కేటీఆర్కు ట్వీట్ చేసి.... | Sakshi
Sakshi News home page

కేటీఆర్కు ట్వీట్ చేసి....

Published Sat, Feb 6 2016 4:18 PM

కేటీఆర్కు ట్వీట్ చేసి.... - Sakshi

హైదరాబాద్ : రాజకీయ నాయకుడిగా ఎదగాలని ఇటీవలి కాలంలో చేస్తున్న రకరకాల ప్రయత్నాలేవీ ఫలితాలను ఇవ్వకపోవడంపై ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు లోకేష్కు అంతుబట్టడం లేదు. ఇప్పుడేం చేయాలో అంతుబట్టక తర్జనభర్జన పడుతున్నారు. తన ఇమేజీ మరింత డ్యామేజీ కావడం ఆయనకు మింగుడుపడటం లేదు. కేసీఆర్ కుమారుడు కేటీఆర్ తరహాలో తన ఇమేజీని పెంచుకోవడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్న లోకేష్ ఇటీవలి కాలంలో తన చుట్టూ సలహాదారులు, మీడియా మేనేజ్ మెంట్ టీం వంటి అనేక వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే.

తన రాజకీయ వారసుడిగా ఎదగాలన్న కాంక్షతో చంద్రబాబు ఏడాది కాలంగా లోకేష్ కు అనేక బాధ్యతలను అప్పగించారు. అప్పటి నుంచి రాజకీయంగా ఎదగడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం ఇవ్వకపోవడంపై ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. గ్రేటర్ ఎన్నికల్లో ఘోర పరాజయం లోకేష్ రాజకీయ కెరీర్ ను కూడా ప్రశ్నార్థకంగా మార్చింది. కేటీఆర్ స్థాయిలో తానూ ఎదగాలన్న ప్రయత్నాల్లో ఉన్న లోకేష్ ఇటీవలి గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం సందర్భంగా సభల్లో విమర్శల్లో ఏమాత్రం పస లేకపోవడం, హైదరాబాద్ నగరంపై అవగాహన లేకుండా చేశారన్న  అభిప్రాయం పార్టీలో బలంగా వినిపిస్తోంది. లోకేష్ ను నాయకుడిగా అంగీకరించడానికి ప్రజలు సిద్ధంగా లేరన్న విషయం గ్రేటర్ ఎన్నికలతో తేలిపోయిందని నేతలు ఇప్పుడు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.

గ్రేటర్ ఎన్నికల ప్రచారం సందర్భంగా మంత్రి కేటీఆర్ కు ట్విట్టర్ ద్వారా లోకేష్ సవాలు చేయడం కూడా నేతలు ఊదహరిస్తున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించడానికి సంబంధించి ఒక మహిళ తనను కలిసిన విషయాన్ని కేటీఆర్ కు ట్విటర్ లో పోస్టు చేశారు. దానికి వెంటనే కేటీఆర్ కౌంటర్ ఇవ్వడంతో లోకేష్ ఢీలా పడ్డారు. ఈ రకంగా రాజకీయ వ్యూహం లేకపోవడం, పసలేని విమర్శలు చేయడం ద్వారా మరింత నవ్వులపాలవుతున్నామని టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. వాటి నుంచి బయటపడకుండా మీడియాలో నిత్యం కనిపించడం కోసం ఆయన సలహాదారులు, ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం ద్వారా ప్రయోజనం లేదని పార్టీ నేతలు రుసరుస లాడుతున్నారు.

గ్రేటర్ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాభవం ఇప్పుడు పార్టీ అసలుకే ఎసరు తెస్తోంది. నేతలెవరూ ఈ ఫలితాలపై మాట్లాడటానికి ముందుకు రావడం లేదు. ఫలితాలు వెల్లడైన రోజునే కాకుండా రెండో రోజు శనివారం కూడా నేతలెవరూ ఎన్టీఆర్ భవన్ వైపు కన్నెత్తి చూడలేదు. ఎన్నికలకు ముందు లోకేష్ వచ్చి ఏదో చేస్తారన్నట్టు బిల్డప్ ఇచ్చారనీ, తీరా ఫలితాలు చూస్తే ప్రజలు ఏమాత్రం ఆయనను స్వీకరించడానికి సిద్ధంగా లేరని తేలిపోయిందని గ్రేటర్ ఎన్నికలపై నియమించిన కమిటీ సభ్యుడొకరు నిర్వేదం వ్యక్తం చేశారు. రాజకీయ వారసుడి కోసం పసలేని నేతలను మాపై రుద్దతున్నారని మండిపడ్డారు. ఈ ఎన్నికల బాధ్యతను నెత్తినెత్తుకున్న లోకేష్ పార్టీలోని నేతలందరినీ ఎందుకు సమన్వయం చేయలేకపోయారని పార్టీలో చాలా మంది ప్రశ్నిస్తున్నారు.

గ్రేటర్ ఫలితాలు వెల్లడైన తర్వాత ఈ ఎన్నికల్లో సమన్వయ బాధ్యతలను నెత్తినెత్తుకున్న నేతలెవరితోనూ లోకేష్ మాట్లాడలేదని తెలిసింది. ఓటమికి కారణాలను విశ్లేషించే పేరుతో నేతలను పిలిచి సమావేశం నిర్వహించాలని కొందరు సన్నిహితులు చెప్పడంతో సరేనన్న లోకేష్ శనివారం సాయంత్రం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే కొంత మంది నేతలు తమకు ఇతరత్రా పనులు ఉన్నాయంటూ సమావేశానికి రాలేమని తేల్చిచెప్పినట్టు పార్టీ వర్గాల సమాచారం.

Advertisement
Advertisement