టైరుబలి | Sakshi
Sakshi News home page

టైరుబలి

Published Sun, Nov 27 2016 12:54 AM

టైరుబలి

బాహుబలిలాంటి ఒక కండలరాయుడు రెండుచేతులతోనూ శివలింగం కాదు గానీ, ఒక పెద్దటైర్ భుజాలకెత్తుకుని కనిపించే బొమ్మ మన దేశంలో చాలామందికి చిన్నప్పటి నుంచి పరిచయమే. దేశ పారిశ్రామిక రంగం వేగం పుంజుకునేలా చేసిన ఈ బొమ్మ ఎంఆర్‌ఎఫ్ టైర్ల లోగో. ఇప్పటికీ అదే లోగో అలాగే ఉంది. దేశ ఆర్థిక పురోగతి పరుగులు తీయాలనే సంకల్పంతో కె.ఎం.మామ్మెన్ మాప్పిళ్లై మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ (ఎంఆర్‌ఎఫ్) సంస్థను స్థాపించారు. ఆయన సంకల్పానికి నిదర్శనమే ఎంఆర్‌ఎఫ్ లోగో. ఆయన దార్శనికతకు నిదర్శనమే ఎంఆర్‌ఎఫ్ విజయగాథ.
 
 టైర్ల తయారీ పరిశ్రమలో దేశంలోనే అగ్రగణ్యుడు కె.ఎం.మామ్మెన్ మాప్పిళ్లై 1922లో కేరళలోని ఒక సామాన్య సిరియన్ క్రైస్తవ కుటుంబంలో జన్మించారు. మద్రాసు క్రిస్టియన్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. వ్యాపార రంగంలో నిలదొక్కుకువాలనే ఆలోచన ఆయనకు ఎప్పటి నుంచో ఉండేది. చదువు పూర్తయ్యాక 1946లో చేతిలో ఉన్న కొద్దిపాటి డబ్బుతోనే మద్రాసులోని (ఇప్పటి చెన్నై) తిరువొత్తియూర్ ప్రాంతంలో మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ పేరిట ఒక చిన్న షెడ్ ఏర్పాటు చేసుకుని, చిన్నపిల్లలు ఆడుకునే బూరలు, ప్లాస్టిక్ బొమ్మలు, కర్మాగారాల్లో వాడే చేతి తొడుగులు, గర్భనిరోధక సాధనాల తయారీ ప్రారంభించారు. మాప్పిళ్లై భార్య కుంజమ్మ పనిలో చేదోడుగా ఉండేవారు. ఫ్యాక్టరీలో తయారు చేసిన బూరలు, ఇతర వస్తువులను మాప్పిళ్లై స్వయంగా విక్రయించేవారు. 
 
 టైర్ల తయారీతో చరిత్ర
 మాప్పిళ్లై 1952లో ట్రేడ్బ్బ్రర్ తయారీలోకి ప్రవేశించడంతో ఆయన కలల ప్రస్థానం మొదలైంది. అప్పటి వరకు యంత్రాలు లేకుండానే కర్మాగారం నడిపిన ఆయన, తొలిసారిగా ఆధునిక యంత్రాలను కొనుగోలు చేసి, ట్రేడ్బ్బ్రర్ తయారీ ప్రారంభించారు. అమెరికాకు చెందిన మాన్స్‌ఫీల్డ్ టైర్ అండ్ రబ్బర్ కంపెనీ భాగస్వామ్యంతో టైర్ల తయారీ రంగంలోకి ప్రవేశించారు. ఎంఆర్‌ఎఫ్ కంపెనీ తయారు చేసిన తొలి టైరును  అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి కామరాజు చేతుల మీదుగా విడుదల చేశారు. అనతికాలంలోనే ‘ఎంఆర్‌ఎఫ్’ అంటేనే టైర్లకు పర్యాయపదంగా నిలిచేస్థాయికి కంపెనీని తీర్చిదిద్దారు.ఉత్పత్తి ప్రారంభించిన ఏడేళ్లలోనే టైర్ల పుట్టినిల్లు అయిన అమెరికాకే టైర్లను ఎగుమతి చేసే స్థాయికి చేరారు.
 
 నిత్య నవీనతే విజయ రహస్యం
 నిత్య నవీనతే మాప్పిళ్లై విజయ రహస్యం. ఎప్పటికప్పుడు ఉత్పత్తుల తయారీ పద్ధతులను, నాణ్యతను మెరుగుపరచుకోవడం వల్లనే ఎంఆర్‌ఎఫ్ తిరుగులేని బ్రాండ్‌గా నిలదొక్కకుంది. దేశంలోనే తొలిసారిగా నైలాన్ టైర్ల ఉత్పత్తిని 1973లో ప్రారంభించింది. మరో ఐదేళ్ల వ్యవధిలోనే భారీ వాహనాలకు కావలసిన టైర్ల తయారీకి సూపర్‌ప్లగ్-78 టైర్ల ఉత్పత్తితో సత్తా చాటుకుంది. 1985లో ద్విచక్ర వాహనాల కోసం ప్రత్యేకంగా నైలాన్ టైర్ల తయారీ ప్రారంభించింది. టైర్ల ఉత్పత్తి కోసం మాప్పిళ్లై దేశం నలుమూలలా ఎంఆర్‌ఎఫ్ కర్మాగారాలను విస్తరించారు. అమెరికా, ఇటలీ వంటి వివిధ దేశాలకు చెందిన పారిశ్రామిక సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని క్రికెట్ ఆట వస్తువులు, రంగులు, కన్వేయర్ బెల్టులు, ఎలివేటర్ బెల్టుల తయారీ వంటి ఇతర రంగాలకూ వ్యాపారాలను విస్తరించారు. 
 
 ప్రచారంలో కొత్త ఒరవడి
 ఎంఆర్‌ఎఫ్ ఉత్పత్తులకు విస్తృత ప్రచారం కల్పించడంలో మాప్పిళ్లై కొత్త ఒరవడి సృష్టించారు. క్రికెట్ మ్యాచ్‌లు, ఫార్ములా వన్ రేసులు, బాక్సింగ్ వంటి క్రీడల పోటీలను ఖర్చుకు వెరవకుండా నిర్వహించి, ఎంఆర్‌ఎఫ్‌ను ప్రజలకు చేరువ చేశారు. భారతదేశంలోని మొట్టమొదటి చిన్నకారు మారుతి-800కు ఎంఆర్‌ఎఫ్ టైర్లతోనే మెరుగులద్దారు. ప్రస్తుతం రూ.15 వేల కోట్లకు చేరుకున్న అమ్మకాలతో ఎంఆర్‌ఎఫ్ భారత్‌లోని టైర్ల తయారీ పరిశ్రమల్లో మొదటి స్థానంలో ఉంటే, ప్రపంచవ్యాప్తంగా 12వ స్థానంలో నిలుస్తోంది. ఆటోమొబైల్ రంగంలో ‘ఆస్కార్’గా భావించే జెడిపవర్ అవార్డును ఎంఆర్‌ఎఫ్ వరుసగా పదకొండుసార్లు గెలుచుకోవడం వెనుక మాప్పిళ్లై వేసిన పునాదులే కారణమని చెప్పక తప్పదు.
 
 క్రీడా సేవకుడు
 వ్యాపార ప్రచారం కోసం క్రీడల పోటీలను నిర్వహించడమే కాదు, క్రీడాకారుల శిక్షణ కోసం కూడా మామ్మెన్ మాప్పిళ్లై విశేషంగా కృషి చేశారు. ఫాస్ట్ బౌలర్లకు శిక్షణ కోసం ఆస్ట్రేలియన్ క్రికెటర్ డెన్నిస్ లిల్లీ ఆధ్వర్యంలో చెన్నైలో 1988లో ఎంఆర్‌ఎఫ్ పేస్ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ మ్యాచ్‌లలో రాణించిన జువగళ్ శ్రీనాథ్, వెంకటేష్ ప్రసాద్, ఇర్ఫాన్ పఠాన్, మనాఫ్ పటేల్ తదితర ఫాస్ట్ బౌలర్లు ఇక్కడ శిక్షణ పొందిన వారే. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా కొన్నాళ్లు ఇక్కడ ఫాస్ట్ బౌలింగ్‌లో శిక్షణ పొందారు. ఫార్ములా వన్ అంతర్జాతీయ రేసులలో పాల్గొనడానికి నారాయణ కార్తికేయన్, అశ్విన్ సుందర్ వంటి వారికి ఎంఆర్‌ఎఫ్ స్పాన్సర్‌గా వ్యవహరించింది. మాప్పిళ్లై సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1992లో ఆయనను ‘పద్మశ్రీ’తో సత్కరించింది. దక్షిణాది నుంచి ఈ అవార్డు అందుకున్న తొలి పారిశ్రామికవేత్త ఆయనే. దేశ పారిశ్రామిక పురోగతి వేగానికి తన వంతు ఊతమచ్చిన మాప్పిళ్లై 2003 మార్చి 3న కన్నుమూశారు.
 - దండేల కృష్ణ
 

 

Advertisement
Advertisement