కేకే భూముల రిజిస్ట్రేషన్‌ రద్దు | Sakshi
Sakshi News home page

కేకే భూముల రిజిస్ట్రేషన్‌ రద్దు

Published Fri, Jun 23 2017 12:55 AM

కేకే భూముల రిజిస్ట్రేషన్‌ రద్దు

హాఫీజ్‌పూర్‌లో 70 ఎకరాలను స్వాధీనం చేసుకున్న సర్కారు
అలాగే టీసీఎస్‌ సమీపంలో ఐదెకరాలు వెనక్కి
బహిరంగ మార్కెట్‌లో దీని విలువ రూ.20 కోట్లపైనే


సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఇబ్రహీం పట్నం మండలం హఫీజ్‌పూర్‌లో రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు చేయించుకున్న అటవీ, ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. కేకే, గోల్డ్‌స్టోన్‌ యాజమాన్యం గుప్పిట్లో ఉన్న 70 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. దండు మైలారం గ్రామం హఫీజ్‌పూర్‌ రెవెన్యూ పరిధి లోని సర్వే నంబర్‌ 36/1లో 1,822 ఎకరాలు, 36/2లో 422.29 ఎకరాల మేర అటవీ, ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమి లో 50 ఎకరాలను కేకే తన కుటుంబీకులు కంచర్ల నవజ్యోత్, జ్యోత్న, గద్వాల విజయలక్ష్మి పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. గోల్డ్‌స్టోన్‌ యాజ మాన్యం నుంచి కొనుగోలు చేసిన ఈ భూమి నిషేధిత జాబితాలో ఉంది.

అయితే, ఈ భూమిని చట్టపరంగానే కొనుగోలు చేశానని మొదట వాదించిన కేశవరావు చివరకు వెనక్కి తగ్గారు. ఈ భూ వ్యవహారం తన మెడకు చుట్టుకుం టుందని పసిగట్టిన ఆయన రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. మరోవైపు 22ఏ కింద నమోదైన ఈ భూమి చేతులు మారడాన్ని సీరియస్‌గా పరిగణించిన ప్రభుత్వం.. కేకే రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసింది. అలాగే ఇదే సర్వే నంబర్లలో గోల్డ్‌స్టోన్‌ యాజమాన్యం తన అనుబంధ సంస్థలకు కట్టబెట్టిన 20 ఎకరాల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసిన జిల్లా యంత్రాంగం భూమిని స్వాధీనం చేసుకుంది.

రూ.20 కోట్ల భూమి వెనక్కి!
ఆదిబట్లలోని టీసీఎస్‌ సంస్థను ఆనుకొని ఉన్న సర్వే నంబర్‌ 79/2 లోని రూ.20 కోట్ల విలువైన ఐదెకరాల అసైన్డ్‌ భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. అసైన్డ్‌దారుల నుంచి చేతులు మారిన ఈ భూమిని స్వాధీనం చేసుకున్న సర్కారు.. బోర్డులు నాటి ప్రహరీగోడను ఏర్పాటు చేసింది. అనంతరం ఈ స్థలంపై కన్నేసిన ల్యాండ్‌ మాఫియా.. గోడలు, సూచిక బోర్డులను తొలగించి మళ్లీ ఆక్రమించింది. మియాపూర్‌ భూముల కుంభకోణం వెలుగులోకి రావడంతో అప్రమత్తమైన రెవెన్యూ యం త్రాంగం.. అన్యాక్రాంతమవుతున్న ఈ భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంది. అలాగే దురాక్రమణకు గురైన మరో 25 ఎకరాల భూమిని పీఓటీ చట్టం కింద వెనక్కి తీసుకునేందుకు నోటీసులు జారీ చేసింది.

Advertisement
Advertisement