పచ్చని తోట...బహుమతుల ‘పంట’ | Sakshi
Sakshi News home page

పచ్చని తోట...బహుమతుల ‘పంట’

Published Sun, Feb 14 2016 4:19 AM

పచ్చని తోట...బహుమతుల ‘పంట’ - Sakshi

సాక్షి,సిటీబ్యూరో: ఆహ్లాదభరితమైన ఆకుపచ్చ లోకంలా కనిపించే ఖైరతాబాద్ ఆర్టీఏ ఉద్యానవనానికి ఈ ఏడాది కూడా ప్రథమ బహుమతి లభిం చింది. శనివారం నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ రఘునాథ్ ఈ బహుమతిని అందుకున్నారు. రకరకాల పూల మొక్కలు, అందమైన ఆకృతుల్లో పెరిగిన చెట్లు, నేలంతా పరుచుకున్న పచ్చదనం, ఫౌంటెన్‌లు, ముగ్గులతో ఎంతో కళాత్మకంగా కనిపించే రవాణా కమిషనర్ ప్రధాన కార్యాలయం, హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ కొలువుదీరే వందేళ్ల నాటి వారసత్వ భవనం మరింత అందంగా కనిపిస్తాయి.

ప్రభుత్వ కార్యాలయాల్లో పర్యావరణ పరిరక్షణకు చేపట్టే చర్యలు, మొక్కల పెంపకం, గార్డెన్‌ల ఏర్పాటు, నిర్వహణ, పరిరక్షణ చర్యలను బట్టి ఉద్యానన శాఖ ఏటా బహుమతులను అందిస్తుంది. అలా ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ ఉద్యానవన ప్రాంగంణం ప్రభుత్వ కార్యాల యాల విభాగంలో 2002 నుంచి ఇప్పటి వరకు వరుసగా ప్రథమ స్థానంలో నిలుస్తోంది. నిజాం కాలం నాటి చారిత్రక భవన పరిరక్షణకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే...గార్డెన్‌ను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.
 
లేడీస్ క్లబ్ ప్రశంసలు
హైదరాబాద్ గార్డెన్ లేడీస్ క్లబ్ అసోసియేషన్ ప్రతినిధులు శనివారం ఆర్టీఏ గార్డెన్‌ను సందర్శించి ప్రశంసించారు. చక్కటి ప్రమాణాలతో గార్డెన్ పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నారని అసోసియేషన్ ప్రతినిధి షీల చెప్పారు. ఆర్టీఏ కార్యాలయంలోకి అడుగు పెట్టగానే ఎంతో ప్రశాంతంగా ఉంటుందన్నారు. దీని పరిరక్షణకు కృషి చేస్తున్న ట్రాన్స్‌పోర్ట్ భవన్ మ్యూచువల్ ఎయిడెడ్ కో- ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సేవలను ఆమె అభినందించారు.
 
వెస్ట్ జోన్‌లో 8 పార్కులకు...
గచ్చిబౌలి: వెస్ట్ జోన్ పరిధిలో సుందరంగా తీర్చిదిద్దిన పార్కులకు రెండో గార్డెన్ ఫెస్టివల్ అవార్డులు లభించాయి. తెలంగాణ ఉద్యాన వన శాఖ వీటిని ఉత్తమ అవార్డులకు ఎంపిక చేసింది. కాల నీల కేటగిరీలో శేరిలింగంపల్లి సర్కిల్-12లోని ఎల్‌ఐజీ-511 పార్కు, శేరిలింగంపల్లి సర్కిల్-11లోని గుల్ మోహర్ కాలనీ పార్కు, సర్కిల్-14 హెచ్‌ఎం టీ హిల్స్ పార్కులకు మొదటి బహుమతి వచ్చింది. సర్కిల్-12లోని మయూరి నగర్ పార్కు, సర్కిల్-11లోని టెలికాం నగర్ పార్కు, కూకట్‌పల్లి సర్కిల్ 14బిలోని జల వాయు విహార్ పార్కులకు ద్వితీయ బహుతులు దక్కాయి.

సర్కిల్-14లోని శిల్పా అవెన్యూ పార్కుకు.. ప్రభుత్వ కార్యాలయాల కేటగిరీలో కూకట్‌పల్లి సర్కిల్-14 కార్యాలయ ప్రాంగణంలోని పార్కుకు ప్రత్యేక బహుమతులు దక్కాయి. వెస్ట్ జోనల్ కమిషనర్ బి.వి.గంగాధర్ రెడ్డి అక్కడ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తూ గార్డెన్‌ను ప్రత్యేక శ్రద్ధతో తీర్చిదిద్దారు.

Advertisement
Advertisement