వామ్మో... కందిపప్పు ! | Sakshi
Sakshi News home page

వామ్మో... కందిపప్పు !

Published Mon, Mar 30 2015 3:45 AM

... Inquire into gram!

సాక్షి, సిటీబ్యూరో : భాగ్యనగరంలో సామాన్యుల బతుకులు భారంగా మారాయి. నగర మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు నింగికి ఎగబాకుతుండటం ఆందోళన కల్గిస్తోంది. అన్ని వర్గాల ప్రజలు నిత్యం వినియోగించే బియ్యం, పప్పులు, నూనెల ధరలు అనూహ్యంగా పెరిగిపోతుండగా, హోల్‌సేల్..  రిటైల్ ధరలకు ఏమాత్రం పొంతన ఉండటం లేదు. ప్రత్యేకించి కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు ధరలు సామాన్యులకు అందనంతంగా పెరిగిపోయాయి. జనవరిలో కేజీ రూ.72లున్న కందిపప్పు ధర ఇప్పుడు ఏకంగా రూ.102లకు చేరుకుంది. దీనికితోడు పెసరపప్పు, మినపప్పు, బియ్యం, ఎండుమిర్చి, చింతపండు, పసుపు, దనియాల ధరలు సైతం దడ పుట్టిస్తున్నాయి. రెండు నెలల క్రితం సోనా మసూరి (కొత్త) బియ్యం ధర క్వింటాల్ రూ.3వేలు ఉండగా ప్రస్తుతం రూ.3400లకు చేరింది.

కొందరు రిటైల్ వ్యాపారులు బెస్ట్ క్వాలిటీ పేరుతో అదే బియ్యాన్ని క్వింటాల్‌కు రూ.3500 అంటగడుతున్నారు. పాతబియ్యం క్వింటాల్ రూ.4800- 5000లు ధర పలుకుతున్నాయి. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో రూ.48-50లు వెచ్చించనిదే కిలో ఫైన్ రకం బియ్యం లభించట్లేదు.   వంట నూనెల ధరలు హోల్‌సేల్‌గా తగ్గినా, చిల్లర మార్కెట్లో మాత్రం భగ్గునమండుతున్నాయి. పల్లీ నూనె ధర హోల్‌సేల్ మార్కెట్లో   లీటర్ రూ. 95లుండగా, అదే రిటైల్ మార్కెట్లో రూ.5-6లు అదనంగా వసూలు చేస్తున్నారు. అన్ని రకాల నూనెల ధరలు రూ.4-6ల వరకు పెరిగాయి. పామాయిల్ ధర కూడా అందుబాటులో లేకపోవడంతో సామాన్యులు విలవిల్లాడిపోతున్నారు.

వీటికితోడు కారం, చింతపండు, దనియాలు, పల్లీలు, పుట్నాలు, బెల్లం, పంచదార ధరలు కూడా కేజీకి రూ.6-10 పెరిగాయి.  రాష్ట్రంలో ఆయిల్ పంట, పప్పుధాన్యాల సాగు విస్తీర్ణం  క్రమంగా తగ్గిపోతుండటమే ఈ పరిస్థితి కారణంగా కన్పిస్తోంది. కొన్నిరకాల సరుకులను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకొంటుండటంతో వ్యాపారులు ధరలు పెంచి సొమ్ము చేసుకొంటున్నారన్నది బహిరంగ రహస్యమే. ఈ పరిస్థితుల్లో నెల బడ్జెట్‌లో అధికభాగం బియ్యం, వంటనూనె, పప్పులకే కేటాయించాల్సి వస్తోందని చిరుద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. ఇక సామాన్య, మధ్యతరగతి ప్రజల బతుకులు మరింత భారంగా మారాయి.
 
కృత్రిమ కొరతకు యత్నం :
నగర మార్కెట్లో నిత్యావసర వస్తువులకు కృత్రిమ కొరత సృష్టించేందుకు కొందరు అక్రమార్కులు ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. ప్రధానంగా వివిధ రకాల పప్పులు, వంటనూనె, కొబ్బరి, మసాలాలు వంటివాటిని గోదాములకు తరలించి మార్కెట్లో కృత్రిమ కొరత సృషించేందుకు సన్నద్ధమయ్యారు. నగరంలోని మెహబూబ్ మేన్షన్, సిద్ధిఅంబర్‌బజార్, బేగంబజార్, ముక్తియార్‌గంజి తదితర హోల్‌సేల్ మార్కెట్లలో  కొందరు వ్యాపారులు సరుకును దాచిపెట్టి మార్కెట్లో కొరతను సృష్టిస్తున్నారు. అక్రమ వ్యాపారులను కట్టడి చేయడంలో అధికారుల వైఫల్యం కారణంగా సామాన్య, మధ్యతరగతి ప్రజలు నిలువునా దోపిడీకి గురవుతున్నారు.

Advertisement
Advertisement