టీడీపీ దిగజారుడు రాజకీయం | Sakshi
Sakshi News home page

టీడీపీ దిగజారుడు రాజకీయం

Published Fri, Apr 26 2024 5:48 AM

Nominations with women named YSRCP candidates

మంగళగిరి, గుంటూరు పశ్చిమలో కుట్రపూరిత చర్యలు

వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల పేరు ఉన్న మహిళలతో నామినేషన్లు

సాక్షి ప్రతినిధి, గుంటూరు/ గుంటూరు ఈస్ట్‌: ఓటమి తప్పదని తేలిపోవడంతో చంద్రబాబు, లోకేశ్‌ నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ నేతలు దిగజారుడు రాజకీయానికి పాల్పడుతున్నారు. ఓటర్లను గందరగోళానికి గురి చేసి, వైఎస్సార్‌సీపీ ఓట్లను తగ్గించాలన్న కుట్రతో మంగళగిరి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల పేర్లతో ఉన్న మహి­ళలతో నామినేషన్లు వేయించారు. 

మంగళగిరిలో ఇద్దరితో ఇలా నామినేషన్లు వేయించారు. గుంటూరు పశ్చిమలో ఓ దళిత మహిళ పేరిట నామినేషన్‌ వేయించేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టి, రచ్చయింది. ఆ వీడియో బయటకు వచ్చింది. టీడీపీ నాయకులు తన కుమార్తెను కిడ్నాప్‌ చేశారని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఆమె పేరుతో టీడీపీ నాయకులే నామినేషన్‌ వేశారు. టీడీపీ నేతలు బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారని ఆ దళిత మహిళ స్పష్టం చేయడంతో వారి కుట్ర బట్టబయలైంది.

గుంటూరు పశ్చిమలో కుట్ర బెడిసి కొట్టిందలా.. 
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ నుంచి మంత్రి విడదల రజిని పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూడా ఓటర్లను అయోమయానికి గురి చేసేందుకు అదే పేరుతో ఉన్న మరో మహిళ పేరిట నామినేషన్‌ వేయించారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థి గళ్లా మాధవి భర్త రామచంద్రరావు స్వయంగా ఈ వ్యవహారం నడిపించిన వీడియో బయటకు వచ్చింది. ఆయన శ్రీనివాసరావుపేటలో ఉంటున్న దళిత మహిళ విడదల రజిని  ఇంటికి వెళ్లి నామినేషన్‌ వేసేలా ప్రలోభ పెట్టారు. టీడీపీ ప్రభుత్వం వస్తే ఆమె భర్తకు ఉద్యోగంతో పొటు సొంత ఇల్లు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. 

నామినేషన్‌ వేసే వరకూ తమతోనే ఉండాలని, స్కూృటినీ అయిన వెంటనే తమిళనాడులోని వేళంగిణి మాత టెంపుల్‌కు పంపిస్తామని, ఎన్నికలు ముగిసే వరకూ అక్కడే ఉండి రావాలని, ఖర్చంతా తాము పెట్టుకుంటామని చెప్పారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఆమెను తీసుకువెళ్లి టీడీపీ అభ్యర్థి ఉండే అపార్ట్‌మెంట్‌లోనే ఉంచారు. తన కుమార్తెను టీడీపీ నాయకులు తీసుకువెళ్లడాన్ని చూసిన మహిళ తండ్రి దేవరాజ్‌ తన కుమార్తెను కిడ్నాప్‌ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

నగరంపాలెం సీఐ లోకనాథం, సిబ్బంది గాలించి నగరంపాలెం మెయిన్‌ రోడ్డులోని అపార్ట్‌మెంట్‌లో ఉందని గుర్తించారు. ఆమెను అక్కడి నుంచి పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఆమె తండ్రికి పోలీసులు అప్పగించారు. ఆమె తన తండ్రితో వెళ్లిపోవడంతో టీడీపీ నాయకులు కంగుతిన్నారు. ఆమెను వైఎస్సార్‌సీపీ నాయకులు కిడ్నాప్‌ చేశారంటూ టీడీపీ కార్యకర్తలతో కలిసి నగరంపాలెం పోలీసు స్టేషన్‌ ముందు హడావుడి చేశారు. అప్పటికే ఆమె నుంచి నామి­నేషన్‌ పత్రాలపై సంతకాలు తీసుకున్న టీడీపీ నాయ­కులు ఆమె తరపున నామినేషన్‌ దాఖలు చేశారు. 

ఈ వ్యవ­హారమంతా తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ లీగల్‌ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోలూరి వెంకటరెడ్డి, లీగల్‌ సెల్‌ జిల్లా జన­రల్‌ సెక్రటరీ ఎం.శ్రీనివాసరావు, మహిళా విభాగం నగర అధ్య­క్షురాలు ఝాన్సి, కొరిటెపాటి ప్రేమ్‌కుమార్, ఇతర నాయ­కులు పోలీసు స్టేషన్‌కు చేరుకుని దళిత మహిళ రజినిని కిడ్నాప్‌ చేసిన టీడీపీ నాయకులపై కేసు పెట్టాలని డిమాండ్‌ చేశారు.

రాజకీయాల్లోకి తనను లాగొద్దన్న దళిత మహిళ
ఈ రాజకీయాల్లోకి తనను లాగొద్దని దళిత మహిళ విడదల రజిని కోరారు. ఈమేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. తనకు నామినేషన్‌ వేయడం ఇష్టంలేదని, టీడీపీ నాయకులు తన వద్ద నుంచి బలవంతంగా సంతకాలు తీసుకున్నారని స్పష్టం చేశారు.

మంగళగిరిలో ఇద్దరు లావణ్యలతో నామినేషన్లు
ఈసారి మంగళగిరిలో గెలుస్తానంటూ లోకేశ్‌ ప్రగల్భాలు పలుకుతున్నప్పటికీ, ఆయనపై రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన బీసీ వర్గాలకు చెందిన మురుగుడు లావణ్య పోటీ చేస్తుండటంతో ఆయన ఓటమి ముందే ఖాయమైపోయింది. దీంతో ఓటర్లను గందరగోళానికి గురి చేసేందుకు అదే పేరు ఉన్న మరో ఇద్దరు మహిళలతో ఇండిపెండెంట్లుగా చివరిరోజున నామినేషన్లు వేయించారు. 

వీరిలో ఓ మహిళ ఇంటిపేరు కూడా మురుగుడే కావడం గమనార్హం. రాజీవ్‌ గృహకల్పలో ఉండే బంగారం పని చేసే మురుగుడు సాంబశివరావు భార్య మురుగుడు లావణ్య గురు­వారం నామినేషన్‌ వేశారు. లావణ్య అనే పేరుతో ఉన్న మరో మహిళతో కూడా  నామినేషన్‌ వేయించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement