తిరుపతమ్మ చెంత.. భక్తుల చింత | Sakshi
Sakshi News home page

తిరుపతమ్మ చెంత.. భక్తుల చింత

Published Fri, Jul 1 2016 3:44 AM

Traders are Exploitation with Devotees!

* భక్తులను దోచుకుంటున్న వ్యాపారులు
* పట్టించుకోని అధికారులు

పెనుగంచిప్రోలు: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెనుగంచిప్రోలు శ్రీతిరుపతమ్మ అమ్మవారి ఆలయం వద్ద భక్తులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. నిబంధనల ప్రకారం అధిక ధరలు వసూలు చేయకూడదని ఉన్నా కాంట్రాక్టర్లు మాత్రం అవేమి పట్టించుకోవడం లేదు. భక్తుల మనోభావాలను ఆసరాగా తీసుకొని వారు సొమ్ము చేసుకుంటున్నారు. పుణ్యం కోసం దేవుని వద్దకు వస్తే జేబుకు చిల్లులు పడుతున్నాయని భక్తులు వాపోతున్నారు. వ్యాపారులు దోపిడీకి పాల్పడుతున్నా అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.
 
రెట్టింపు పార్కింగ్ ఫీజు
ఆలయ పరిసరాల్లో వాహనాల పార్కింగ్ చేసుకున్నందుకు కాంట్రాక్టర్లు అధికంగా వసూలు చేస్తున్నారు. ముఖ్యంగా శుక్ర, ఆదివారాల్లో వేల సంఖ్యలో వాహనాలు వస్తాయి. ఆలయం వారు ద్విచక్ర వాహనానికి రూ.5లు వసూలు చేయాలని నిర్ణయించగా రూ. 10 , కారుకు రూ.20, ఆటోకు రూ.10 నిర్ణయించగా వాటికి మరో రూ.10 అదనంగా వేసి వసూలు చేస్తున్నారు.
 
పొంగళ్ల షెడ్డు వద్ద అధిక వసూళ్లు....
అమ్మవారికి కుండలో పొంగళ్లు చేయడం భక్తుల ఆనవాయితీ. ఆలయానికి వచ్చిన భక్తుల్లో 90 శాతం మంది పొంగళ్లు చేస్తారు. అయితే పొంగలి వండుకునేందుకు చిన్నకుండ అయితే రూ.20లు తీసుకోవాల్సి ఉండగా రూ.30, పెద్దకుండకు రూ.30 తీసుకోవాల్సి ఉండగా రూ.50 వసూలు చేస్తున్నారు.
 
కొబ్బరికాయ రూ.50లు....
నిబంధన ల ప్రకారం కొబ్బరికాయ రూ.20లకు విక్రయించాల్సి ఉండగా కొబ్బరికాయతో పాటు జాకెట్ ముక్క, గాజులు, పసుపు, కుంకుమ కలిపి రూ.50లు వరకు వసూలు చేస్తున్నారు. ఇటీవల కొందరు  భక్తులు ఫిర్యాదు చేయడంతో కొబ్బరికాయ ఒక్కటి రూ.25లు అమ్ముతున్నారు. అయినా రూ.5లు అధికంగానే తీసుకుంటున్నారు.  
 
గడ్డి కట్ట రూ.5లు....
ఆలయం ముందు గోశాలలో గోవులకు భక్తులు పచ్చి గడ్డి పెట్టేందుకు ఆలయ అధికారులు కట్టకు రూ.2లు నిర్ణయించగా రూ.5లు వసూలు చేస్తున్నారు. ఒకోసారి రూ.10లకు 3కట్టలు ఇస్తున్నారు. భక్తులు టెంకాయలు కొట్టే వద్ద కూడా కాంట్రాక్టరు ఏర్పాటు చేసుకున్న సిబ్బంది  కొబ్బరికాయ కొట్టాలంటే డిమాండ్ చేసి మరీ వసూలు చేస్తున్నారు. ప్రసాదాలు పెట్టుకునేందుకు కవర్లు విక్రయం కూడా దారుణంగా ఉంది. నిబంధనల ప్రకారం కవరు రూ.2లు విక్రయించాల్సి ఉండగా రూ.5వసూలు చేస్తున్నారు.
 
లక్షలు పలుకుతున్న వేలం పాటలు...
భక్తుల నుంచి అధికంగా వసూలు చేసుకోవచ్చనే భావనతో కాంట్రాక్టర్లు లక్షలు వెచ్చించి పాటలను కైవసం చేసుకుంటున్నారు. ఆలయం వద్ద ఏడాది పాటు కొబ్బరికాయలు విక్రయించుకునేందుకు రూ.42 లక్షలు, వస్త్రాలు పోగు చేసుకునేందుకు రూ.32.30లక్షలు, పొంగళ్ల షెడ్ల నిర్వహణకు రూ.20 లక్షలు, వాహనాల పార్కింగ్‌కు రూ.13.55 లక్షలు, కొబ్బరిచిప్పలు పోగు చేసుకునేందుకు రూ.25లక్షలకు కాంట్రాక్టర్లు పాటలు సొంతం చేసుకున్నారు.

Advertisement
Advertisement