప్పుకున్నారు. పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరమై, బీసీ కార్డునే నమ్ముకుంటున్నారు. చివరికి ఎమ్మెల్యే హోదాను గానీ వినియోగించుకోకుండా ఇటీవలే ప్రధాని నరేంద్ర మోడీని కలిసి తమ డిమాండ్లను నివేదించారు. ఆదివారం నగరంలో భారీ ఎత్తున బీసీ సదస్సు ఏర్పాటు చేసి, పార్టీతో తనకు సంబంధం లేదని తేల్చిచెప్పారు.

పార్టీ నేతలు కృష్ణయ్యకు దూరంగా...

గత శాసనసభ సమావేశాల నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, టీడీఎల్‌పీనేత ఎర్రబెల్లి దయాకర్‌రావులు చంద్రబాబుతో సమావేశాలకు గానీ, గవర్నర్‌ను కలిసినప్పుడు గానీ కృష్ణయ్యను పరిగణలోకి తీసుకోలేదు. దీంతో ఆయన కూడా టీ.టీడీపీ నేతలకు దూరంగా తన కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నారు.

బీసీ ఉద్యమాలే నాకు ముఖ్యం: కృష్ణయ్య

40 ఏళ్లుగా బీసీ ఉద్యమనేతగానే ప్రజల్లో ఉన్నా. ఎన్నో పోరాటాలు చేశా. అది తెలిసే చంద్రబాబు  సీఎం అభ్యర్థిగా పెడతానని చెప్పి ఎమ్మెల్యే టిక్కెట్టు ఇచ్చి, నాతో ప్రచారం చేయించారు. ఎల్‌బీ నగర్ నుంచి నేను గెలిచా, తెలంగాణలో పార్టీ ఓడిపోయింది. నా అవసరం ఇప్పుడు పార్టీకి లేదు. పార్టీ అవసరం నాకెప్పుడూ రాలేదు. నేను పార్టీ జెండా కూడా పట్టలేదు.
 

Advertisement
Advertisement