14 రంగాల్లో పెట్టుబడులకు పెద్దపీట | Sakshi
Sakshi News home page

14 రంగాల్లో పెట్టుబడులకు పెద్దపీట

Published Thu, Aug 25 2016 3:30 AM

14 రంగాల్లో పెట్టుబడులకు పెద్దపీట - Sakshi

- ఉత్పాదక రంగం బలోపేతంతోనే ఉపాధి
- పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు
- మలేసియా ప్రతినిధి బృందంతో కేటీఆర్ సమావేశం
 
 సాక్షి, హైదరాబాద్: ఉత్పాదక రంగాన్ని బలోపేతం చేయడం ద్వారా ఉపాధి అవకాశాలు సృష్టించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు చెప్పారు. మలేసియాలోని పెనాంగ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డాక్టర్ పి.రామస్వామి నేతృత్వంలోని ప్రతినిధి బృందం బుధవారం సచివాలయంలో మంత్రి కేటీఆర్‌తో సమావేశమైంది. ఇరు రాష్ట్రాల నడుమ పరస్పర సహకారం, ఆర్థిక సంబంధాలు తదితర అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు. లైఫ్ సెన్సైస్, ఐటీ, రక్షణ, ఏరోస్పేస్ తదితర 14 ప్రాధాన్యత రంగాలను ప్రభుత్వం గుర్తించిందని, ఈ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడంపై దృష్టి కేంద్రీకరించిందని కేటీఆర్ వెల్లడించారు. ఉత్పాదక రంగంలో అగ్రస్థానంలో ఉన్న పెనాంగ్ రాష్ట్రం.. తెలంగాణలోనూ ఈ రంగం అభివృద్ధికి సహకరించాల్సిందిగా మంత్రి కోరారు.

పెనాంగ్ ఆర్థిక వ్యవస్థలో ఉత్పాదక రంగం కీలకంగా ఉంటూ.. ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్న తీరును అధ్యయనం చేస్తామన్నారు. పెనాంగ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పనితీరును అధ్యయనం చేసేందుకు ప్రత్యేక బృందాన్ని పంపిస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఐజేఎం వంటి ప్రముఖ మలేసియా కంపెనీలు తెలంగాణలోని ఉత్పాదక రంగంలో పెట్టుబడులు పెట్టినట్లు పెనాంగ్ ఉప ముఖ్యమంత్రి రామస్వామి వెల్లడించారు. ఇరు ప్రాంతాల నడుమ దృఢమైన సాంస్కృతిక బంధం ఉందన్నారు. సౌర విద్యుత్ రంగానికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని ఫొటో వోల్టాయిక్(పీవీ) ఉత్పత్తి రంగంలో పెనాంగ్ సహకారాన్ని కోరుకుంటున్నట్లు పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్ చెప్పారు. పీవీ ఉత్పత్తి రంగంలో పెట్టుబడులకు తెలంగాణలో అనేక అవకాశాలున్నాయన్నారు. ఉత్పాదక రంగంతో పాటు, నైపుణ్య శిక్షణాభివృద్ధిలో సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రామస్వామి వెల్లడించారు. సేవా, సాఫ్ట్‌వేర్ అభివృద్ధి రంగాల్లో తాము తెలంగాణ సహకారాన్ని కోరుకుంటున్నామని చెప్పారు.

Advertisement
Advertisement