కానిస్టేబుల్‌ ఆత్మహత్యాయత్నం | Sakshi
Sakshi News home page

కానిస్టేబుల్‌ ఆత్మహత్యాయత్నం

Published Thu, Jan 12 2017 10:48 PM

constable sucide attempt in ps

 
  •   కొత్తపేట స్టేషన్‌లో సీఐ ఎదుట నిద్రమాత్రలు మింగిన వైనం
  •   వేధిస్తున్నారంటూ సీఐతో ఘర్షణ
గుంటూరు ఈస్ట్‌: గుంటూరు నగరంలో కొత్తపేట పోలీస్‌స్టేషన్‌లో ఒక కానిస్టేబుల్‌ ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. తనను పనిపేరుతో సీఐ వేధిస్తున్నారని ఆరోపించి సీఐతో ఘర్షణపడి స్టేషన్‌లోనే నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటన పోలీస్‌శాఖలో తీవ్ర కలకలం సృష్టించింది. గుంటూరు అర్బన్‌ ఏఎస్‌పీ భాస్కరరావు తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడకు చెందిన పీసీ నంబర్‌ 4564 ఎస్‌.మోహన్‌వెంకటేష్‌ 2011 సంవత్సరం బ్యాచ్‌లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. వివాహం కానందున్న స్టేషన్‌ సమీపంలోనే రూం అద్దెకు తీసుకుని ఉంటూ విధులకు హాజరవుతున్నారు. గురువారం ఉదయం విధులకు హాజరవగా బుధవారం కేటాయించిన విధులకు హాజరుకానందున ఎస్‌హెచ్‌వో శ్రీకాంత్‌బాబు అతని నుంచి వివరణ తీసుకున్నారు. దీనికి ముందు కానిస్టేబుల్‌ 20 రోజులకు పైగా శబరిమలైలో ప్రత్యేక విధులు నిర్వహించారు. ఈ క్రమంలో వరుసగా ఎస్‌హెచ్‌వో అతనికి బయట డ్యూటీలు కేటాయించారు. దీంతో ఆవేదన చెందిన మోహన్‌వెంకటేష్‌ ఎస్‌హెచ్‌వోతో వాదనకు దిగి వెంట తెచ్చుకున్న టాబ్లెట్లను మింగారు. సిబ్బంది అతనిని జీజీహెచ్‌కు తరలించారు. అనంతరం అక్కడి నుంచి ప్రయివేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. కానిస్టేబుల్‌కు ప్రాణాప్రాయం లేదుగానీ, ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు ప్రకటించారు. ఎడిషన్‌ ఎస్పీ భాస్కరావు, ఈస్ట్‌ డీఎస్పీ సంతోష్‌కుమార్, ఇతర అధికారులు ఆస్పత్రికి వచ్చి వెంకటేష్‌ పరిస్థితిపై ఆరా తీశారు. 
 
ఎస్‌హెచ్‌వో తీరువల్లే..
 ఎస్‌హెచ్‌వో తీరుతో మానస్తాపం చెందే కానిస్టేబుల్‌ ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు సమాచారం. వెంకటేష్‌ను రెండు రోజుల నుంచి వరుసగా అసభ్య పదజాలంతో తిట్టడం వల్లే ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తోటి కానిస్టేబుల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఎస్‌హెచ్‌వో శ్రీకాంత్‌బాబు సాక్షితో మాట్లాడుతూ విధులకు ఆలస్యంగా రావడంతో వివరణ రాయించానని,  అలాగే 11వ తేదీన సినిమా హాల్లో డ్యూటీ వేస్తే డ్యూటీకి వెళ్లకుండా మఫ్టీలో తిరుగుతున్నారని.. దీనిపై ప్రశ్నించినందుకు ఇలా చేశారని వివరించారు. 
 
 
 

Advertisement
Advertisement