హర్యానా నూతన సీఎంగా నాయబ్‌ సింగ్ సైనీ | Sakshi
Sakshi News home page

Haryana: హర్యానా కొత్త ముఖ్యమంత్రిగా నయాబ్‌ సింగ్ సైనీ

Published Tue, Mar 12 2024 1:19 PM

Nayab Singh Saini can Become the Next Chief Minister of Haryana - Sakshi

హర్యానా నూతన ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ ఎన్నుకుంది ఆ రాష్ట్ర బీజేఎల్పీ. మంగళవారం అక్కడి రాజకీయాల్లో ఒకదాని వెంట ఒకటి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో సీఎం పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేయగా.. ఆయన ప్రధాన అనుచరుడైన నాయబ్‌ ఇప్పుడు సీఎంగా ప్రమాణం చేయనున్నారు. 

అంతకు ముందు.. జేజేపీ- బీజేపీల మధ్య  పొత్తు తెగిపోవడంతో.. ఖట్టర్‌ రాజీనామా, నూతన ప్రభుత్వం ఏర్పాటు అనివార్యమైంది. అయితే ఖట్టర్‌ మళ్లీ బాధ్యతలు స్వీకరిస్తారని అంతా భావించగా.. అనూహ్యంగా నాయబ్‌ సింగ్‌ సైనీ పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఆయన హర్యానా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగానే కొనసాగుతున్నారు. అంతేకాదు కురుక్షేత్ర పార్లమెంటు సభ్యుడు(ఎంపీ) కూడా. ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు సీఎంగా ఆయన ప్రమాణం చేయనున్నారు.

ఓబీసీ కమ్యూనిటీకి చెందిన నాయబ్‌ సింగ్‌ సైనీ గత ఏడాది బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులయ్యారు. సైనీకి సంఘ్‌ కార్యకాలాల్లో సుదీర్ఘ అనుభవం ఉంది. 1996లో ఆయన బీజేపీలో చేరారు. ఆ తర్వాత 2002లో అంబాలా బీజేపీ యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గా ఎంపికయ్యారు. 

ఇదీ చదవండి: జేజేపీ అవుట్‌ చేసేందుకే బీజేపీ వ్యూహం!

2005లో ఆయన బీజేపీ అంబాలా యువమోర్చా జిల్లా అధ్యక్షుడయ్యారు. తరువాత బీజేపీ హర్యానా కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2012లో అంబాలా జిల్లా అధ్యక్షునిగా నాయబ్ సింగ్ సైనీ నియమితులయ్యారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణగఢ్ నుంచి గెలిచి హర్యానా అసెంబ్లీకి  చేరుకున్నారు.

2016లో ఖట్టర్ నేతృత్వంలోని హర్యానా ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో నాయబ్ సింగ్ సైనీ కురుక్షేత్ర ఎంపీగా ఎన్నికయ్యారు. 2023లో హర్యానా బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులయ్యారు. ఇప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు.

Advertisement
Advertisement