విజేతల స్ఫూర్తి విస్తరణ..‘సాక్షి’ సామాజిక బాధ్యత | Sakshi
Sakshi News home page

విజేతల స్ఫూర్తి విస్తరణ..‘సాక్షి’ సామాజిక బాధ్యత

Published Thu, Jan 19 2017 3:02 AM

విజేతల స్ఫూర్తి విస్తరణ..‘సాక్షి’ సామాజిక బాధ్యత - Sakshi

  • ఎక్సలెన్స్‌ అవార్డులకు ఎంపిక ప్రక్రియ మొదలు
  • అర్హుల పేర్లను అవార్డులకు ప్రతిపాదించే అవకాశం
  • సాక్షి, హైదరాబాద్‌: ప్రతిభ–కృషి ఏ ఒక్కరి సొంతమూ కానట్టే.. అవి ఏ కొందరికో పరిమితం కాకూడదు. సమాజమంతటికీ విస్తరించాలి. అసాధారణమైన కొందరు ప్రతిభామూర్తులు, నిబద్ధత కలిగిన కొన్ని సంస్థల సామాజిక సేవ ఇంకా ఎందరెందరికో స్ఫూర్తి కావాలి. సమాజహితంలో జరిగే ఇటువంటి కృషి మరింత పెరగాలి. ఈ భావనతోనే ‘సాక్షి’ ఎక్సలెన్స్‌ అవార్డులు ఇవ్వడం ద్వారా లక్ష్యసాధనలో విశేష కృషి సల్పిన విజేతల్ని ప్రోత్సహించడంతో పాటు ఇతరులకు ప్రేరణ కల్పించేందుకు పూనుకుంది. ఈ అవార్డుల ప్రక్రియను ఒక సామాజిక బాధ్యతగా సాక్షి మీడియా గ్రూప్‌ చేపట్టి రెండేళ్లవుతోంది.

    తెలుగునాట వివిధ రంగాల్లో విశేషంగా కృషి చేస్తున్న పలువురు 2014, 2015 సంవత్సరాల్లో ఈ అవార్డులకు ఎంపికై ఎందరెందరిలోనో స్ఫూర్తిని రగిలించారు. కొత్త చిగుళ్లుగా ఎదుగుతున్న యువకిశోరాల నుంచి జీవన సాఫల్యం పొందిన మహామహుల వరకు అందులో ఉన్నారు. వారి అసాధారణ ప్రతిభ, విశేష సేవల్ని గుర్తించిన ‘సాక్షి’ తగు రీతిన సత్కరించి తద్వారా ఇతరులకు స్ఫూర్తి, ప్రేరణలను కలిగించింది. 2016కు గాను అవార్డులకు ఎంపిక ప్రక్రియ ఇటీవలే మొదలైంది. ఫిబ్రవరి 15వ తేదీ వరకు గడువు ఉండటంతో ఎంట్రీలు అందుతున్నాయి. ఈ ప్రక్రియలో విశేషమేమంటే.. ఎవరికి వారు ఎంట్రీలు పంపే అవకాశం లేదు. విశేషంగా ప్రతిభ కనబరుస్తున్న, సేవలందిస్తున్న, లక్ష్యాలు సాధిస్తున్న విజేతల్ని గుర్తించి వారినెరిగిన ఇతరులెవరైనా ఈ ఎంట్రీలు పంపొచ్చు. ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారు న్యాయనిర్ణేతలుగా ఉండే జ్యూరీలు తుది ఎంపిక జరుపుతాయి.

    విభిన్న రంగాల్లో ప్రతిభకు పట్టం
    విద్య, వైద్య, వ్యవసాయ, వాణిజ్య, సామాజిక సేవ, క్రీడలు తదితర రంగాల్లో సేవ చేస్తున్న వ్యక్తులను, సంస్థలను ‘సాక్షి ఎక్సలెన్స్‌ అవార్డు’ల కోసం గుర్తిస్తారు. కొన్ని విభాగాల్లో యువతరానికి,  ప్రవాస భారతీయులకూ అవార్డులున్నాయి. జ్యూరీ ప్రత్యేక అవార్డుల్ని కూడా పొందుపరిచారు. ఇవి కాకుండా సినిమా రంగానికి చెందిన వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన, ప్రతిభ చూపిన వారిని ప్రజాదరణ ఆధారంగా ఎంపిక చేసి అవార్డులిచ్చే ప్రక్రియకూ స్థానం కల్పించారు. ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం, నటీనటులు, దర్శకుడు, సంగీతం, నేపథ్యగానం వంటి విభాగాల్లో ఈ అవార్డులున్నాయి.

    ప్రఖ్యాత సాహితీవేత్త సి.నారాయణరెడ్డి, ప్రముఖ సినీ దర్శకుడు కె.విశ్వనాథ్‌లకు గత రెండు సంవత్సరాల్లో జీవన సాఫల్య పురస్కారాలను అందించారు. వివిధ రంగాల్లో విశేష లక్ష్యాలు సాధించి అవార్డులు పొందిన వారిలో డా.సతీశ్‌రెడ్డి, శ్రీకాంత్‌ బొళ్ల, డా.మధుకర్‌ గంగాడి, డా.ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్, వినోద, జ్యోతిరెడ్డి, బాల థెరిసా సింగారెడ్డి వంటి వారితో పాటు డా.గోపాలమ్‌ శివనారాయణ, పూర్ణ, ఆనంద్‌ తదితరులు ఉన్నారు. క్రీడాకారిణులు సైనా నెహ్వాల్, నైనా జైస్వాల్‌ వంటి వారు ఉన్నారు. ఇక ఫోరమ్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్, రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌ (అనంతపురం), ప్రజాదరణ వంటి పలు సంస్థలు కూడా ఈ అవార్డు గ్రహీతల్లో ఉన్నాయి. అవార్డులు పొందిన సినీ ముఖ్యుల్లో మహేశ్‌బాబు, సమంత, రకుల్‌ప్రీత్‌సింగ్, గుణశేఖర్, దేవీశ్రీ ప్రసాద్, కారుణ్య వంటి వారున్నారు.

    వరుసగా రెండేళ్లు జరిగిన అవార్డు ప్రదానోత్సవాలకు మీడియా ప్రముఖులైన శేఖర్‌గుప్తా, రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ అవార్డు విభాగాల రూపకల్పన, ఎంపిక ప్రక్రియను ‘యర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌’ సంస్థ స్వతంత్రంగా పర్యవేక్షిస్తోంది. ప్రతిభకు పట్టం కట్టడం, ప్రత్యేక కృషిని అభినందించడం, లక్ష్య సాధనను ప్రశంసించడం ఎవరైనా చేయదగ్గ మంచి పని అనే భావన కలిగిన వారంతా అర్హుల పేర్లను ఈ అవార్డుకు ప్రతిపాదిస్తూ ఎంట్రీలు పంపుతారని ‘సాక్షి’ అభిలషిస్తోంది. తద్వారా మనమంతా విజేతల్ని ప్రోత్సహిస్తూ, వారి స్ఫూర్తిని వ్యాప్తి చేసినవాళ్లమవుతామన్నది ఈ పిలుపు వెనుక ఉద్దేశంగా సాక్షి భావిస్తోందని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement
Advertisement