తూగో జడ్పీ ఛైర్మన్‌గా జ్యోతుల నవీన్‌ | Sakshi
Sakshi News home page

మరో ఫిరాయింపు నేతకు పదవి

Published Mon, Jul 10 2017 6:47 PM

తూగో జడ్పీ ఛైర్మన్‌గా జ్యోతుల నవీన్‌

అమరావతి: అవసరం ఉన్నంతవరకూ వాడుకుని, ఆ తర్వాత కూరలో కర్వేపాకులా పక్కన పడేసే... టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి నైజం మరోసారి బయటపడింది. స్వార్థ ప్రయోజనాల కోసం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఫిరాయించిన నాయకుడి కోసం ఏళ్ల తరబడి పార్టీ జెండాను మోస్తున్న నేతలు బలవక తప్పలేదు. వైఎస్‌ఆర్‌ సీపీ నుంచి జగ్గంపేట ఎమ్మెల్యేగా ఎన్నికైన జ్యోతుల నెహ్రూ, ఆయన కుమారుడు నవీన్‌ కుమార్‌ జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికై అనంతరం టీడీపీలోకి ఫిరాయించిన విషయం తెలిసిందే.

ఫిరాయింపు వేళ కుదుర్చుకున్న ఒప్పందానికి అనుగుణంగా నవీన్‌ను జిల్లా షరిషత్‌ చైర్మన్‌ పీఠంపై కూర్చోబెట్టేందుకు టీడీపీ... అందులో భాగంగా జెడ్పీ చైర్మన్‌ నామన రాంబాబును బలవంతంగా ఇప్పటికే టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. అనంతరం ఆయనను జెడ్పీ పీఠం నుంచి తప్పించేందుకు ఒత్తిడి తెచ్చారు. ఈ నేపథ్యంలో రాంబాబు నిన్న (ఆదివారం) రాజీనామా చేశారు. అయితే ఫిరాయింపు సమయంలో జ్యోతుల నెహ్రుకు మంత్రి పదవి ఆశ చూపి చివరకు ఆయన కుమారుడికి తాత్కాలిక జెడ్పీ చైర్మన్‌ పదవితో చంద్రబాబు సరిపెట్టారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం జీవో నెంబరు 473ను జారీ చేసింది.

కాగా తూర్పుగోదావరి  తాత్కాలిక జిల్లా ప్రజా పరిషత్ ఛైర్మన్ గా జ్యోతుల నవీన్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. ఈనెల 15వ తేదీన జడ్పీ తాత్కాలిక ఛైర్మన్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారని వెల్లడించారు. అదేవిధంగా జడ్పీ వైస్ ఛైర్మన్‌గా నళినీకాంత్‌ను పార్టీ అధిష్టానం ఎంపిక చేసిందని చెప్పారు. ఆయన కూడా 15వ తేదీన పదవీ బాధ్యతలు స్వీకరిస్తారని అన్నారు.  అయితే జ్యోతుల నెహ్రు కుమారుడు నవీన్‌కు జడ్పీ చైర్మన్‌ పదవి ఇవ్వడంపై మంత్రి యనమల రామకృష్ణుడు సహా మెజార్టీ జెడ్పీటీసీల్లో అసంతృప్తి నెలకొంది.

Advertisement
Advertisement