బ్లాక్‌లిస్టులో ఉన్న కంపెనీకే పట్టం! | Sakshi
Sakshi News home page

బ్లాక్‌లిస్టులో ఉన్న కంపెనీకే పట్టం!

Published Thu, Jun 30 2016 4:57 AM

బ్లాక్‌లిస్టులో ఉన్న కంపెనీకే పట్టం! - Sakshi

- ‘డయాలసిస్’ టెండర్ నెఫ్రోకేర్ హెల్త్ సర్వీసెస్‌కు..
- టెండర్ దక్కడం వెనుక ఏపీ మంత్రి హస్తం
 
 సాక్షి, హైదరాబాద్: ఏపీ ఆరోగ్య శాఖ లో కాంట్రాక్టులన్నీ  తెలుగుదేశం పార్టీ నేతలు సిఫార్సు చేసిన వారికే దక్కుతున్నాయి. తాజా గా డయాలసిస్ మెషీన్ల టెండర్లలో ఇదే జరిగింది. ప్రభుత్వ పెద్దలు సూచించిన నెఫ్రో కేర్ హెల్త్ సర్వీసెస్ కు కాంట్రాక్టు కట్టబెట్టారు. ఈ కంపెనీని ఢిల్లీ ప్రభుత్వం బ్లాక్‌లిస్టులో పెట్టింది. ఈ కంపెనీకిచ్చిన కాంట్రాక్టును ఒడిశా సర్కారు రద్దు చేసింది. అయినా అదే కంపెనీకి ఏపీలో పట్టం కట్టడం గమనార్హం.

 ఇ-ప్రొక్యూటర్‌మెంట్‌ను తుంగలో తొక్కింది
 రాష్ర్టంలో ఒక్కో జిల్లాలో 10 డయాలసిస్ యంత్రాలు ఏర్పాటు చేయడానికి పీపీపీ విధానంలో అధికారులు టెండర్లను పిలిచారు. టెండర్ విలువ రూ.10 లక్షలు దాటితే ఈ-ప్రొక్యూర్‌మెంట్‌కు వెళ్లాలి. కానీ, కుటుంబ సంక్షేమశాఖ ఆఫ్‌లైన్ టెండర్లు చేపట్టింది. ఈ నెల 24 టెండర్‌కు చివరి రోజు, సాయంత్రం 5 గంటల వరకూ 4 కంపెనీలే వచ్చినట్టు రిజిస్టర్‌లో నమోదైంది. కానీ, 25వ తేదీన బిడ్‌లను ఓపెన్ చేయగానే నెఫ్రోకేర్ హెల్త్ సర్వీసెస్ తెరపైకి వచ్చింది. ఈ కంపెనీకే టెండర్ కట్టబెట్టేందుకు డీసీడీసీ హెల్త్‌కేర్ సర్వీసెస్‌పై అనర్హత వేటు వేశారు.  

 శ్రీకాకుళం మంత్రి అండతోనే..
 ఏడాదిన్నర క్రితం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఓ డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు నామినేషన్ కింద నెఫ్రోకేర్ హెల్త్ సర్వీసెస్‌కు పనులప్పగించారు. అప్పట్లో ఈ కంపెనీకి శ్రీకాకుళం జిల్లా మంత్రి ఒకరు అండగా నిలిచినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడూ అదే మంత్రి హస్తం ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement
Advertisement