Priya Nair: అమ్మ చూపిన దారిలో అపూర్వ విజయాలతో... | Sakshi
Sakshi News home page

Priya Nair: అమ్మ చూపిన దారిలో అపూర్వ విజయాలతో...

Published Sat, Oct 28 2023 3:53 AM

Priya Nair elevated to Unilever leadership team - Sakshi

అమ్మ నుంచి చందమామ కథలే కాదు స్ఫూర్తిదాయక విజయాలు ఎన్నో విన్నది ప్రియా నాయర్‌. మేనేజ్‌మెంట్‌ ట్రైనీగా దిగ్గజ కంపెనీలోకి అడుగు పెట్టిన ప్రియా నాయర్‌ తన కృషితో ఉన్నతస్థాయికి ఎదిగింది, కార్పొరేట్‌ ప్రపంచంలో విశేషమైన పేరు తెచ్చుకుంది. తాజాగా... బ్రిటిష్‌ మల్టీనేషనల్‌ కంపెనీ యూనిలీవర్‌లోని టాప్‌ టీమ్‌ యూనిలీవర్‌ లీడర్‌షిప్‌ ఎగ్జిక్యూటివ్‌ (యుఎల్‌ఈ)లో ఒకరిగా, ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ‘బ్యూటీ అండ్‌ వెల్‌బీయింగ్‌’గా ప్రియా నాయర్‌ నియామకం జరిగింది.

‘మీ రోల్‌ మోడల్‌ ఎవరు?’ అంటే మరో మాటకు తావు లేకుండా ప్రియా నాయర్‌ టక్కున చెప్పే మాట...‘మా అమ్మ’ డెబ్బై ఏడేళ్ల వయసులోనూ ముంబైలో వైద్యవృత్తిలో బిజీ బిజీగా ఉండేది. అట్టడుగు వర్గాల ప్రజలకు ఉచితవైద్యం అందించేది. ఇక కోవిడ్‌ సమయంలో ఆమె చేసిన వైద్యసేవలు అపారం. దురదృష్టవశాత్తు ఆమె కోవిడ్‌ బారిన పడింది. అదృష్టవశాత్తు అందులో నుంచి బయటపడింది. ‘పవర్‌ ఆఫ్‌ పర్పస్‌’ అంటే ఏమిటో తల్లి నుంచే నేర్చుకుంది ప్రియ.

‘మన ఉద్దేశం స్వచ్ఛమైనది అయితే అస్థిరత, అనిశ్చితిని అధిగమించే శక్తి దరి చేరుతుందని, ఆశావాదం మనతోనే ఉంటుందని అమ్మ నుంచి నేర్చుకున్నాను. కార్పొరేట్‌ జీవితంలో ఇది నాకు ఎంతగానో ఉపయోగపడింది’ అంటుంది ప్రియ.

తల్లి నుంచి ఆమె నేర్చుకున్న మరో పాఠం... నిరంతరం నేర్చుకోవడం. ప్రియ తల్లి ఎప్పుడూ ఏదో ఒక సెమినార్‌కు హాజరవుతూ ఉండేది. పుస్తకాలు చదువుతూ ఉండేది. వైద్యరంగంలో వస్తున్న సాంకేతికత గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ నోట్స్‌ రాసుకుంటూ ఉండేది.
‘క్షణం తీరిక లేని ఈ ఉరుకుల, పరుగుల కాలంలో నిరంతరం నేర్చుకోవడం అనేది కుదిరేది కాదు అనే అభిప్రాయాన్ని అమ్మ మార్చేసింది. వృత్తిరీత్యా ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఎప్పుడూ ఏదో కొత్త విషయం నేర్చుకుంటూ ఉండేది’ అంటుంది ప్రియ.

తల్లి నుంచి స్ఫూర్తి పొందిన ప్రియా నాయర్‌ హార్వర్డ్‌ ఎగ్జిక్యూటివ్‌ లీడర్‌షిప్‌ ప్రోగ్రామ్‌కు హాజరైంది. తనకు తిరిగి స్కూల్‌కు వెళ్లినట్లుగా అనిపించింది. ‘కార్పొరేట్‌ రంగంలో పాతిక సంవత్సరాల అనుభవం ఉన్న నాకు ఇది అవసరం లేదు’ అని అనుకోలేదు ప్రియా నాయర్‌. అక్కడ నేర్చుకున్న పాఠాలు ఆ తరువాత కాలంలో తనకు ఎంతగానో ఉపయోగపడ్డాయి.

ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పనిచేసినప్పుడు వినియోగదారుల ఆలోచనలపై దృష్టి పెట్టి మార్కెటింగ్‌ వ్యూహాలను ఎప్పటికప్పుడూ మారుస్తూ వచ్చింది. ఫలానా ప్రాడక్ట్‌కు మార్కెట్‌ లేదు... అనుకున్న చోట కూడా తన వ్యూహాలతో మార్కెట్‌ను సృష్టించేది. ప్రచారంలో కూడా ప్రత్యేకత కనిపించడానికి ప్రాధాన్యత ఇస్తుంది. అందులో సామాజిక సందేశం కూడా కనిపిస్తుంది.

మనకు ఓటమి అంటే భయం, చిరాకు, కోపం. పిల్లల ఓటమిని తల్లిదండ్రులు తట్టుకోలేరు. పిల్లలకు విజయం అనేది అతి పెద్ద సవాలు.
‘నువ్వు ఓడిపోతే ప్రళయం ఏమీ రాదు. గెలుపులాగే ఓటమి అనేది సహజమైనది. ఓటమి నుంచి నేర్చుకునే పాఠాలు విలువైనవి’ అనే భావనతో సంస్థ తరఫున క్యాంపెయిన్‌ను నిర్వహించింది ప్రియ.

కోవిడ్‌ సమయంలో హిందుస్థాన్‌ యూనిలీవర్‌ లిమిటెడ్‌ (హెచ్‌యుఎల్‌)లో పెద్ద విభాగమైన ‘బ్యూటీ అండ్‌ పర్సనల్‌ కేర్‌’ బాధ్యతల్లోకి వచ్చింది ప్రియ. కేవలం 30 రోజుల్లోనే తమ హైజీన్‌ బ్రాండ్‌లో కొత్తగా పదిహేను వేరియేషన్స్‌ తీసుకువచ్చింది. అందులో ఒకటైన హ్యాండ్‌ శానిటైజర్‌ మన దేశంలోని ‘లార్జెస్ట్‌ సెల్లింగ్‌ హ్యాండ్‌ శానిటైర్‌ బ్రాండ్‌’గా నిలిచింది. మేనేజ్‌మెంట్‌ ట్రైనీగా ‘హెచ్‌యుఎల్‌’లోకి అడుగుపెట్టిన ప్రియా నాయర్‌ అడుగడుగునా పాఠాలు నేర్చుకుంది. ఎన్నో హోదాల్లో పనిచేసింది. ప్రతి హోదాలో తనదైన ప్రత్యేకత నిలుపుకుంది.

‘ఏ పని అయినా సరే యాంత్రికంగా ఎప్పుడూ చేయవద్దు. మనసు పెట్టి చేయాలి’ అని తన చిన్నప్పుడు ఎప్పుడో ప్రియకు అమ్మ చెప్పింది.
అందకే ప్రియా నాయర్‌ ఏ హోదాలో పని చేసినా మనసు పెట్టి చేసింది. చేసే పనికి ఎప్పటికప్పుడు సృజనాత్మకమైన ఆలోచనలు జోడించింది. ఫలితం వృథా పోలేదని ఆమె విజయప్రస్థానం నిరూపించింది.

Advertisement
Advertisement