Sakshi News home page

ఎంపీ మహువా లోక్​సభ సభ్యత్వం రద్దుకు కేంద్రం చర్యలు!

Published Sat, Dec 2 2023 2:25 PM

Centre May Seek Mahua Moitra Disqualification After Ethics Panel's Report - Sakshi

డబ్బులు తీసుకొని పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా  లోక్​సభ సభ్యత్వాన్ని రద్దు చేసేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది. వ్యాపారవేత్త దర్శన్​ హీరానందానీ నుంచి డబ్బులు తీసుకొని పార్లమెంట్​లో ప్రధాని మోదీ, అదానీకి వ్యతిరేకంగా ప్రశ్నలు అడిగారంటూ నమోదైన కేసులో ఎథిక్స్​ ప్యానెల్​ తన నివేదికను లోక్​సభలో సమర్పించనున్న నేపథ్యంలో కేంద్రం ఈ చర్య చేపట్టనున్నట్లు సమాచారం. ఈ కేసులో ఎథిక్స్ ప్యానెల్ తన రిపోర్టును డిసెంబర్ 4న లోక్​సభ ముందు ప్రవేశపెట్టనుంది.

ఎథిక్స్​ కమిటీ చైర్​పర్సన్​ వినోద్​ కుమార్​ సోంకర్​ వచ్చే సోమవారం ప్యానెల్​ నివేదికను కేంద్రానికి సమర్పించే అవకాశం ఉంది. గత నెల నవంబర్ 9న ఎథిక్స్​ ప్యానల్​సమావేశమై కమిటీ.. మహువాను లోక్‌సభ సభ్యత్వం నుంచి బహిష్కరించాలంటూ చేసిన సిఫార్సును ప్యానెల్‌ ఆమెదించింది. లోక్​సభ స్పీకర్​కు ఈ నివేదికను సమర్పించింది. పార్లమెంట్‌ మెంబర్‌గా మొయిత్రా చర్యలు అత్యంత అభ్యంతరకరమైనవి, అనైతికమైనవి, హేయమైనవి, నేరపూరితమైనవని ఎథిక్స్‌ కమిటీ తన నివేదికలో పేర్కొంది. 

కాగా వ్యాపారవేత్త దర్శన్‌ హీరానందానీకి మేలు చేసేలా అదానీ గ్రూప్‌పై లోక్‌సభలో మొయిత్రా పలుమార్లు ప్రశ్నలు అడిగారంటూ గత నెలలో దుబే ఆరోపించడం తెలిసిందే. వ్యాపారవేత్త హీరానందానీ కూడా పార్లమెంట్​కు సమర్పించిన అఫిడవిట్లో తన నుంచి మోయిత్రా గిఫ్టులు తీసుకున్నట్లు పేర్కొన్నాడు.  హీరానందనీ నుంచి డబ్బులు తీసుకొని మోదీ, అదానీ టార్గెట్‌గా లోక్‌సభలో ప్రశ్నలు అడిగారని విమర్శిస్తూ లోక్‌సభ స్పీకర్‌కు దూబే ఫిర్యాదు చేశారు. దాంతో 15 మంది ఎంపీలతో కూడిన లోక్‌సభ నైతిక విలువల కమిటీ ఈ ఉదంతంపై దర్యాప్తు చేస్తోంది.

 ఈ కేసులో నిషికాంత్‌ దూబే, న్యాయవాది జై అనంత్‌ దేహాద్రాయ్‌లు ఇప్పటికే కమిటీ ముందు హాజరై.. తమ వాంగ్మూలాలను నమోదు చేశారు.  నవంబర్‌  రెండున  లోక్‌సభ ఎథిక్స్‌ ముందు విచారణకు హాజరైన మహువా.. ప్యానెల్‌ సభ్యులు అసభ్యకరమైన, చెత్త ప్రశ్నలు అడిగుతున్నారంటూ ఆగ్రహించి విచారణ మధ్యలోనే బయటకు వచ్చేశారు. అనంతరం  మహువా కేసులో ఎథిక్స్‌ కమిటీ 500 పేజీలతో కూడిన నివేదికను రూపొందించింది.

ఈ క్రమంలోనే బీజేపీ ఎంపీ వినోద్‌ కుమార్‌ సోన్కర్‌ నేతృత్వంలోని లోక్‌సభ నైతిక విలువల కమిటీ సమావేశమై ఈ నివేదికను పరిశీలించింది. అనంతరం 6:4తో ఈ నివేదికను కమిటీ ఆమోదించింది. పదిమందిలో ఆరుగురు సభ్యులు సిఫార్సుకు అనుకూలంగా, నలుగురు వ్యతిరేకంగా ఓటు వేసినట్లు కమిటీ తెలిపింది. మొయిత్రా అనధికారిక వ్యక్తులతో పార్లమెంట్‌ లాగిన్‌ ఐడిని షేర్‌ చేసుకున్నారని, దర్శన్ హీరానందానీ నుంచి నగదు, గిఫ్ట్‌లు తీసుకున్నారని కమిటీ నిర్ధారించిందని సోన్కర్‌ పేర్కొన్నారు. ఆమె చర్య తీవ్రమైన శిక్షకు కారణమని తెలిపారు. మహువా అనైతిక వ్యవహారంపై చట్టపరమైన, సంస్థాగత, కాలపరిమితితో కూడిన దర్యాప్తు చేపట్టాలని సిఫార్సు చేసినట్లు చెప్పారు.

Advertisement

What’s your opinion

Advertisement