Sakshi News home page

భూరికార్డులు మారుస్తున్నారు.. వేల కోట్లు కాంట్రాక్టర్ల ఖాతాలోకి: కాంగ్రెస్‌ నేతలు

Published Sat, Dec 2 2023 10:29 AM

TS Election Results: Telangana Congress Complaint EC On BRS Govt - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నప్పుడు.. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు దుర్వినియోగం కాకుండా చూడాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి వికాస్‌ రాజ్‌ను కాంగ్రెస్‌ నేతలు కోరారు. శనివారం ఉదయం ఈసీ కార్యాలయానికి వెళ్లిన నాలుగు అంశాల విషయంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఫిర్యాదు చేసింది. 

తెలంగాణ చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌(సీఈవో)ను కలిసిన అనంతరం బయటకు వచ్చిన కాంగ్రెస్‌ నేతల తరఫున ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘బీఆర్‌ఎస్‌ నేతలకు సంబంధించిన కాంట్రాక్టర్లకు నిధులు మంజూరు చేయిస్తున్నారు. రూ.6 వేల కోట్లను తమకు నచ్చిన కాంట్రాక్టర్లకు ఇచ్చేందుకు బీఆర్‌ఎస్‌ సర్కార్‌ ప్రయత్నిస్తోంది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిబంధనలు పాటించడం లేదు. రైతు బంధు నిధుల్ని కాంట్రాక్టర్ల బిల్లులకు మళ్లిస్తున్నారు. భూరికార్డులు మారుస్తున్నట్లు కూడా మాకు సమాచారం ఉంది. రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోని భూముల్ని ధరణి పోర్టల్‌లోకి మారుస్తున్నారు..

.. ఈ విషయాలన్నీ సీఈవో దృష్టికి తీసుకెళ్లాం. అసైన్డ్‌ భూముల రికార్డులు మార్చకుండా చూడాలని కోరాం.  ప్రభుత్వ లావాదేవీలపై విజిలెన్స్‌ నిఘా పెట్టాలని కోరాం. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నప్పుడు.. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు దుర్వినియోగం కాకుండా చూడాలని కోరాం’’ అని ఉత్తమ్‌ వివరించారు.

డిసెంబర్‌ 4వ తేదీన జరగబోయే కేబినెట్‌ భేటీలో కేసీఆర్‌ సర్కార్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నిలువరించాలని కాంగ్రెస్‌ నేతలు ఈసీని కోరినట్లు తెలుస్తోంది. ఈసీని కలిసిన బృందంలో.. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మధుయాష్కీ గౌడ్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement