ఉత్తరకాశీ సొరంగం రెస్క్యూ ఆపరేషన్ సాగిందిలా..? | Sakshi
Sakshi News home page

అవాంతరాలను దాటి ఉత్తరకాశీ సొరంగం రెస్క్యూ ఆపరేషన్ సాగిందిలా..?

Published Tue, Nov 28 2023 6:42 PM

How The Uttarakhand Tunnel Collapse Rescue Operation Goes On - Sakshi

ఉత్తరకాశీ: ఉత్తర కాశీ సొరంగంలో చిక్కుకున్న కార్మికులను బయటకు తీయడానికి 17 రోజులుగా జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ ఎట్టకేలకు విజయవంతం అయింది. 41 మందిని ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. 800 మిల్లీమీటర్ల పైపు గుండా కార్మికులను బయటకు తీసుకురావడానికి ర్యాట్ హోల్ మైనింగ్ కార్మికులు మట్టి తొలగింపు పనులను పూర్తి చేశారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా పట్టు వదలకుండా రెస్క్యూ అపరేషన్‌ను దిగ్విజయంగా పూర్తి చేశారు. ఇన్ని రోజుల నుంచి రెస్క్యూ ఆపరేషన్ ఎలా సాగిందంటే..?

సొరంగం కూలింది ఇక్కడ ?
సిల్‌క్యారా బెండ్‌ నుంచి మొదలుపెట్టి బార్కోట్‌ వరకు కొండ కింద 4.531 కి.మీ.ల మేర సొరంగం తవ్వుతున్నారు. సిల్‌క్యారా వైపు నుంచి 2.340 కి.మీ.ల మేర సొరంగం తవ్వకం, అంతర్గత నిర్మాణం పూర్తయింది. సొరంగం ముఖద్వారం నుంచి దాదాపు 205–260 మీటర్ల మార్క్‌ వద్ద దాదాపు 57 మీటర్ల పొడవునా సొరంగం కూలింది. అదే సమయంలో సొరంగం లోపలి వైపుగా 41 మంది కార్మికులు పనిలో ఉన్నారు. అంటే దాదాపు రెండు కిలోమీటర్ల మేర విశాలమైన ప్రాంతంలో కార్మికులు చిక్కుకుపోయారు. 57 మీటర్ల వెడల్పుమేర శిథిలాలున్నాయి. ఇంతే వెడల్పున శిథిలాల గుండా పైపును జొప్పించి వారిని బయటకు తెచ్చేందుకు ప్రయత్నించారు.  

చిక్కుకున్న కార్మికులకు ఆహారం ఇలా..
డ్రిల్లింగ్‌ సమయంలో రాళ్లు కూలడం వంటి కారణాలతో కార్మికులను రక్షించడం సవాలుగా మారింది. దీంతో చిన్న చిన్న పైపుల ద్వారా సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికులకు ఆహారం, నీరు, మెడిసిన్‌ అందించారు. దీంతో సొరంగంలో కార్మికులు ప్రాణాలతో ఉండగలిగారు. స్టీల్‌ పైపు ద్వారా చిన్న కెమెరాను లొపలికి పంపించి సొరంగంలో చిక్కుకున్న కార్మికుల ముఖాలను కూడా చూశారు. 

లోపలికి ల్యాండ్‌లైన్..
ఆహారం నీరు అందడంతో కార్మికులు క్షేమంగా ఉన్నారు. అయితే లోపల ఉన్న కార్మికుల మానసిక స్తైర్థ్యం దెబ్బతినకుండా ఉండేందుకు సహాయకంగా లూడో వంటి బోర్డ్‌ ఆట వస్తువులతోపాటు మొబైల్‌ ఫోన్లను పంపించారు. నిరంతరం మాట్లాడేందుకు వీలుగా ‘ల్యాండ్‌లైన్‌’ను పంపారు. ఘటనాస్థలిలో టెలిఫోన్‌ ఎక్స్‌ఛెంజ్‌ను బీఎస్‌ఎన్‌ఎల్‌ ఏర్పాటుచేసింది. అక్కడి పరిస్థితిని ప్రత్యక్షంగా చూసేందుకు ఎండోస్కోపిక్‌ కెమెరాను వాడారు.

అనుకోని అవాంతరాలు..
సొరంగంలో మొదట సమాంతరంగా డ్రిల్లింగ్ పనులు ప్రారంభించారు. కానీ ఇంకొన్ని మీటర్లు డ్రిల్లింగ్‌ చేస్తే కార్మికులు చిక్కుకున్న చోటుకు చేరుకునేలోపే అనుకోని అవాంతరాలు ఎదురయ్యాయి. 25 టన్నుల బరువైన భారీ డ్రిల్లింగ్‌ మెషీన్‌ అమర్చిన ‘వేదిక’కు పగుళ్లు రావడంతో డ్రిల్లింగ్‌ను ఆపేశారు. బిగించిన వేదిక సరిగా లేకుంటే డ్రిల్లింగ్‌ మెషీన్‌ అటుఇటూ కదులుతూ కచ్చితమైన దిశలో డ్రిల్లింగ్‌ సాధ్యపడదు. అప్పుడు అసలుకే మోసమొస్తుంది. అందుకే ముందు జాగ్రత్తగా డ్రిల్లింగ్‌ను ఆపేశారు. 

Uttarakhand Tunnel Rescue:ఉత్తరకాశీకి థాయ్‌ రెస్క్యూ బృందాలు

వాతావరణం కూడా అడ్డంకిగా మారి..
ఉత్తరాఖండ్‌లో అధ్వాన్నంగా తయారైన వాతావరణం రెస్క్యూ  ఆపరేషన్‌కు కొత్త సమస్యలను సృష్టిచింది. వర్షాలు, వడగళ్ల వాన కురిసి రెస్క్యూ ఆపరేషన్‌పై ప్రభావం పడింది. సొరంగంలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌ను పరిశీలించిన ప్రధాని మోదీ ప్రత్యేక కార్యదర్శి పీకే మిశ్రా, హోంశాఖ కార్యదర్శి అజయ్ కే భల్లా, ఉత్తరాఖండ్ చీఫ్ సెక్రటరీ ఎస్‌ఎస్ సంధులు రెస్క్యూ సిబ్బందికి ప్రోత్సాహాన్ని అందించారు. రెస్క్యూ ఆపరేషన్‌కు అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణుడు ఆర్నాల్డ్ డిక్స్ కూడా తన బృందంతో ఆపరేషన్‌లో పాల్గొన్నారు. 

కొండపై నుంచి నిట్టనిలువుగా డ్రిల్లింగ్‌..
సమాంతరంగా అవాంతరాలు ఎదురవడంతో సొరంగంలో కార్మికులను కాపాడేందుకు సహాయక బృందాలు మరో ప్రణాళికను పట్టాలెక్కించాయి.  శిథిలాల గుండా సమాంతరంగా చేసిన డ్రిల్లింగ్‌ పనులను పక్కనబెట్టేశారు. కొండ పై నుంచి నిట్టనిలువుగా 86 మీటర్ల డ్రిల్లింగ్‌ పనులను మొదలు పెట్టారు. 

ఈ క్రమంలో డ్రిల్లింగ్ కోసం అమెరికా నుంచి అధునాతన ఆగర్‌ మెషీన్‌ను ఉపయోగించారు. 800 మిల్లీమీటర్ల వ్యాసమున్న స్టీల్‌ పైపు నుంచి డ్రిల్లింగ్‌ మొదలుపెట్టారు. కానీ శిథిలాల్లో ఉన్న ఇనుప కడ్డీలు డ్రిల్లింగ్‌ మెషీన్‌ బ్లేడ్లను నాశనం చేయడంతో మళ్లీ ఆటంకం ఏర్పడింది. సొరంగం అంతర్గత నిర్మాణంలో వాడిన ఇనుప కడ్డీలు సొరంగం కూలాక శిథిలాల్లో చిందరవందరగా పడి ఆగర్‌ మెషీన్‌ ముందుకు కదలకుండా అడ్డుపడ్డాయి. దీంతో డ్రిల్లింగ్ వేళ మెషీన్‌ బ్లేడ్లన్నీ ధ్వంసమయ్యాయి. దీంతో మ్యాన్యువల్ పద్దతిని ఎంచుకున్నారు.  

చివరికి మాన్యువల్‌గానే డ్రిల్లింగ్‌..
డ్రిల్లింగ్ మిషన్ ధ్వంసం కావడంతో సాధారణంగా మనుషులతోనే తవ్వాల్సి వచ్చింది. మాన్యువల్ డ్రిల్లింగ్‌లో ఒకసారి ఒక వ్యక్తి మాత్రమే తవ్వడానికి వెళ్లేందుకు అవకాశం ఉంది. దీనికితోడు ఆ వ్యక్తి తనతో పాటు ఆక్సిజన్‌ను తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆ ఆక్సిజన్ కూడా ఒక గంట మాత్రమే ఉంటుంది. అంటే గంటకోసారి తవ్వే వ్యక్తిని మార్చాల్సి ఉంటుంది. దీంతో తవ్వే వేగం తగ్గింది.

దాదాపు 57 మీటర్ల మేర సొరంగం కూలింది. ఇందులో 47 మీటర్ల వరకు శిథిలాల గుండా ఆగర్‌ మెషీన్‌తో డ్రిల్లింగ్‌ చేశారు. కూలినభాగంలోని కాంక్రీట్‌ నిర్మాణ రాడ్లు.. డ్రిల్లింగ్‌ మెషీన్‌ బ్లేడ్లను ముక్కలుచేశాయి. దాంతో మెషీన్‌ను వెనక్కి లాగారు. కానీ మెషీన్‌ విరిగిపోయి ముక్కలు లోపలే ఉండిపోయాయి. ప్లాస్మా, గ్యాస్‌ కట్టర్‌లతో ముక్కలను విడివిడిగా కట్‌చేసి బయటకు తీశారు. ముక్కలన్నీ తీసేశాక అదే మార్గంలో దూరి కార్మికులు మ్యాన్యువల్‌గా రంధ్రం చేశారు. భారత సైన్యంలోని మద్రాస్‌ యూనిట్‌ ఇంజనీర్లు, ట్రెంచ్‌లెస్‌ ఇంజనీరింగ్‌ సంస్థల సంయుక్త బృందం మ్యాన్యువల్‌గా తవ్వడంలో సహాయం చేసింది. ఇందుకు ర్యాట్-హోల్ పద్దతిని ఉపయోగించారు. 

Uttarakhand Tunnel Collapse: ఉత్తరకాశీకి అంతర్జాతీయ టన్నెల్ రెస్క్యూ బృందాలు

రంగంలోకి ‘ర్యాట్‌–హోల్‌’ మైనింగ్‌ కార్మికులు
ఈ పని పూర్తిచేసేందుకు ‘ర్యాట్‌–హోల్‌’ మైనింగ్‌లో సిద్ధహస్తులైన కార్మికులను రప్పించారు. వీరు 800 మిల్లీమీటర్ల వ్యాసమున్న పైపు గుండా లోపలికి దూరి శిథిలాలకు రంధ్రం చేస్తూ ముందుకు కదిలారు. ఇలా 12 మీటర్ల మేర  డిల్లింగ్‌ చేయాలి. యూపీలోని ఝాన్సీకి చెందిన కార్మికులు ఇప్పటికే ఘటనాస్థలికి చేరుకున్నారు. ఝాన్సీకి చెందిన పర్సాదీ లోధీ, విపిన్‌ రాజ్‌పుత్‌ తదితరులను ఈ పనికి పురమాయించారు.
 
ఏమిటీ ర్యాట్‌–హోల్‌ పద్ధతి?
మేఘాలయలో ఈ పద్ధతి చాలా ఫేమస్‌. అక్రమ బొగ్గు గనుల్లో ఈ విధానంలోనే బొగ్గు తవ్వేస్తారు. ముందుగా గని ఉపరితలంపై మనిషి దూరేంత చిన్న రంధ్రం చేసి అందులోకి వెళ్లి సమాంతరంగా చిన్న చిన్న రంధ్రాలు చేస్తూ బొగ్గుపొరలను తొలుస్తారు. ప్రస్తుత ఘటనలో పదేళ్లుగా ఈ వృత్తిలో అనుభవం ఉన్న కార్మికులను రంగంలోకి దించారు. అయితే.. బొగ్గును వెలికితీయడం కాకుండా కార్మికులను కాపాడేందుకు ఈ పద్దతిలో పనిచేయడం ఇదే తొలిసారి.  600 మిల్లీమీటర్ల పైపులో కూడా దూరి పనిచేసిన అనుభవం ఉన్నట్లు పేర్కొన్న కార్మికులు.. ఇక్కడ 800 మిల్లీమీటర్ల పైపులోంచి వెళ్లి పనిచేశారు. 

ఇదీ చదవండి: Uttarkashi tunnel: నీదే దయ.. దేవుని ముందు ప్రణమిల్లిన ప్రొఫెసర్ ఆర్నాల్డ్ డిక్స్

Advertisement

తప్పక చదవండి

Advertisement