ఇల్లాలికి ప్రేమతో | Sakshi
Sakshi News home page

ఇల్లాలికి ప్రేమతో

Published Sun, Feb 14 2016 12:22 AM

ఇల్లాలికి ప్రేమతో

కన్న కూతురికి గోరు ముద్దలు పెట్టినంత ప్రేమగా ఆయన ఆమెకు తినిపిస్తారు. చిన్న పాపకు లాల పోస్తున్నంత శ్రద్ధగా స్నానం చేయిస్తారు. కొత్త పెళ్లికూతురితో నడుస్తున్నట్టు జాగ్రత్తగా చేయి పట్టి నడిపిస్తాడు. ఆయన వయసు 85. ఆమె వయసు 82. వారి ప్రేమ వయసు దాదాపు 60 ఏళ్లు. తాళికట్టిన వేళ నుంచి ఆమే ఆయన ఊపిరి. చేయి పట్టిన నాటి నుంచి ఆయనే ఆమె లోకం. కష్టమైనా కలిసే అనుభవించారు. కన్నీరైనా కలిసే పంచుకున్నారు.పెళ్లి మంత్రాలకు అర్థం తెలీకపోయినా, ప్రతి మంత్రానికీ పరమార్థంగా బతుకుతున్నారు. మాటలకు అందని ఆ ప్రేమ, వర్ణణకు అందని ఆ ఆప్యాయత అక్షరాల్లో...                        
 
 వంగర మండలంలోని లక్ష్మీపేట గ్రామానికి చెందిన వంజరాపు సత్యంనాయుడు(85), వంజరాపు వరహాలమ్మ(82)ల కథ ఇది. కాలానికి అతీతంగా, ఊహలకు కూడా అందంగా, కష్టాలను కలిసి అనుభవిస్తూ జీవిస్తున్న ప్రేమికుల గాథ ఇది. లక్ష్మీపేట గ్రామాన్ని 2001లో మడ్డువలస ప్రాజెక్టు జాతికి అంకితం చేసే సమయంలో వీళ్లకు ఉన్న రెండెకరాలు పొలం ప్రాజెక్టు నీటిలో కలిసిపోయింది. దీంతో ఆ గ్రామాన్ని వీడి ప్రభుత్వం భూమికి మంజూరు చేసిన నష్టపరిహారంతో ఎం.సీతారాంపురంలో ఓ చిన్న శ్లాబు ఇంటిని నిర్మించుకున్నారు.
 
 వీరికి ఇద్దరు కుమారులు. ఉన్న పొలాన్ని మడ్డువలసకు ఇచ్చేసిన తర్వాత వీరి స్థితి మారిపోయింది. అప్పటి వరకు కుటుంబాన్ని పోషిస్తూ వచ్చిన చిన్నకుమారుడు చనిపోయాడు. పెద్ద కుమారుడు ఇళ్లు విడిచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి వీరిద్దరే ఒకరికి ఒకరు తోడుగా జీవిస్తున్నారు. కన్న కొడుకు వదిలేసిన తర్వాత వరహాలమ్మ చూపు కోల్పోయింది. అప్పటి నుంచి భర్తే ఆమెకు లోకమైపోయారు. ఉదయం లేచిన నాటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు కాలకృత్యాలు తీర్చడం, స్నానపానాలు చేయడం, మందులు ఇవ్వడం, వంట చేయడం, తినిపించడం వంటి పనులన్నీ ప్రేమగా చేస్తారు. అలా అని వీరు ధనవంతులేం కాదు.
 
  పింఛన్ ద్వారా వచ్చే వెయ్యి రూపాయలే వీరికి జీవనాధారం. ఆ డబ్బుతోనే బియ్యం, మందులు కొనుగోలు చేసుకుని రోజులు గడుపుతున్నారు. సత్యం నాయుడు గ్రామ పరిసర ప్రాంతాల్లో కట్టెలు తెచ్చి వంట చేస్తారు. ఓ చెయ్యి సక్రమంగా పని చేయకపోయినా కట్టుకున్న భార్యను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ప్రేమంటే కానుకలు ఇవ్వడం కాదని, ప్రేమంటే తల్లిదండ్రులను విలన్లుగా మార్చడం కాదని, ప్రేమ వయసులో ఉండే వారి హక్కు కాదని రోజూ నిరూపిస్తున్నారు. అసలు సిసలు ప్రేమకు అర్థాల్లా ఉండే ఈ దంపతులు ఇప్పుడు కాసింత సాయం కోరుతున్నారు. కాసింత మెరుగైన తిండి, మరికాసింత నీడ కోరుతున్నారు.  
 

Advertisement
Advertisement