చిన్నమ్మకు పెద్ద ఒణుకు!’ | Sakshi
Sakshi News home page

చిన్నమ్మకు పెద్ద ఒణుకు!’

Published Sat, Apr 27 2024 12:54 PM

Daggubati Purandeswari Afraid Rajamahendravaram Mp Election

పురందేశ్వరికి ఆందోళన రేకెత్తిస్తున్న     అనపర్తి సెంటిమెంట్‌

రాజమండ్రి ఎంపీ స్థానంలో గెలుపును నిర్ణయిస్తున్న అనపర్తి ఓటర్లు

వారు ఒకే పార్టీ వైపు ఉంటారని ప్రతీతి  

గతంలో పోటీ చేసిన మురళీమోహన్‌కు చేదు అనుభవం  

50 వేల మెజారిటీతో  విజయం సాధించిన ఉండవల్లి

ప్రస్తుత ఎంపీ భరత్‌రామ్‌కు సైతం 60 వేలకు పైగా మెజార్టీ అక్కడి నుంచే  

తన ఓటమి తప్పదని భయపడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు 
 

సాక్షి, రాజమహేంద్రవరం: రాజమండ్రి పార్లమెంట్‌ ఎన్నికల్లో అనపర్తి అసెంబ్లీ సెంటిమెంట్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరికి ఆందోళన రేకెత్తిస్తోంది. బీజేపీ తరఫున ఎన్నికల్లో బరిలోకి దిగిన ఆమెను ఓటమి భయం వెంటాడుతోంది. ఇందుకు గతంలో జరిగిన ఎన్నికల్లో అనపర్తి నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన తీర్పే కారణం. అనపర్తి నియోజకవర్గ ప్రజలు ఏ పార్టీకి ఓటేయ్యాలని భావిస్తే.. ఏకమొత్తంగా వేసేసి ఆ పార్టీకి భారీ మెజార్టీ అందిస్తారన్న పేరు ఉంది. అనపర్తిలో 2.22 లక్షల మంది ఓటర్లున్నారు. ఏ పార్టీకి మొగ్గుచూపినా 50 వేలకు పైగా మెజార్టీ ఇచ్చేస్తారు. ఇందుకు గత ఎన్నికల్లో చోటు చేసుకున్న పరిణామాలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. 2009వ సంవత్సరంలో రాజమహేంద్రవరం లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా మురళీమోహన్‌ పోటీ చేశారు.

ఆయనకు రాజమండ్రి పార్లమెంట్‌ పరిధిలోని ఆరు నియోజకవర్గాల్లో స్పష్టమైన మెజార్టీ దక్కింది. కేవలం అనపర్తి నియోజకవర్గం నుంచి మాత్రం భంగపాటు ఎదురైంది. నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపడంతో అప్పటి కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు ఒక్క అనపర్తి నియోజకవర్గం నుంచే 60 వేల ఓట్ల మెజార్టీ లభించింది. అన్ని నియోజకవర్గాలు కలిపి 50 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్న టీడీపీ అభ్యర్థి మురళీమోహన్‌ అనపర్తి దెబ్బకు 10 వేల ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్న మార్గాని భరత్‌రామ్‌కు 2091 ఎన్నికల్లో 1,21,634 మెజార్టీ రాగా అందులో 62,000 ఓట్ల మెజార్టీ ఒక్క అనపర్తి నియోజకవర్గం నుంచే రావడం విశేషం. ఇలా ప్రతి ఎంపీ గెలుపులో అనపర్తి నియోజకవర్గం కీలక భూమిక పోషిస్తోంది. ప్రస్తుతం అనపర్తిలో తలెత్తిన పరిణామాల నేపథ్యంలో ప్రజలు వైఎస్సార్‌ సీపీ వైపు ఉన్నారు. ఈ పరిణామం ప్రస్తుతం రాజమండ్రి పార్లమెంట్‌ చర్చనీయాంశంగా మారింది.  

అనపర్తిపై బీజేపీ దృష్టి  
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక్క అసెంబ్లీ స్థానంలోనైనా పోటీ చేయాలన్నది బీజేపీ అధిష్టానం ఆలోచన. అందులో భాగంగానే తొలుత అనపర్తి నుంచి రంగంలోకి దింపాలని భావించారు. ఆ నియోజకవర్గంలో బీజేపీకి తగిన అభ్యర్థి లేకపోవడంతో పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును బరిలోకి దింపాలన్న ఆలోచన చేసింది. ఇందుకు ససేమిరా అన్న సోము తనకు రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్‌లో ఏ స్థానం ఇచ్చినా ఫర్వాలేదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇందుకు టీడీపీ అధినేత నిరాకరించినట్టు సమాచారం. దీంతో పునరాలోచనలో పడ్డ బీజేపీ అనపర్తిలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతను వెతికేపనిలో పడింది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన బెంగళూరుకు చెందిన ఓ వ్యాపార వేత్తను పోటీ చేయించాలని భావించింది. సదరు వ్యాపార వేత్త వద్దకు ప్రతిపాదన తీసుకెళ్లినట్లు తెలిసింది. అయన సైతం అనపర్తిలో పోటీకి సుముఖత వ్యక్తం చేయకపోవడంతో మాజీ సైనికుడు శివరామకృష్ణంరాజును ఎంపిక చేశారు. ఇక్కడే అసలు సమస్య ఎదురైంది. 

రంగంలోకి దిగిన పురందేశ్వరి, చంద్రబాబు 
అనపర్తి ఆందోళలను ఆసరాగా తీసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి రంగంలోకి దిగారు. తమ స్వప్రయోజనాలే లక్ష్యంగా సొంత పార్టీ నేతను కాదని టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లికి సీటు కట్టబెట్టేందుకు పురందేశ్వరి పావులు కదిపారు. పార్టీ నేతలు విభేదిస్తున్నా పట్టించుకోని పురందేశ్వరి నల్లమిల్లిని బీజీపీలోకి చేర్చుకున్నారు. వెంటనే ఆ పార్టీ అభ్యరి్థగా ఎన్నికల బరిలోకి దింపారు. ఈ పరిణామాలు గమనిస్తున్న బీజేపీ, టీడీపీ శ్రేణులు రాజకీయ విలువలను మంట పెట్టారంటూ ఇద్దరు నేతలపై దుమ్మెత్తి పోస్తున్నారు.  

2009 సంఘటన పునరావృతం అవుతుందా? 
అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో బీజేపీకి క్యాడర్‌ లేదు. ప్రస్తుతం ఓటర్లు వైఎస్సార్‌ సీపీ వైపే మొగ్గు చూపుతున్నారు. రాబోయే ఎన్నికల్లో సైతం సిట్టింగ్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తిసూర్యనారాయణరెడ్డికే పట్టం కట్టాలని భావిస్తున్నారు. దీనికితోడు అనసర్తి సీటు విషయమై కొన్ని రోజులుగా టీడీపీలో గందరగోళం నెలకొనడం, నాటకీయ పరిణామాల మధ్య టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారు. స్వప్రయోజనాల కోసం పార్టీ ప్రతిష్టను తాకట్టు పెట్టారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ అభ్యరి్థగా రంగంలోకి దిగుతున్న నల్లమిల్లికి ఓటమి తప్పదని, ఆ ప్రభావం పార్లమెంట్‌ అభ్యర్థి అయిన తనపై పడుతుందన్న భయం పురందేశ్వరిని వెంటాడుతోంది.    

Advertisement
Advertisement