Lok Sabha Elections 2024: Congress Tried To Rope In Sachin Tendulkar To Contest Against Modi, Details Inside | Sakshi
Sakshi News home page

Sachin Tendulkar Birthday: మోదీపై పోటీకి సచిన్‌కు కాంగ్రెస్‌ ఆఫర్‌?

Published Thu, Apr 25 2024 3:58 PM

Congress Tried to Rope in Sachin Tendulkar to Contest Against Modi - Sakshi

ఈరోజు (ఏప్రిల్‌ 24) క్రికెట్‌ దేవుడు సచిన్‌ టెండూల్కర్‌ బర్త్‌డే. ఈయనకు రాజకీయాలతోనూ అనుబంధం ఉంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో సచిన్‌తో ముడిపడిన ఆసక్తికర ఉదంతం చోటుచేసుకుంది. యూపీలోని వారణాసి స్థానం నుంచి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ ఎన్నికల బరిలో దిగిన సందర్భంలో కాంగ్రెస్‌ ఈ స్థానం నుంచి అత్యంత ఆదరణ కలిగిన సెలబ్రిటీని రంగంలోకి దించాలని భావించింది. అయితే నాడు కాంగ్రెస్‌ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఇంతకీ నాటి ఎన్నికల్లో ఏం జరిగింది?

మీడియా దగ్గరున్న వివరాల ప్రకారం 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ఎలక్షన్ కమిటీ వారణాసి అభ్యర్థిగా ఎవరిని నిలపాలనే దానిపై లోతుగా అధ్యయనం చేసింది. ఇందుకోసం పలు దఫాలుగా అనేక సమావేశాలు నిర్వహించింది. ఎంతగా ప్రయత్నించినప్పటికీ కాంగ్రెస్‌..మోదీకి దీటైన అభ్యర్థిని ఎంపిక చేయలేకపోయింది. 

ఈ నేపధ్యంలో కాంగ్రెస్‌ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌ను సంప్రదించింది. అయితే సచిన్‌.. మోదీపై పోటీ చేసేందుకు నిరాకరించారు. సచిన్ అప్పటికే రాజ్యసభకు నామినేటెడ్ సభ్యునిగా ఉన్నారు. కాంగ్రెస్‌ సీనియర్ నేత రాజీవ్ శుక్లా తమ పార్టీ తరపున వారణాసి నుండి ఎన్నికల్లో పోటీ చేయాలంటూ సచిన్‌ను కోరారు. అయితే సచిన్‌ తాను నాటి ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిరాకరించారు. దీంతో కాంగ్రెస్‌ ఆనాటి లోక్‌సభ ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే అజయ్‌రాజ్‌ను బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీపై పోటీకి నిలిపింది. 

2004 లోక్‌సభ ఎన్నికల్లో వారణాసిలో కాంగ్రెస్‌ విజయం సాధించింది. నాడు కాంగ్రెస్‌కు చెందిన రాజేష్ కుమార్ మిశ్రా రెండు లక్షల ఓట్లతో గెలిచి, పార్లమెంటుకు చేరుకున్నారు. అయితే 2009లో వారణాసి నుంచి బీజేపీ అభ్యర్థి మురళీ మనోహర్ జోషి గెలుపొందారు. నాడు కాంగ్రెస్‌ అభ్యర్థి మిశ్రా నాలుగో స్థానానికి పడిపోయారు. ఆ సమయంలో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి అజయ్ రాయ్ మూడో స్థానంలో నిలిచారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement