ఆర్జితం: మాటలు కోట్లు దాటాయి! | Sakshi
Sakshi News home page

ఆర్జితం: మాటలు కోట్లు దాటాయి!

Published Sun, Apr 20 2014 1:29 AM

ఆర్జితం:  మాటలు కోట్లు దాటాయి!

మాటలు కోటలు దాటుతుంటాయి కానీ అడుగులు గడప దాటవు అని ఓ చక్కటి సామెత ఉంది. తమాషా ఏంటంటే... మాటలు కోటలు దాటితే చాలు... నువ్వే కోటీశ్వరుడివి అంటోంది ప్రపంచం. అలాంటి మాటల మరాఠీలైన బలియనీర్లు వీళ్లంతా. వీరి సంపాదన మన రూపాయల్లో ఎంతో చూద్దామా!
 
మాట్లాడటం ఒక కళ. ఆ ఒక్క కళ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో విషయాలు సాధించేలా చేస్తుంది. మంత్రాలకు చింతకాయలు రాలతాయో, లేదో తెలియదు గాని కొందరి మాటలకు మాత్రం కోట్లు రాలుతున్నాయి. ప్రపంచంలో కేవలం మాటలతో గంటల్లో లక్షలు, కోట్లు  సంపాదించే వారున్నారు. ఈ జాబితాలో ఉన్న వారంతా మీకు ఇంతకుముందు వేరే కారణాలతో పరిచయం అయినవారే.
 
 బిల్ క్లింటన్-హిల్లరీ క్లింటన్
 ఒకప్పటి అమెరికా అధ్యక్షుడై బిల్ క్లింటన్ టాప్ పెయిడ్ పబ్లిక్ స్పీకర్. ఒక ప్రసంగానికి ఆయన రెండున్నర కోట్ల వరకు తీసుకుంటారట. తక్కువలో తక్కువ అంటే 90 లక్షల రూపాయలకు తగ్గడట. ఆయన భార్య హిల్లరీ కూడా తక్కువేం తినలేదు. ఆమె ఫీజు రూ.1.20 కోట్లు.
 
 టోనీ బ్లెయిర్
 ఈయన బ్రిటన్ మాజీ ప్రధాని మాత్రమే కాదు గ్రేట్ స్పీకర్ కూడా. ఈయన ప్రధానిగా పదవి చేపట్టాక ప్రసంగాల్లో రాటుదేలారు. ప్రధాని పదవి నుంచి దిగిపోయాక ప్రసంగాలు ఇస్తూ సంపాదించేస్తున్నారు. టోనీ ఒక ప్రసంగానికి వసూలు చేసే ఫీజు కోటిన్నర.
 
 రూడీ గిలాని
 గతంలో న్యూయార్క్ మేయర్‌గా పనిచేశారు. ప్రపంచంలో ఓ పెద్ద నగరానికి మేయరుగా పనిచేసిన అనుభవంతో ఎంతో విషయపరిజ్ఞానం సంపాదించిన రూడీ స్వతహాగా మంచి మాటకారి. విషయం ఉన్నవాడు. అందుకే ఆయన తన ప్రసంగానికి కోటీ అరవై లక్షల ఫీజు వసూలు చేస్తారు.
 
 డొనాల్డ్ ట్రంప్
 ఈయన ప్రముఖ పారిశ్రామిక వేత్త, టెలివిజన్ పర్సనాలిటీ. అమెరికాకు చెందిన డొనాల్డ్ గలగలా మాట్లాడటంలో ఎంత అనుభవం సంపాదించారు. ఈయన ప్రసంగాలు బుక్ చేసుకోవడానికి ఎన్నో కంపెనీలు క్యూలో ఉండే పరిస్థితి. డబ్బు మాత్రం ప్రసంగానికి రూ.కోటి తీసుకుంటారు.
 
 లారీ సమ్మర్స్
లారీ ఒక ఆర్థిక వేత్త. వైట్‌హౌస్ ఎకనమిక్ కౌన్సిల్‌కు ఒకప్పుడు డెరైక్టర్‌గా కూడా పనిచేశారు. ఆర్థిక వ్యవహారాలు, సిద్ధాంతాలపై విపరీతమైన పట్టున్న లారీ హెన్రీ సమ్మర్స్ ప్రసంగానికి 80 లక్షల రూపాయల దాకా ఛార్జ్ చేస్తారట. వీరితో పాటు వర్జిన్ గ్రూప్‌కు చెందిన ఇంగ్లండ్ బిజినెస్‌మ్యాన్ సర్ రిచర్డ్ బ్రాన్సన్, అమెరికన్ ఆర్థిక వేత్త అలాన్ గ్రీన్‌స్పన్, అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు, పర్యావరణ వేత్త అల్‌గోరె, మాజీ అలస్కా గవర్నర్ అమెరికా ఉపాధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన సారాపాలిన్‌లు ఒక్కొక్కరు లక్ష డాలర్లు అంటే దాదాపు 60 లక్షల రూపాయలు ఒక్క ప్రసంగానికి తీసుకుంటారు.

ఇంతకీ వీరంతా ఇంత పెద్దమొత్తం తీసుకుని ఏం చెబుతారు అనేదేగా మీ అనుమానం. వ్యాపార విధాన రూపకల్పన, వ్యక్తిత్వ వికాసం, పీపుల్ మేనేజ్‌మెంట్, ఒప్పంద నిర్వహణ, కార్యనిర్వహణ సామర్థ్యాలు, సమాజం, పర్యావరణం, ఆర్థిక వ్యవహారాలు వంటి అంశాలలో  చక్కటి అనుభవ పాఠాలు, తెలివైన సలహాలు ఇస్తుంటారు.  
 
 1. రూడీ గిలాని
 2. బిల్ క్లింటన్
 3. అలాన్  గ్రీన్‌స్పన్
 4. హిల్లరీ క్లింటన్
 5. అల్ గోరె
 6. రిచర్‌‌డ బాన్సన్
 7. టోనీ బ్లెయిర్

Advertisement
Advertisement