ఆగమైతే గోసపడతాం! | Sakshi
Sakshi News home page

ఆగమైతే గోసపడతాం!

Published Sun, Sep 17 2023 1:40 AM

CM KCR At inauguration ceremony of Palamuru-Ranga Reddy project - Sakshi

‘స్కూల్‌’ ఫీజు కడితే ఎంబీబీఎస్‌ చదువు 
రాష్ట్రంలో జిల్లాకో వైద్య కళాశాల కట్టుకుంటున్నాం. నేడు స్కూల్‌ స్థాయిలో ఫీజు కడితే ఎంబీబీఎస్‌ చదువుకునే పరిస్థితి ఉంది. తమిళనాడులో స్కూల్‌ విద్యార్థులకు టిఫిన్‌ ఇస్తుండటం బాగుందంట. రాష్ట్ర బృందాన్ని అక్కడికి పంపాం. తెలంగాణలో టెన్త్‌ వరకు విద్యార్థులందరికీ ఉదయం టిఫిన్, కోడిగుడ్డు అందిస్తాం.      
– సీఎం కేసీఆర్‌

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌/ సాక్షి, నాగర్‌కర్నూల్‌: ఎన్నికలు వస్తున్నాయనగానే కొందరు గంటలు పట్టుకుని బయలుదేరుతారని.. అలా వస్తున్న పిచ్చివాళ్ల మాటలు నమ్మి ఆగమైతే గోసపడతామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. వారి చేతిలో ఒక్కసారి మోసపోతే వైకుంఠపాళిలో పెద్దపాములా మింగేస్తారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రాజెక్టులకు ఇంటి దొంగలే ప్రాణగండంలా మారారని మండిపడ్డారు. శనివారం నాగర్‌కర్నూల్‌ జిల్లాలో కృష్ణా తీరంలోని నార్లాపూర్‌ వద్ద పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును కేసీఆర్‌ ప్రారంభించారు. అనంతరం కొల్లాపూర్‌ శివార్లలో నిర్వహించిన భారీ బహిరంగసభలో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే.. 

‘‘మహబూబ్‌నగర్, రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ జిల్లాల చరిత్రలో ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. ఒకనాడు పాలమూరు బిడ్డ అంటే వలస కూలీలుగా పేరుపడితే.. నేడు బెంగాల్, యూపీ రాష్ట్రాలతోపాటు పక్కనున్న రాయచూర్, కర్నూల్‌ జిల్లాల నుంచి కూలీలను రప్పించుకొని పొలాల్లో పని చేయించుకుంటున్న రైతు బిడ్డగా మారాడు.

పాలమూరు–రంగారెడ్డిలో ఒక్క పంపును నడిపితేనే వాగు పారేంత నీళ్లు తరలుతున్నాయి. త్వరలో మొత్తం పంపులు, కాలువలన్నీ పూర్తి చేస్తాం. ఉమ్మడి మహబూబ్‌నగర్‌తోపాటు ఉమ్మడి రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని ప్రాంతాలకూ నీళ్లు అందుతాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలోని 20 లక్షల ఎకరాల్లో నీటి పారకాన్ని నా కళ్లతో చూసేదాకా ప్రజల దీవెనలు ఉండాలి. 

ఇప్పుడు ఇంటి దొంగలతోనే గండం 
ఉద్యమ సమయంలో జోగుళాంబ ఆలయం నుంచే మొదటి పాదయాత్రను ప్రారంభించా. పాలమూరును దత్తత తీసుకున్నామని అప్పట్లో సీఎం చంద్రబాబు, ఆయన తాబేదార్లు మాట్లాడారు. ఆర్డీఎస్‌ను మూసేయకపోతే బద్దలు కొడతామన్నారు. అదే నేను సుంకేశుల ప్రాజెక్టును వంద బాంబులు పెట్టి పేల్చుతానని చెప్పిన.

మాకు కూడా బాంబులేసే మొనగాడు పుట్టిండని పాలమూరు ప్రజలు అప్పుడు సంతోషపడ్డారు. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రాజెక్టులకు ఇంటి దొంగలే, ఈ జిల్లాలో పుట్టిన సన్నాసులే ప్రాణగండంలా మారారు. ప్రాజెక్టు పనులకు అడ్డం పడ్డారు. లేకుంటే పాలమూరు ఎత్తిపోతల పథకం మూడు నాలుగేళ్ల కిందే పూర్తయ్యేది. 

ఆగమైతే గోస పడతాం.. 
ఎన్నికలు వస్తున్నాయనగానే కొందరు గంటలు పట్టుకుని బయలుదేరుతారు. నాడు రాష్ట్రం నుంచి బొంబాయి, దుబాయి వలసపోతే ఒక్కడూ సాయం చేయలే. కష్టపడి రాష్ట్రాన్ని తెచ్చుకుని బాగుచేసుకుంటున్నాం. ఇలాంటి సమయంలో వస్తున్న పిచ్చివాళ్ల మాటలు నమ్మి ఆగమైతే.. గోసపడతాం. ఒక్కసారి మోసపోతే వైకుంఠపాళిలో పెద్దపాము లెక్క మింగేస్తారు. నేను హైదరాబాద్‌ నుంచి బస్సులో వస్తుంటే బీజేపీ వాళ్లు జెండాలు పట్టుకుని అడ్డం పడుతున్నారు. ఏం పాపం చేశాం, ఎవరిని మోసం చేశామని అడ్డుపడుతున్నారు.

కృష్ణా ట్రిబ్యునల్‌లో నీటి వాటా కేటాయింపునకు పదేళ్లు పడుతుందా? సిగ్గు, చీము, నెత్తురు, పౌరుషం ఉంటే జాతీయ స్థాయి నాయకులు, కేంద్ర మంత్రులం అని చెప్పుకునేవారు ఢిల్లీలో కూర్చుని లేఖలు రాయాలి. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చాలి. కేంద్ర ప్రభుత్వానికి, ఆంధ్రాకు చెప్పేది ఒక్కటే. మాకు ఎవరి నీళ్లూ అవసరం లేదు. మా వాటా మాకు చెబితే బాజాప్తాగా నీళ్లు తీసుకుంటాం. మేం మంది సొమ్ము అడుగుతలేం. 

మూడూ పూర్తయితే.. తెలంగాణ వజ్రపు తునకే! 
తెలంగాణలో అంచనాలు వేసుకొని, హక్కులు చూసుకొని, రావాల్సిన వాటాలు చూసుకొని మూడు పెద్ద ప్రాజెక్టులు మొదలు పెట్టుకున్నాం. గోదావరి మీద కాళేశ్వరం, సీతారామ ఎత్తిపోతల, పాలమూరు ఎత్తిపోతల. ఈ మూడు ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణ ఒక వజ్రపు తునకలా తయారై దేశానికే అన్నం పెట్టే స్థాయికి పోతుంది. మన రైతులు తలఎత్తుకొని బతుకుతారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా కాళేశ్వరాన్ని వేగంగా పూర్తి చేసుకున్నాం. సీతారామ పనులు కూడా చకచకా జరుగుతున్నాయి..’’ అని సీఎం కేసీఆర్‌ తెలిపారు. 
 
ట్రిబ్యునలే పట్టించుకుని ప్రాజెక్టు ఇచ్చింది 
మహబూబ్‌నగర్‌ చరిత్ర చెబితే ఆశ్చర్యం కలుగుతుంది. 1975లో బచావత్‌ ట్రిబ్యునల్‌ తీరి్పచ్చినప్పుడు ఏ ఒక్క తెలంగాణ నాయకుడు కూడా మా మహబూబ్‌నగర్‌కు నీళ్లేవని అడగలే. చివరికి ట్రిబ్యునల్‌ జడ్జి బచావత్‌ అనే ఆయనే.. ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌లో కలవకుండా ఉండుంటే చాలా బాగుపడి ఉండేదన్నారు. కనీసం ఈ ప్రాంతానికి నీళ్లడగటం లేదని, తమకు చూడబుద్ధి కావడం లేదని చెప్పి.. తామే 17 టీఎంసీలతో జూరాల ప్రాజెక్టును మంజూరు చేస్తున్నామని చెప్పారు.

అంతేకాదు జూరాల ప్రాజెక్టును ఏదో కారణం చెప్పి మరోచోటికి తరలించకుండా తాము సూచించిన చోటే కట్టాలన్నారు. ట్రిబ్యునల్‌ రికార్డుల్లో ఈ రోజుకూ ఈ విషయాలు ఉన్నాయి. అంత జరిగినా 1981 దాకా జూరాల ప్రాజెక్టును మొదలుపెట్టలే.. శంకుస్థాపన చేసినా పనులు చేయలే. 2001లో గులాబీ జెండా ఎగిరిన తర్వాత మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో మీటింగ్‌ పెట్టి నిలదీశాకే పూర్తిచేసి, నీళ్లు నిల్వ చేశారు.  
 
కేసీఆర్‌ పుణ్యంతో పాలమూరు పచ్చబడింది: నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌ 
సీఎం కేసీఆర్‌ పుణ్యమా అని పాలమూరు గడ్డ పచ్చబడిందని, వలస వెళ్లినవారంతా తిరిగి వస్తున్నారని మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌ కోసం 45వేల మంది 12 ఏళ్లపాటు పనిచేశారని.. సుమారు పదివేల మంది పాలమూరు బిడ్డలు ప్రమాదాల్లో మరణించినా ఈ గడ్డకు మాత్రం ఫలితం దక్కలేదని మంత్రి నిరంజన్‌రెడ్డి చెప్పారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు అద్భుతమని అభివర్ణించారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఒకప్పుడు వందల ఎకరాలు ఉన్నవాళ్లు కూడా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారని, ఇప్పుడు గ్రామాలకు తిరిగి వస్తున్నారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. కాగా.. వలసల ప్రాంతంగా గుర్తింపు పొందిన పాలమూరు జిల్లాలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని రాష్ట్ర ప్రభుత్వ సీఎస్‌ శాంతికుమారి అన్నారు. పాలమూరు ప్రాజెక్టులోని ఏదుల సర్జిపూల్‌ ఆసియా ఖండంలోనే పెద్దదని, ఇంజనీరింగ్‌ అద్భుతమని పేర్కొన్నారు. 

పండుగలా ‘పాలమూరు’ ప్రారంభోత్సవం 
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. శనివారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కలసి ప్రగతిభవన్‌ నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో నార్లాపూర్‌ పంపుహౌస్‌కు చేరుకున్నారు. తొలుత పంపుహౌస్‌ వద్ద ఏర్పాటుచేసిన పాలమూరు ప్రాజెక్టు పైలాన్‌ను సీఎం కేసీఆర్‌ ఆవిష్కరించారు.

తర్వాత కేసీఆర్‌ 145 మెగావాట్ల సామర్థ్యమున్న మొదటి మోటారును ఆన్‌ చేసి, నీటి ఎత్తిపోతలను ప్రారంభించారు. సర్జ్‌పూల్, పంపుహౌస్‌లను పరిశీలించారు. నార్లాపూర్‌ పంపుహౌజ్‌ వద్ద డెలివరీ సిస్టర్న్‌ నుంచి అంజనగిరి రిజర్వాయర్‌కు తరలుతున్న నీటి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణా జలాలకు పూలు, సారె సమర్పించి, జలహారతి పట్టారు. అనంతరం కొల్లాపూర్‌ శివార్లలో నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్‌ మాట్లాడారు.

ఈ కార్యక్రమాల్లో మంత్రులు మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు, ఎంపీలు రాములు, మన్నెం శ్రీనివాస్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్, ఆల వెంకటేశ్వరరెడ్డి, లక్ష్మారెడ్డి, అబ్రహం, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, బాల్క సుమన్, జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, గోరటి వెంకన్న, పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.   

Advertisement

తప్పక చదవండి

Advertisement