ఠారెత్తిస్తున్న ఎండలకు పిట్టల్లా రాలిన జనం | Sakshi
Sakshi News home page

ఠారెత్తిస్తున్న ఎండలకు పిట్టల్లా రాలిన జనం

Published Wed, Apr 27 2016 3:50 AM

ఠారెత్తిస్తున్న ఎండలకు పిట్టల్లా రాలిన జనం - Sakshi

వడదెబ్బకు ఒకే రోజు 8 మంది బలి
మరో ఘటనలో ప్రహరీ కూలి ఒకరు,
ఇసుకదిబ్బ కూలి మరొకరు..
రోడ్డు ప్రమాదంలో ఇంకొకరు మృతి
విలవిల్లాడిన మెతుకుసీమ

 జిల్లాలో మరణమృదంగం మోగింది. మంగళవారం ఒక్కరోజే వివిధ కారణాలతో మొత్తం 11 మంది ప్రాణాలు విడిచారు. వడదెబ్బకు ఏకంగా ఎనిమిది మంది పిట్టల్లా రాలారు. ఇసుక దిబ్బ కూలి ఒకరు, ప్రహరీ కూలి మరొకరు చనిపోగా రోడ్డు ప్రమాదంలో పంచాయతీ కార్మికుడు దుర్మరణం చెందాడు. మెదక్, రామాయంపేట, శివ్వంపేట, చేగుంట, మనూరు, కోహీర్, సిద్దిపేట, కొండపాక మండలాల్లో వడదెబ్బ బారిన పడిన ఎనిమిది మంది నేలకొరి గారు.

ఇసుక దిబ్బకూలడంతో చిన్నశంకరంపేట మండలం సూరారంలో భిక్షపతి (27) అనే కూలీ దుర్మరణం చెందాడు. ప్రహరీ కూలడంతో తూప్రాన్ మండలం రామాయిపల్లిలో దాచారం నరేష్(23) అనే కార్మికుడు ప్రాణాలు విడిచాడు. రోడ్డు ప్రమాదంలో కంగ్టి మండలం భీంరాకు చెందిన పంచాయతీ కార్మికుడు పెంటాగౌడ్(35) మరణించాడు. వడదెబ్బకు 8మంది మృతి జిల్లాలో వడదెబ్బకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. మంగళవారం ఒక్కరోజే 8 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో ఇద్దరు  మహిళలు కూడా ఉన్నారు. మెదక్,  రామాయంపేట, శివ్వంపేట, చేగుంట, మనూరు, కోహీర్, సిద్దిపేట, కొండపాక మండలాల్లో ఒక్కొక్కరు మరణించారు.

ఆర్ వెంకటాపూర్‌లో..
రామాయంపేట: ఆర్ వెంకటాపూర్‌లో బోళ్ల నర్సింలు (42) అనే వ్యక్తి వడదెబ్బకు గురై మంగళవారం తెల్లవారు జామున మృతి చెందాడు. పాత ఇళ్లు మరమ్మతు చేసుకుంటూ నర్సింలు తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వారం రోజులుగా ఎండలో పనిచేయడంతో అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు అతన్ని చికిత్స నిమిత్తం రామాయంపేట ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో మృతి చెందాడు. నర్సింలుకు భార్య పద్మ, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు.

 గోల్కొండ వీధిలో..
మెదక్: పట్టణంలోని గోల్కొండ వీధికి చెందిన కర్నిం గొల్ల రాజు (28) వడదెబ్బకు గురై మృతి చెందాడు. కూలీపని చేస్తూ జీవనం సాగిస్తుం టాడు. మూడురోజుల క్రితం వడదెబ్బకు గురయ్యాడు. చికిత్స నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.

 ఉపాధి కూలీ..
శివ్వంపేట: నవాబుపేట గ్రామంలో ఉపాధి కూలి చింతాల లక్ష్మి(40) వడదెబ్బతో మృతి చెందింది. సోమవారం ఎప్పటిలాగే గ్రామ శివారులో జరుగుతున్న ఉపాధి హామీ పనులకు వెళ్లి ఇంటికి వచ్చింది. సాయంత్రం అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. 

 వృద్ధుడు బలి..
మనూరు: రాణాపూర్‌లో గడ్డమీద నాగన్న (68) వడదెబ్బతో మృతి చెందాడు. సోమవారం పశువులను మేపి ఇంటికి వచ్చి రాత్రి నిద్రపోయాడు. మంగళవారం వేకువజామునా అస్వస్థతకు గురై మరణించాడు. ఇతనకి భార్య నర్స మ్మ, 5గురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 

 బిలాల్‌పూర్‌లో రైతు..
కోహీర్: పొలం వద్ద పని చేస్తూ వడదెబ్బకు గురై రైతు మృతి చెందాడు. బిలాల్‌పూర్ గ్రామా నికి చెందిన రైతు నర్సింలు (50) పొంలోనే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అపస్మారకస్థితిలో ఉన్న నర్సింలును ఆటోలో చికిత్స నిమిత్తం కోహీర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే చని పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నర్సింలుకు భార్య, ఇద్దరు కుమారులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. 

 నార్సింగిలో మహిళ..
చేగుంట: నార్సింగిలో అంబటి ఆగవ్వ (65) వడదెబ్బతో మృతి చెందింది. వీఆర్వో గణేష్ గ్రామానికి చేరుకొని పంచనామా నిర్వహించి నివేదికను ఉన్నతాధికారులకు పంపారు.

 వ్యవసాయ కూలీ..
చిన్నకోడూరు: గాడిచర్లపల్లిలో గాంధారి బా లయ్య (55) వడదెబ్బతో మృత్యువాత ప డ్డారు. పొలంలో పనులు చేస్తూ కుప్పకూలి పోయారు. వెంటనే కుటుంబసభ్యులు సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొం దుతూ మృతి చెందాడు. మృతునికి భార్య కనకవ్వ, ఇద్దరు కుమారులు, కూతుర్లు ఉన్నారు. 

 చికిత్స పొందుతూ..
కొండపాక: వడదెబ్బకు గురై సిద్దిపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి మంగళవారం మృతి చెందాడు. వివరాలు ఇలా.. కొండపాక మండలం సిర్సనగండ్ల గ్రామానికి చెందిన హుస్సేన్(66) సైకిల్‌పై ఊరూరా ఐస్‌క్రీంలు విక్రయిస్తుంటాడు. సోమవారం ఐస్‌క్రీంలు, సమోసాలు అమ్మి మధ్యాహ్నం ఇంటికి చేరుకున్నాడు. అస్వస్థతకు గురికావడంతో సిద్దిపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య సుల్తాన్‌బీ, కూతురు, కుమారుడు ఉన్నారు.

Advertisement
Advertisement