Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్‌గా మ‌ళ్లీ కోహ్లినే! | Sakshi
Sakshi News home page

Virat Kohli: అదే జరిగితే.. ఆర్సీబీ కెప్టెన్‌గా మ‌ళ్లీ కోహ్లినే!

Published Tue, May 14 2024 8:08 PM

RCB Told To Bring Kohli Back As Captain if They Fail Reach IPL 2024 Playoffs

రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు.. 2008 నుంచి ఇప్ప‌టి దాకా.. ఇంత వ‌ర‌కు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెల‌వ‌లేదు. అయిన‌ప్ప‌టికీ ఆ జ‌ట్టుకు ఉన్న అభిమాన గ‌ణం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆర్సీబీకి ఉన్నంత విశ్వ‌స‌నీయ‌మైన ఫ్యాన్ బేస్ మ‌రే జ‌ట్టుకు లేదంటారు.

నాయ‌కుడి స్థానం నుంచి  వైదొలిగి
ఇంత‌టి క్రేజ్‌కు కార‌ణం టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి అన్న విష‌యం తెలిసిందే. ఇక్క‌డే త‌న ఫ్రాంఛైజీ క్రికెట్ మొద‌లుపెట్టిన ఈ ర‌న్‌మెషీన్‌.. ఇప్ప‌టికీ ఆ జ‌ట్టుతోనే కొన‌సాగుతున్నాడు. ఈ క్ర‌మంలోనూ కెప్టెన్‌గానూ బాధ్య‌త‌లు చేప‌ట్టిన కోహ్లి ప‌నిఒత్తిడిని త‌గ్గించుకుని.. కేవ‌లం బ్యాటింగ్‌పై ఫోక‌స్ చేసే క్ర‌మంలో నాయ‌కుడి స్థానం నుంచి 2021 త‌ర్వాత త‌ప్పుకొన్నాడు.

గ‌త రెండు సీజ‌న్లుగా సౌతాఫ్రికా స్టార్ ఫాఫ్ డుప్లెసిస్ ఆర్సీబీ కెప్టెన్‌గా కొన‌సాగుతుండ‌గా.. కోహ్లి ఓపెనింగ్ బ్యాట‌ర్‌గా సేవ‌లు అందిస్తున్నాడు. అయితే, అత‌డి సార‌థ్యంలో గ‌తేడాది ఆరో స్థానంతో ముగించిన ఆర్సీబీ.. ఐపీఎల్-2024 ఆరంభంలో వ‌రుస ఓట‌ములు చ‌విచూసింది.

వ‌రుస‌గా ఐదు విజ‌యాలు సాధించి
త‌ర్వాత తిరిగి పుంజుకుని వ‌రుస‌గా ఐదు విజ‌యాలు సాధించి.. ప్ర‌స్తుతానికి ప్లే ఆఫ్స్ ఆశ‌లు స‌జీవం చేసుకుంది. అయితే, కేజీఎఫ్‌గా ప్ర‌సిద్ధి పొందిన ఆర్సీబీ బ్యాటింగ్ త్ర‌యం కోహ్లి, గ్లెన్ మాక్స్వెల్‌, ఫాఫ్‌ల‌లో కేవ‌లం కోహ్లి ఒక్క‌డే రాణిస్తున్నాడు.

ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ఎడిష‌న్‌లో ఆడిన 13 మ్యాచ్‌ల‌లో క‌లిపి 661 ప‌రుగులు చేసిన కోహ్లి ఆరెంజ్ క్యాప్ హోల్డ‌ర్‌గా కొన‌సాగుతున్నాడు. అయితే, జ‌ట్టును ప్లే ఆఫ్స్ చేర్చ‌డం మాత్రం క‌ష్టంగా మారింది.

ఈ నేప‌థ్యంలో టీమిండియా స్పిన్ దిగ్గ‌జం, ముంబై ఇండియ‌న్స్ మాజీ కెప్టెన్ హ‌ర్భ‌జ‌న్ సింగ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. వ‌చ్చే సీజ‌న్‌లో విరాట్ కోహ్లిని మ‌ళ్లీ కెప్టెన్‌గా ప్ర‌క‌టించాల‌ని ఆర్సీబీ మేనేజ్‌మెంట్‌కు సూచించాడు.

ఆర్సీబీకి కోహ్లి కూడా అలాగే
ఈ మేర‌కు.. "ఈసారి వాళ్లు(ఆర్సీబీ గ‌నుక ) ప్లే ఆఫ్స్‌న‌కు అర్హ‌త సాధించ‌క‌పోతే.. భార‌త క్రికెట‌ర్‌ను కెప్టెన్‌గా తీసుకురావాలి. అయినా ఎవ‌రో ఎందుకు? మళ్లీ కోహ్లినే కెప్టెన్‌ను చేస్తే స‌రిపోతుంది క‌దా! చెన్నై జ‌ట్టు మీద ధోని ప్ర‌భావం ఎంత ఉంటుందో.. ఆర్సీబీకి కోహ్లి కూడా అలాగే!

బ‌ల‌మైన నాయ‌కుడు. జ‌ట్టును ఎలా ముందుకు న‌డిపించాలో అత‌డికి తెలుసు. ప్ర‌స్తుతం వాళ్లు దూకుడుగానే ఆడుతున్నారు. కోహ్లి సార‌థిగా వ‌స్తే మ‌రింత బాగుంటుంది. విరాట్ కోహ్లి తిరిగి ఆర్సీబీ ప‌గ్గాలు చేప‌డితే చూడాల‌ని ఉంది" అని భ‌జ్జీ స్టార్ స్పోర్ట్స్ షోలో వ్యాఖ్యానించాడు.

చ‌ద‌వండి: అందుకే వాళ్లంటే నాకు, జ‌డ్డూకు చిరాకు: ధోని ఫ్యాన్స్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Advertisement
 
Advertisement
 
Advertisement