‘మహా’ విజయమే లక్ష్యంగా.. | Sakshi
Sakshi News home page

‘మహా’ విజయమే లక్ష్యంగా..

Published Mon, May 4 2015 4:34 AM

YSR Congress plan to Great success

- సంస్థాగత బలోపేతం
- ప్రజాసమస్యలపై ఉద్యమబాట
- వైఎస్సార్ కాంగ్రెస్ ప్రణాళిక
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం :
సంస్థాగత సంస్కరణలు... వ్యవస్థాగత బలోపేతం... అన్ని వర్గాల ప్రజలతో మమేకం... ప్రభుత్వ వైఫల్యాలపై పోరుబాట... పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు...అంతిమంగా మహా విశాఖ ఎన్నికల్లో విజయ బావుటా... ఇదీ ప్రణాళికగా వైఎస్సార్ కాంగ్రెస్ మహా విశాఖ ఎన్నికల దిశగా కార్యాచరణకు ఉపక్రమించింది. పార్టీ ఎన్నికల పరిశీలకులు వి.విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, తమ్మినేని సీతారాం, గొల్ల బాబూరావులు శని, ఆదివారాల్లో నగరంలోని నియోజకవర్గ సమీక్షా సమావేశాల్లో ఈ మేరకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

సంస్థాగత బలోపేతం
బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే అంశానికే విజయసాయిరెడ్డి, ఇతర పరిశీలకులు ప్రాధాన్యమిచ్చారు. ప్రత్యేక ప్రొఫార్మాల ద్వారా సమాచారం సేకరించి క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన వ్యూహాన్ని నిర్ణయించాలన్నది పార్టీ ఉద్దేశం. డివిజన్, బూత్ కమిటీల ద్వారా ఎక్కువ మంది కార్యకర్తలకు పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో స్థానం కల్పించాలని స్పష్టం చేశారు. మే నెలాఖరు నాటికి డివిజన్ కమిటీలను నియమించాలని స్పష్టం చేశారు. అనంతరం జూన్, జులైలో జీవీఎంసీ పరిధిలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపడతామని ఆయన ప్రకటించారు.  

ప్రజలతో మమేకం
పార్టీ నేతలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అన్ని వర్గాల ప్రజలతో మమేకం కావాలని పార్టీ స్పష్టం చేసింది. ప్రతి కార్యకర్త కనీసం 60 మందితో ప్రత్యక్ష సంబంధాల ఏర్పచుకుని పార్టీ సిద్ధాంతాలను ప్రచారం చేయాలని ఆదేశించింది. విభిన్న భాషలు, ప్రాంతాల ప్రజల మనస్సు గెలుచుకునేలా పార్టీ నేతలు ఆయా సంఘాల సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని విజయసాయిరెడ్డి ఉద్బోధించారు. డివిజన్లలో చిన్న చిన్న సమస్యలపై కూడా స్పందిస్తూ వాటి పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. ప్రజలతో మమేకమై వారి విశ్వాసాన్ని పొందాలని చెప్పారు.

ఉద్యమబాట..
ఎన్నికల హామీల అమలులో టీడీపీ-బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలపై పోరుబాట పట్టాలని నిర్ణయించారు. ప్రత్యేక హోదా సాధనతోపాటు వ్యవసాయ, డ్వాక్రా రుణాల అమలులో వైఫల్యం, ఇతరత్రా అంశాలపై ఆందోళనకు పార్టీ సంసిద్ధమవుతోంది. విశాఖ నగరానికి సంబంధించి ఈ ఏడాది కాలంలో ప్రభుత్వ వైఫల్యాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని పార్టీ నిర్ణయించింది. మహిళా మహాసభ, విద్యార్థి మహాసభ తదితర భారీ ఆందోళన కార్యక్రమాలు నగరంలో నిర్వహిస్తామని ప్రకటించింది. తద్వారా విశాఖ కేంద్ర స్థానంగా పార్టీ ఉద్యమపథంలోకి సాగుతుందని ఈ రెండురోజుల సమావేశాల్లో స్పష్టం చేశారు.

తదుపరి దశల్లో..: ప్రతి శని, ఆదివారాలు నగరంలో పర్యటించే విజయసాయిరెడ్డి, ఇతర ఎన్నికల పరిశీలకులు భవిష్యత్తు కార్యాచరణపై స్పష్టత ఇచ్చారు. నియోజకవర్గాలకు వెళ్లి అక్కడే కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు. నియోజకవర్గ సమస్యలు గుర్తించి వాటి పరిష్కారానికి పార్టీ ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించారు. జీవీఎంసీ ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తే నగరంలో చేపట్టే అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజల్లో విశ్వాసం కలిగించడమే ధ్యేయంగా క్షేత్రస్థాయి పర్యటనలు ఉండాలని నిర్దేశించారు.

ఆదివారం నిర్వహించిన సమావేశాల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, మాజీ ఎమ్మెల్యేలు మళ్ల విజయప్రసాద్, తైనాల విజయకుమార్, సమన్వయకర్తలు వంశీకృష్ణ శ్రీనివాస్, అదీప్‌రాజ్‌లతోపాటు రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, యువజన విభాగం అధ్యక్షుడు విల్లూరి భాస్కరరావు, మహిళా విభాగం అధ్యక్షురాలు ఉషాకిరణ్‌లతోపాటు పార్టీ నేతలు సత్తి రామకృష్ణారెడ్డి, రవిరెడ్డి, ఆల్ఫా కృష్ణ, పక్కి దివాకర్, మూర్తి యాదవ్, డివిజన్ పార్టీ అధ్యక్షులు, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement