కాటేస్తున్న కరవు | Sakshi
Sakshi News home page

కాటేస్తున్న కరవు

Published Sun, Oct 19 2014 2:45 AM

కాటేస్తున్న కరవు

కడప సెవెన్‌రోడ్స్:
 జిల్లాను కరవు వెంటాడుతోంది. వర్షాధార పంటలన్నీ నిలువునా ఎండిపోయాయి. తాగునీటి ఎద్దడి, పశుగ్రాసం కొరత వేధిస్తోంది. జిల్లాలోని 49 మండలాలను కరువు కింద ప్రకటించి సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా యంత్రాంగం ఇప్పటికే ప్రతిపాదనలు పంపింది. అయితే ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. తుఫాన్‌ల విషయంలో ప్రదర్శించే చొరవ కరవు సహాయక చర్యల్లో చూపడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఏడాది ఖరీఫ్‌లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు చోటు చేసుకున్నాయి. సాధారణ పంటల సాగు 1.79లక్షల హెక్టార్లు కాగా కేవలం 31,334 హెక్టార్లలోనే సాగయ్యాయి. జూన్, జులై, ఆగస్టు నెలల్లో వర్షపాతం సాధారణం కంటే తక్కువ నమోదైంది. దీంతో  ప్రధాన పంట వేరుశనగ దాదాపుగా తుడిచిపెట్టుకపోయింది. అలాగే పత్తి, జొన్న, కంది, సజ్జ లాంటి వర్షాధార పంటలు కూడా బాగా దెబ్బతిన్నాయి. రైల్వేకోడూరు, ఓబులవారిపల్లె మినహా మిగిలిన 49 మండలాలను కరవు కింద ప్రకటించాలంటూ కలెక్టర్ కేవీ రమణ ప్రభుత్వానికి ప్రతిపాదించారు.

 కరవు మండలాల ప్రకటనకు ప్రామాణికాలు ఇవీ.. :
  వార్షిక సాధారణ వర్షపాతం 1000 మి.మీ.పైన ఉండే మండలాల్లో 25 శాతం, 750 నుంచి 999.9 మి.మీ. ఉన్న మండలాల్లో 20శాతం, 749.9 మి.మీ. నుంచి తక్కువ ఉన్న మండలాల్లో 15 శాతం వర్షపాత లోటు నమోదు కావాలి.

  పంటల సాగు విస్తీర్ణం 50 శాతంలోపు ఉండాలి.
  పంటల దిగుబడి 50 శాతం కంటే తక్కువకు పడిపోవడం, అధిక దిగుబడులనిచ్చే రకాల పంటలైతే 40 శాతానికి పడిపోవడం.

  వరుసగా 21 రోజులపాటు వర్షపాతం నమోదు కాకపోవడం (డ్రై స్పెల్స్)
 వీటిలో వర్షపాత లోటు తప్పనిసరిగా నమోదైవుండాలి. మిగిలిన మూడు ప్రామాణికాల్లో రెండిటి ప్రభావం ఉండాలి. ఈ విధంగా పరిశీలిస్తే 50 మండలాల్లో వర్షపాత లోటు, 49 మండలాల్లో సాగు విస్తీర్ణం పడిపోవడం, 43 మండలాల్లో దిగుబడి తగ్గిపోవడం, 46 మండలాలు డ్రై స్పెల్స్‌కు గురయ్యాయి. వీటిని పరిగణలోకి తీసుకుని 49 మండలాలకు ప్రతిపాదనలు పంపారు.
 
 వేధిస్తున్న పశుగ్రాసం కొరత :
 జిల్లాలోని పశుసంపదకు 7.71లక్షల మెట్రిక్ టన్నుల గ్రాసం అవసరం కాగా 7.38 లక్షల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నట్లు పశు సంవర్థక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. 0.33 లక్షల మెట్రిక్ టన్నుల గ్రాసం అవసరం ఉంది. భూమి లేని నిరుపేదలు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. దుర్భిక్ష పరిస్థితులు మరికొంతకాలం కొనసాగితే తీవ్ర ఇబ్బందులపాలు కావాల్సివస్తోంది. ఈ పరిస్థితుల్లో జిల్లాకు ఎండుగడ్డిని సరఫరా చేయాల్సి ఉంటుందని కలెక్టర్ కోరారు.

పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న పేదలకు 50 శాతం సబ్సిడీతో ఎండుగడ్డి సరఫరా చేయాలని ఆయన కోరారు. జిల్లాలోని 10వేల మంది రైతులకు అవసరమైన 5వేల మెట్రిక్ టన్నుల ఎండుగడ్డిని సరఫరా చేసేందుకు రూ. 2కోట్లు  మంజూరు చేయాలని కోరారు. అలాగే పంటలు సాగుచేసి నష్టపోయిన రైతాంగానికి ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలని ప్రతిపాదించారు.
 
 తాగునీటికి కటకట

 వర్షాలు లేకపోవడంతో జిల్లాలోని పలు మండలాల్లో భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. పలుచోట్ల తాగునీటి వనరులు ఎండిపోవడం వల్ల ప్రజలతోపాటు పశువులు నీటి ఎద్దడితో అల్లాడుతున్నాయి. రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు, కమలాపురం, పులివెందుల, జమ్మలమడుగు నియోజకవర్గాల్లోని 24 మండలాల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొందని అధికారుల గణాంకాలు తెలియజేస్తున్నాయి.

మరికొంతకాలం ఇవే పరిస్థితులు కొనసాగితే తాగునీటి కోసం ఊర్లు వదిలి వెళ్లాల్సివస్తోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజూ జిల్లాలో ఏదో ఒక మంత్రి పర్యటిస్తూనే ఉన్నప్పటికి కరవు సహాయక చర్యలు చేపట్టే విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
 

Advertisement
Advertisement